జ్వరం గుప్పిట్లో జనం

ABN , First Publish Date - 2022-08-12T07:29:03+05:30 IST

నిన్నటి వరకు వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా జనం ప్రస్తుతం వైరల్‌ జ్వరాలతో తల్లడిల్లుతున్నారు.

జ్వరం గుప్పిట్లో జనం
భైంసా ఏరియా ఆసుపత్రిలో వైరల్‌ జ్వర బాధితులు

జిల్లాను వణికిస్తున్న వైరల్‌ఫీవర్‌ 

వెంటాడుతున్న జలుబు, దగ్గు 

జిల్లాలో ఇప్పటి వరకు 2441 మందికి జ్వరాలు 

టైఫాయిడ్‌, మలేరియా నిర్ధారణ కాలేదంటున్న అధికారులు 

పారిశుధ్యమే అసలు సమస్య

నిర్మల్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : నిన్నటి వరకు వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా జనం ప్రస్తుతం వైరల్‌ జ్వరాలతో తల్లడిల్లుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లాలోని అనేక గ్రామాల్లో దగ్గు, జలుబులు తీవ్రరూపం దాల్చడమే కాకుండా చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. అధికారులు వైరల్‌ ఫీవర్‌లుగా అధికారికంగా పేర్కొంటున్నప్పటికీ లక్షణాలు మాత్రం మలేరియా, టైఫాయిడ్‌లను పోలినట్లుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా కుభీ ర్‌, తానూర్‌, లోకేశ్వరం, మామడ, సారంగాపూర్‌, లక్ష్మణచాంద తదితర మండలాల్లో జ్వరాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జ్వరాల తీవ్రత పెరుగుతుండడంతో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమై ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 516 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 2441 మంది వైరల్‌ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించారు. దీంతో పాటు 813 మంది డయేరియాతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొంటున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికి పారిశుధ్య సమస్య కారణంగా వైరల్‌ జ్వరాలు విభృంభిస్తున్నాయంటున్నారు. వాతావరణంలో వేడితీవ్రత తగ్గకపోవడం అలాగే వర్షాల కారణంగా నీరు నిలిచి ఉంటున్నందున ఈగలు, దోమలు వృద్ది చెందిన వైరల్‌ జ్వరాలతో పాటు డయేరియా లాంటి రోగాలు విస్తరిస్తున్నాయంటున్నారు. అలాగే జ్వరాల


కు తోడుగా దగ్గు, జలుబు కూడా సాధారణ ప్రజానీకాన్ని సతమతం చేస్తోంది. గత 20 రోజుల నుంచి ఓ వైపు జ్వరాలు, మరోవైపు డయేరియా, దగ్గు, జలుబు లాంటివి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారంతా ఆసుపత్రుల భాటపడుతున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలతో పాటు ఇక్కడి ప్రధాన జిల్లా ఆసుపత్రికి జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. అయితే జ్వర తీవ్రత తగ్గకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల బాటపడుతున్నారు. జ్వర పీడితులతో జిల్లా కేంద్రంతో పాటు బైంసా, ఖానాపూర్‌లలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు కిటకిటలాడుతున్నాయి. 

నెలలో 2441మందికి జ్వరాల గుర్తింపు

కాగా గత నెల రోజుల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ జిల్లావ్యాప్తంగా 541 వైద్యశిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించి 2441 మంది వైరల్‌ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించింది. అయితే వైద్య,ఆరోగ్యశాఖ నిర్దేశిత లక్ష్యం మేరకు రక్త పరీక్షల నమూనా శిబిరాలను సైతం చేపట్టింది. దీని కారణంగా జిల్లాలో మరింత మంది వైరల్‌ జ్వరాలతో సతమతమవుతున్నట్లు ఆ శాఖ స్పష్టం చేస్తోంది. అయితే వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని చాలా ప్రైవేటు ఆసుపత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశిం చిన మేరకు చికిత్సలు అందించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో జ్వర పీడితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారంటున్నారు. 

ప్రైవేటు ఆసుపత్రుల వద్ద క్యూ

ఇదిలా ఉండగా జ్వరాల తీవ్రత తగ్గకపోతుండడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాకుండా పట్టణ వాసులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబోరే


టరీల్లో మాత్రం టైఫాయిడ్‌, మలేరియాలు కూడా నిర్ధారణ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కలను మాత్రం వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఽధృవీకరించడం లేదు. ఇప్పటి వరకు 24,416 మంది ఔట్‌పేషంట్‌లకు రక్తపరీక్షలను నిర్వహించామని, ఇందులో ఏ ఒక్కరికి కూడా టైఫాయిడ్‌ గాని మలేరియా గాని పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని పేర్కొంటున్నారు. ఇందులో నుంచి కేవలం 2441 మందికి మాత్రం వైరల్‌ ఫీవర్‌ నిర్ధారణ అయ్యాయంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం జ్వరాల తీవ్రతతో రోగులు పెరిగిపోతుండడం అధికారుల లెక్కలకు పొంతనివ్వడం లేదు. ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోంలే కాకుండా ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు సైతం జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. 

పారిశుధ్యమే అసలు సమస్య

పల్లెల్లో ఇప్పటికే పలుసార్లు ఫాగింగ్‌తో పాటు దోమల మందులను పిచ్‌కారి చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటి చర్యలను చేపడుతున్నప్పటికి పారిశుధ్య సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. మురికి కాలువలతో పాటు గుంతల్లో నిలిచిపోయిన నీటికారణంగా ఈగలు, దోమలు తీవ్రంగా ప్రబలుతున్నాయంటున్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లోపంతో కూడా జ్వరాలు తీవ్రంగా విస్తరించడానికి కారణమవున్నాయని పేర్కొంటున్నారు. మరో రెండు నెలల పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఈ జ్వరాలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీలు సమిష్టిగా జ్వరాలను నిరోధించే కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-12T07:29:03+05:30 IST