మూన్నాళ్ల ముచ్చటగా ఎంసీహెచ్‌

ABN , First Publish Date - 2022-10-12T04:08:49+05:30 IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్‌ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి. జూన్‌లో సంభవించిన వరదల కారణంగా ఆసుపత్రి భవనాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేయించడంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం అలంకారప్రాయంగా మారింది.

మూన్నాళ్ల ముచ్చటగా  ఎంసీహెచ్‌
వృధాగా మిగిలిపోయిన ఎంసీహెచ్‌ భవనం

వరద ముంపుతో ఆసుపత్రిని ఖాళీ చేయించిన అధికారులు  

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాల లేమి  

ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు  

మంచిర్యాల, అక్టోబరు 11(ఆంరఽధజ్యోతి): మంచిర్యాల  జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్‌ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి. జూన్‌లో సంభవించిన వరదల కారణంగా ఆసుపత్రి భవనాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేయించడంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం అలంకారప్రాయంగా మారింది. ముందు చూపు లేకుండా వరద ముంపు ప్రాంతంలో నిర్మించడంతో పెద్ద మొత్తంలో ప్రజాధనం నీళ్లపాలైంది. ప్రస్తుతం భవనంలో ఆసుపత్రి కొనసాగకపోవడంతోపాటు ఇతరత్రా అవసరాలకు కూడా పనికి రాకుండా పోయింది. నీట మునిగిన నాటి నుంచి మూడు నెలలుగా భవనానికి తాళం వేసి ఉంది. భవనంలో వరద మిగిల్చిన బురదను కడిగి శుభ్రం చేయించినా దానిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం  నెరవేరడం లేదు. 

మూడు నెలలకే మూతపడిన ఎంసీహెచ్‌

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గర్భిణులు, బాలింతలు, శిశు వుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండాలనే తలంపుతో జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటైతే సౌకర్యాలు మెరుగుపడి మెరుగైన వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు ఆశనిపాతమే ఎదురైంది.  ప్రారంభించి మూడు నెలలు కూడా గడవక ముందే శాశ్వతంగా మూత పడింది. దీంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. రూ.17.50  కోట్ల అంచనా వ్యయంతో జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో గల భూదాన్‌ భూముల్లో  ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని భవన నిర్మాణం కోసం కేటాయించారు. దీనికి అదనంగా రోడ్లు, ప్రహరీ, ఇతర పనులకు దాదాపు మరో రూ.2 కోట్లను కేటాయించారు.  భవన నిర్మాణం పూర్తి చేసుకోగా మార్చి 4వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిం చారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అధునాతన పరికరాలతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం కొంత మేర ఇబ్బంది ఉన్నప్పటికీ గర్భిణులు, బాలింతలు, శిశువుల చికిత్స కోసం  బారులుతీరేవారు. మూడు నెలలపాటు సవ్యంగానే చికిత్స అందించిన ప్పటికి భారీ వర్షాల కారణంగా వరద రూపంలో ఆసుపత్రి  ఉనికిని ప్రమాదంలోకి నెట్టింది. జూలై  13న ఎల్లంపల్లి ప్రాజెక్టు  గేట్లు ఎత్తడంతో గోదావరి ఉప్పొంగి భారీ వరద ఆసుపత్రి భవనాన్ని ముంచెత్తింది. వరదలు వస్తున్నాయన్న సమాచారంతో రాత్రికి రాత్రే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రి సిబ్బంది చికిత్స పొందుతున్న మహిళలతో పాటు విలువైన సామగ్రిని హుటాహుటిన తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భవనం నిరుపయోగంగా మారింది.  

రోగులు ఫుల్‌... గదులు నిల్‌..

మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఖాళీ చేసిన అధికారులు  రోగులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మూడు నెలలుగా ఏరియా ఆసుపత్రిలోనే కొనసాగుతోంది. వైద్య సిబ్బంది పరంగా ఎలాంటి కొరత లేకపోయినా భవనం ఇరుకుగా ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇరుకు స్థలంలో మహిళలు చికిత్స పొందాల్సిన  పరిస్థితి నెలకొంది. గతంలో ఎంసీహెచ్‌ కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే 30 బెడ్‌లతో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయగా ప్రస్తుతం వందలాది మందికి అందులో చికిత్స అందిస్తున్నారు. బాలింతలకు లేబర్‌ రూంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పేషంట్‌ల సంఖ్యకు సరిపడా స్థలం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంసీహెచ్‌ భవనాన్ని ఖాళీ చేయించిన అధికారులు మూడు నెలలైనా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఈ పరిస్ధితి నెలకొంది.  మరో చోటనైనా వసతి కల్పించి మహిళలకు చికిత్స అందిస్తే సౌకర్యవం తంగా ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడంతో అరకొర సౌకర్యాలతో ఇరుకు గదుల్లో కష్టాలు పడుతున్నారు. గదుల కొరతతో వరండాల్లో కూడా చికిత్స అందించాల్సిన పరిస్దితి నెలకొంది.  

Read more