కల్లాల నిర్మాణాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-12-16T22:29:08+05:30 IST

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో యేటా రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దవుతోంది.

కల్లాల నిర్మాణాలకు బ్రేక్‌

బెల్లంపల్లి, డిసెంబరు 16: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో యేటా రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యాన్ని విక్రయించాలంటే ప్రభుత్వం సూచించిన మేరకు తేమ శాతం ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్ళాలి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కళ్ళాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉపాధిహామీ పథకం కింద నిర్మాణాలకు అవకాశం కల్పించింది. రైతులు కళ్ళాల నిర్మాణానికి ఆసక్తి చూపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళాల నిర్మాణాలకు నిధులు నిలిపివేయడంతో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

-కళ్లాల నిర్మాణానికి నిధులు బ్రేక్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళాల నిర్మాణానికి రైతులకు నిధులు మంజూరు చేశాయి. 75 ఫీట్ల కళ్ళానికి రూ. 75వేలు, 60 ఫీట్ల కల్లానికి రూ. 66 వేలు, 50 ఫీట్లకు రూ. 55 వేలు మంజూరు చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ, ఓసీ, బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీని అందించింది. పలువురు రైతులు ముందుకు వచ్చి కల్లాలను నిర్మించారు. జిల్లాలో 1714 కళ్ళాలు మంజూరు కాగా 182 మంది రైతులు ముందుకు వచ్చి నిర్మించుకున్నారు. దాదాపు 300లకు పైగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నెల నుంచి కొత్త కల్లాల నిర్మాణానికి అనుమతులను నిలిపివేశాయి. దీంతో కల్లాలు నిర్మించాలనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది.

-అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు

యేటా నవంబర్‌, డిసెంబరులో జిల్లాలో వరి కోతలు మొదలవుతాయి. ఈ సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతుల ధాన్యం తడిసి ముద్దవుతుంది. స్థలాలు లేక ధాన్యాన్ని రహదారుల వెంట, పొలాల వద్ద కుప్పలుగా ఉంచుతూ ఆరబోస్తున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ధాన్యం రోడ్డుపై పోస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

-కళ్లాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేయాలి

- జాడి మహేష్‌, బుచ్చయ్యపల్లి

కళ్ళాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిధులు నిలిపివేయడంతో రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. యేటా పంట కోత కోశాక వర్షాలు పడుతుండడంతో నష్టపోతున్నాం. ప్రభుత్వం కళ్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.

-ఇబ్బందులు పడుతున్నాం - ఓదెలు, పెద్దబూద

ధాన్యం కోతకు వచ్చిన దశలో వర్షాలు పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. వరిధాన్యం కుప్పలుగా పొలాల్లో ఉంచి కవర్లు కప్పినా తడిసిపోతుంది. దీంతో ధర తక్కువగా వస్తుండడంతో నష్టపోతున్నాం. కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపాలి.

Updated Date - 2022-12-16T22:29:12+05:30 IST