ఎడతెరిపి లేని వర్షం
ABN , First Publish Date - 2022-08-15T03:42:10+05:30 IST
రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. వేమనపల్లి సమీపంలోని మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో మత్తడి వాగు ఉప్పొంగింది. దీంతో వాగు అవతల ఉన్న సుంపుటం, జాజులపేట, కల్లెంపల్లి, ఒడ్డుగూడెం తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.

మంచిర్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) :మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో సగటున 7.8 మి.మీల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా వేమనపల్లిలో 19.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా దండేపల్లి మండలంలో 1.30 మిల్లీమీటర్ల వర్షం పడింది. భీమినిలో 15.0 మిల్లీమీటర్లు, కన్నెపల్లిలో 13.2 మిల్లీమీటర్లు, తాండూర్లో 12.3 మిల్లీమీటర్లు, నెన్నెలలో 8.0 మిల్లీమీటర్లు, బెల్లంపల్లి, జన్నారంలలో 7.6 మిల్లీమీటర్లు, మందమర్రిలో 6.70 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 148 మీటర్లకు గాను ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 145.75 మీటర్లు ఉంది. గరిష్ట సామర్ద్యం 20.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14.29 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,01,667 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 58272 క్యూసెక్కులు ఉంది. 12గేట్లు తెరిచి 57948 క్యూసెక్కులను దిగువన గోదావరిలోకి వదులుతున్నారు.
వేమనపల్లి : రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. వేమనపల్లి సమీపంలోని మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో మత్తడి వాగు ఉప్పొంగింది. దీంతో వాగు అవతల ఉన్న సుంపుటం, జాజులపేట, కల్లెంపల్లి, ఒడ్డుగూడెం తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మత్తడి వాగులో నాటుపడవల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. వర్షంతో గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. బుయ్యారం నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో నాగారం అటవీ ప్రాంతంలో మట్టి రోడ్డు అధ్వానంగా తయారై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.