ఆసుపత్రికి అందలం

ABN , First Publish Date - 2022-10-01T07:14:36+05:30 IST

జిల్లా ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి.

ఆసుపత్రికి అందలం
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి ఇదే

జిల్లా ఆసుపత్రికి మరో 50 పడకలు మంజూరు 

రూ.50లక్షల వ్యయంతో గదుల నిర్మాణం 

ఇప్పటికే 23 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామకం 

మారనున్న ప్రసూతి ఆసుపత్రి రూపురేఖలు 

నిర్మల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి వందబెడ్‌ల సౌకర్యం అందుబాటులో ఉండగా అదనంగా మరోయాభై పడకల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని కోసం గానూ ఆసుపత్రిపై అంతస్తులో 50 పడకల గదులను నిర్మించేందుకు అవసరమైన రూ.50లక్షలను మంజూరు చేసింది. అలాగే మరికొద్ది రోజుల్లో సిటీస్కాన్‌ యంత్రాన్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీటీస్కాన్‌ యంత్రం ఇక్కడి జిల్లా ఆసుపత్రికి మంజూరైన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాలతో ఈ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఆలస్యమవుతోందంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ విజయవంతంగా నడుస్తోంది. డయాలసిస్‌ కోసం స్లాట్‌బుకింగ్‌ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నారు. అలాగే అన్నిరకాల రక్తపరీక్షలకు సంబంధించిన డయాలసిస్‌ హబ్‌ను కూడా ఇక్కడే కొనసాగుతోంది. వీటన్నింటికి తోడుగా జిల్లాకు ఇటీవల మెడికల్‌ కాలేజీ మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. దీనికి సంబంధించిన జీఓ కూడా ఇటీవలే విడుదలైంది. ఇందులో భాగంగానే జిల్లా ఆసుపత్రికి 23 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థాయి గల స్పెషలిస్టు వైద్యాధికారులను నియమించారు. వీరి ద్వారా ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో రోగులకు వివిధ వ్యాధులకు సంబంధించిన సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. కాగా ఇక్కడి ప్రసూతి ఆసుపత్రిలో కూడా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మెడికల్‌ కాలేజీ కోసం ఇప్పటికే 25 ఎకరాల స్థలాన్ని సైతం సేకరించారు. జిల్లా ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిని ప్రసూతి ఆసుపత్రిగా మార్చనుండగా, ఇక్కడి జిల్లా ఆసుపత్రిని అయ్యప్ప ఆలయ సమీపంలోకి మార్చనున్నారు. ఈ ఆసుపత్రులన్నీ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా కొనసాగనున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లా ఆసుపత్రితో పాటు ప్రసూతి ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగవుతున్నందున ఔట్‌పేషంట్స్‌ రోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు రోగులకు సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల భారం పేద రోగులకు తగ్గుతోందని చెబుతున్నారు. సిటీస్కాన్‌ యంత్రం పనిచేయడం మొదలుపెడితే ప్రైవేటు ఆసుపత్రులపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్నారు. ఇక్కడి జిల్లా ఆసుపత్రిలో గత కొంతకాలం నుంచి సేవలు విస్తృతమవుతుండడమే కాకుండా ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పేదరోగులు ఇటువైపే దృష్టి సారిస్తున్నారు. అలాగే ఇక్కడి ప్రసూతి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్న కారణంగా జిల్లా నలుమూలల నుంచి గర్భిణీ స్ర్తీలు ప్రసూతి సేవల కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు. కొన్ని సమయాల్లో ఇక్కడ బెడ్‌లు కూడా సరిపోని పరిస్థితి నెలకొంటోంది. ఇలా మెరుగైన సౌకర్యాలు, ఆధునిక హంగులతో ప్రభుత్వాసుపత్రి ప్రైవేటుకు ధీటుగా నిలుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరో 50 పడకల నిర్మాణం

ఇదిలా ఉండగా జిల్లా ఆసుపత్రి పై భాగంలో మరో 50 పడకల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న వంద పడకలకు ఈ 50 పడకలు అదనం కానున్నాయి. దీంతో 150 పడకల సౌకర్యంతో జిల్లా ఆసుపత్రి ఇన్‌పేషంట్‌ రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించే అవకాశం ఏర్పడనుంది. చాలా రోజుల నుంచి వంద పడకలు సరిపడకపోతున్న కారణంగా రోగులకు ప్రత్యామ్నాయ సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. ఆసుపత్రిపై భాగంలో నిర్మించబోతున్న 50 పడకల కారణంగా రోగులకు లిప్ట్‌సౌకర్యం కూడా కల్పించే దిశగా యోచిస్తున్నారు. కొత్తగా నిర్మించబోతున్న 50 పడకల గదులకు ఆక్సిజన్‌ సౌకర్యంతో పాటు సూపర్‌ స్పెషాలిటీ సౌకర్యాలను సమకూర్చనున్నారు. అన్ని రకాల వైద్యసేవలు, పరీక్షల సౌకర్యమంతా ఒకే చోట అందుబాటులో ఉండడంతో రోగులకు సమీకృత సేవలు దక్కనున్నాయని చెబుతున్నారు. 

ఇప్పటికే 23 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామకం

కాగా జిల్లా ఆసుపత్రికి ఇటీవలే 23 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రొఫెసర్‌లంతా ప్రస్తుతం విధుల్లో చేరడమే కాకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను రోగులకు అందిస్తున్నారు. వీరంతా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న మెడికల్‌ కాలేజీలో తమ సేవలను అందించనున్నారు. దీనికి అనుగుణంగానే వీరి నియామకాలు జరిగినట్లు చెబుతున్నారు. ఏడాది ముందు నుంచే వీరికి ఇక్కడి వాతావరణంతో పాటు ఈ ప్రాంతం ప్రజల ఆరోగ్య పరిస్థితులు, ప్రత్యామ్నాయ అంశాలపై వీరికి అవగాహన కలగనుంది. దీనికి అనుగుణంగానే ప్రభు త్వం ఇటు మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై యుద్ద ప్రాతిపాదికన చర్యలు కొనసాగిస్తూనే భోధనకు, వైద్యసేవలకు అవసరమయ్యే ప్రొఫెసర్‌ల నియామకం కూడా పూర్తి చేసింది. 

మారనున్న ప్రసూతి ఆసుపత్రి రూపురేఖలు

ఇదిలా మారనుండగా మరో ఏడాది తరువాత ప్రస్తుతం ఉన్న ప్రసూ తి దవాఖానాను జిల్లా ఆసుపత్రికి తరలించనున్నారు. జిల్లా ఆసుపత్రి కోసం చేపట్టిన నిర్మాణ పనులు పూర్తి కాగానే ఈ ఆసుపత్రి అక్కడికి తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రి భవనంలోకి మెటర్నిటీ ఆసుపత్రిని తరలించి ఇక్కడ మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రసూతి సేవలతో పాటు అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కూడా ఇక్కడే ప్రత్యేక వైద్యసేవలను అందుబాటులో ఉంచుతారు. దీని కారణంగా ప్రసూతి ఆసుపత్రి సేవలు మరింత విస్తరించనున్నాయి. మొత్తానికి ప్రభుత్వ దవాఖానాల రూపురేఖలు మారబోతుండడం, ఆ దవాఖానాల ద్వారా ఉన్నతస్థాయి వైద్యం అందబోతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read more