భలే మంచి బేరం

ABN , First Publish Date - 2022-03-05T07:01:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయుల మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు పచ్చజెండా ఊపడంతో ఉపాధ్యాయులు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ, వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలు, దూరభారంతో కొందరు ఉపాధ్యాయులు ఇతర జిల్లాలలో పనిచేయలేక

భలే మంచి బేరం
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

జిల్లాలో మొదలైన టీచర్ల పరస్పర బదిలీల దరఖాస్తుల ప్రక్రియ

ఈనెల 15వరకు అవకాశం ఉండడంతో అంతటా హడావుడి

విల్లింగ్‌ ఉపాధ్యాయుల కోసం వెతుకులాట షురూ..

గుడ్‌విల్‌ పేరిట రూ.లక్షల్లో బేరసారాలు

సొంత జిల్లాకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు

ఆదిలాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయుల మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు పచ్చజెండా ఊపడంతో ఉపాధ్యాయులు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ, వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలు, దూరభారంతో కొందరు ఉపాధ్యాయులు ఇతర జిల్లాలలో పనిచేయలేక పరస్పర బదిలీలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ బదిలీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆరాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317ను అమలు చేయడంలో భాగంగా గత డిసెంబరులో చేపట్టిన జోనల్‌ విధానంతో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. జోనల్‌ విధానంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరిన కొందరు ఉపాధ్యాయులు మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్లుగానే మార్చి 3 నుంచి పరస్పర బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం కావడంతో బేరసారాలు ఊపందుకుంటున్నాయి. అంతేకాకుండా తమకున్న ఆర్థిక పరపతి, పరిచయాల ద్వారా కొందరు సీనియర్‌ ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

వెంటాడుతున్న జోనల్‌ భయం

జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులకు జోనల్‌ భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లా కాస్త రెండు జోన్లుగా విడిపోవడంతో ఉపాధ్యాయుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. జిల్లా బాసర జోన్‌ కిందకు రాగా, ఆసిఫాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కాలేశ్వరం జోన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఇంకెప్పటికీ సొంత జోన్‌లోకి రామనే భావనతో ఉపాధ్యాయులు కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బదిలీ అవకాశంతో ఎలాగైనా సొంత జోన్‌లోకి వెళ్లాలనే తపన కనిపిస్తోంది. బదిలీ దరఖాస్తులకు ఈనెల 15వరకు అవకాశం ఉండడంతో హడావుడి మొదలయ్యింది. విల్లింగ్‌ ఉపాధ్యాయుల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి జిల్లాకు వచ్చేందుకు వందలాది మంది ఎదురు చూస్తుండగా.. జిల్లా నుంచి ఆసిఫాబాద్‌ జిల్లాకు వెళ్లేందుకు మాత్రం ఎవరు ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదంటున్నారు. జోన్‌ విభజనతో జిల్లా నుంచి సుమారుగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులు నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు బదిలీపై వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో జిల్లాలో విల్లింగ్‌ దొరకడమే కష్టంగా మారిందంటున్నారు. ఒకవేళ దొరికినా నానా తంటాలు పడి పరస్పర బదిలీకి అంగీ కారం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. 

రహస్యంగా ఒప్పందాలు

మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు అంగీకరించిన ఉపాధ్యాయులతో రహస్యం గా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. హోదా, జిల్లా పరిస్థితులను బట్టి గుడ్‌విల్‌ పేరిట డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిర్మల్‌ జిల్లాకు వెళ్లేందుకు కొంత సానుకూలంగానే కనిపిస్తున్నా.. ఉపాధ్యాయులు ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో భారీగానే డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు యూనియన్‌ నేతల సహకారంతో రాయబారం పంపుతూ బేరసారాలకు దిగుతున్నారు. కొందరైతే రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకైనా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారితో పాటు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువగా పరస్పర బదిలీపై ఆసక్తి చూపుతున్నారు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన సొమ్మును తీసుకుని ట్రాన్స్‌ఫర్‌ ఫారాలపై సంతకాలు చేస్తూ దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈనెల 15 వరకు అవకాశం

పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఈనెల 15వరకు అవకాశం కల్పించిం ది. దీంతో బదిలీకి ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయుల్లో హడావుడి మొదలయ్యింది. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది. విల్లింగ్‌ ఇస్తున్న వారి అంగీకారంతో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసి ట్రాన్స్‌ఫర్‌ ఫారంపై సంతకాలు చేసిన పత్రాలను జిల్లా విద్యాశాఖ అధాకారికి అందించాలి. ఒకసారి అప్‌లోడ్‌ చేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని తెలుస్తుంది. ఇద్దరు ఒకేసారి దరఖాస్తు చేస్తే రిజక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యింది

: ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు మార్చి 3నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యింది. ఈ నెల 15 వరకు అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు రెండు  దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇద్దరి సమ్మతి ఉంటేనే బదిలీకి అవకాశం ఉంటుంది. సేమ్‌ సబ్జెక్టు, ఒకే క్యాడర్‌ వారికి మాత్రమే బదిలీ  అవకాశం ఉంటుంది. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత పరిశీలించి               బదిలీలను చేపడుతాం.

Updated Date - 2022-03-05T07:01:01+05:30 IST