నిండా నిర్లక్ష్యం!
ABN , First Publish Date - 2022-12-15T01:34:36+05:30 IST
ఆదివాసీ గిరిజనుల నుంచి అటవి ఉత్పత్తులను సేకరించి మార్కెట్లో విక్రయించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన సూపర్ మార్కెట్‌లలో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
అందుబాటులో లేని అటవీ ఉత్పత్తులు
ఆదివాసీ గిరిజనులకు కరువైన ఉపాధి
పట్టించుకోని ఐటీడీఏ అధికారులు
జిల్లావ్యాప్తంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు
ఆదిలాబాద్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజనుల నుంచి అటవి ఉత్పత్తులను సేకరించి మార్కెట్లో విక్రయించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన సూపర్ మార్కెట్‌లలో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ప్రారంభంలో హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత అసలు విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులపై ప్రజల్లో మంచి ఆధరణ కనిపిస్తున్న అధికారుల నిండు నిర్లక్ష్యంతో ఆదివాసీ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి. అటవీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీలు దళారుల బారీన పడకుండా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారానే అటవీ ఉత్పత్తులను సేకరించి నిత్యావసరాల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, రైతు బజార్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉట్నూర్ మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌లలో సూపర్ మార్కెట్‌లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. అవసరమైన స్టాక్ అందుబాటులో లేకపోవడంతో విక్రయాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. అలాగే ఇచ్చోడ, బోథ్ మండలాల్లోను జీసీసీ సూపర్ మార్కెట్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అటవీ ఉత్పత్తుల కోసం వినియోగదారులు సూపర్ మార్కెట్‌ల కు వస్తున్న కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందనే చెప్పవచ్చు.
నామ్‌కే వాస్తేగా విక్రయాలు
గిరిజన సూపర్ మార్కెట్‌లలో నామ్‌కే వాస్తేగానే విక్రయాలు జరుగుతున్నాయి. వాస్తవానికి 15 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి సూపర్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచాలి. కానీ కేవలం తేనే నిల్వలతోనే అధికారులు సరిపెడుతున్నారు. మిగితా 14 రకాల ఉత్పత్తులు కనిపించకుండానే పోతున్నాయి. ఇందులో ఇప్పపువ్వు, ఇప్ప గింజలు, తేనే మైనం, మారెడు గడ్డలు, చింతపండు, ఎండు ఉసిరి పప్పు, విషముష్టి గింజలు, చిల్ల గింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, కుంకుడుకాయలు, నల్లజీడి గింజలు, కానుగ గింజలను అందుబాటులో ఉంచడమే లేదు. ఆయుర్వేద మందుల తయారీలోనూ అటవీ ఉత్పత్తులను వినియోగిస్తారు. పేరుకే గిరిజన సూపర్ మార్కెట్ అయినా.. ఇతర మార్కెట్ల మాదిరిగానే విక్రయాలు జరుగుతున్నాయి. అటవీ ఉత్పత్తులను సేకరించి అందుబాటులో ఉంచితే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు జీసీసీకి అధిక ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడనుంది. బయట మార్కెట్‌లో అటవీ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉపయోగాలపై అదికారులు ఏమాత్రం ప్రచారం కూడా చేయడం లేదు. ఈ కారణంగా జీసీసీ సూపర్ మార్కెట్‌ల లక్ష్యం నెరవేరకుండానే మరుగున పడిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గిరిజనుల వలస బాట
స్థానికంగా ఉపాధి దొరక్కపోవడంతో ఆదివాసీ గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. గిరిజన తెగలలో కొన్ని తెగలు పూర్తిగా అటవీ ఉత్పత్తులపైననే ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వారికి అండగా నిలవాల్సిన ఐటీడీఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి. తరతరాలుగా అటవీ ఉత్పత్తులనే నమ్ముకుంటూ వస్తున్న ఆదివాసీలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అడవుల్లో సేకరించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించక పోవడంతో ఆసక్తి చూపడం లేదు. పట్టణాలకు వలస వెళ్తూ కూలీలుగా మారి పరిశ్రమలు, హోటళ్లు, కిరాణ షాపులు, రెడ్‌మేడ్ షోరూంలలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గిరిజనులకు స్థానికంగానే ఉపాధిని కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నా.. వారికి అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గిరిజనుల సమాగ్రాభివృద్ధికి ఐటీడీఏను ఏర్పాటు చేసినా.. ఏమాత్రం ప్రయోజనం లేదంటున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడదూరంగానే గిరిజన గూడాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్తోమత లేకపోవడంతో విద్య, వైద్యానికి కూడా నోచుకోవడం లేదు. పేదరికం కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి లో కనిపిస్తున్నారు. అందుబాటులో ఉన్న పోడు భూములను సాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నా.. అటవీ శాఖాధికారులు అడ్డుకుని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఉపాధి అవకాశాలు కరువవ్వడంతో ఆదివాసీలను ఇప్పటికీ పేదరికం వెంటాడుతూనే ఉంది.
అటవీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతాం
: ఎల్‌కే రమణానందం, జీసీసీ డీఎం, ఉట్నూర్
వినియోగదారులకు అవసరమైన అటవీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతాం. ప్రస్తుతం తేనె సంబంధిత వస్తువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగితా ఉత్పత్తులను డిమాండ్ మేరకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం.