‘నకిలీ’ ముప్పు

ABN , First Publish Date - 2022-05-19T04:55:55+05:30 IST

సాగుకు ముందే నకిలీ పత్తి విత్తనాల రాక జోరందు కుంది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి కొంద రు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

‘నకిలీ’ ముప్పు
జైపూర్‌లో విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు(ఫైల్‌)

- జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల జోరు 

- గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగడుతున్న అక్రమార్కులు 

-  యేటా అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్న వైనం 

- ఈ ఏడాది 1.90 లక్షల ఎకరాల్లో పత్తి  సాగవుతుందని అంచనా

కోటపల్లి, మే 18: సాగుకు ముందే నకిలీ పత్తి విత్తనాల రాక జోరందు కుంది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి కొంద రు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సరిహద్దులు దాటి తెలంగాణకు ఈ నకిలీ విత్తనాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో అధికారుల తనిఖీల్లో 42 లక్షల రూపాయల విలువైన 14 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు దళారులు గ్రామాల్లో తిరుగుతూ అన్నదాతలను బురిడి కొట్టస్తున్నారు. 

- వానాకాలం సాగు..

వానాకాలం సాగు కాలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్నదాతలు సేద్యం పనులు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం నుంచి విత్తనాలను ఇక్కడకు సరఫరా చేస్తూ నకిలీ విత్తనదారుల ఏజెంట్లు గ్రామాల్లో వీటిని అన్నదాతలకు అంటగడుతున్నారు. జిల్లాలో గత సంవత్సరం 1.60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా ఈ సంవత్సరం 1.90 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. దీని కోసం వేల క్వింటాళ్లు పత్తి విత్తనాలు అవసరం ఉండగా రైతుల అవసరాన్ని నకిలీ విత్తన ఏజెంట్లు సొమ్ము చేసుకుం టున్నారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. అక్కడ సాగయ్యే సాధారణ రకాలనే బీటీ అని చెప్పి ప్రముఖ కంపెనీల పేర్లు ఉన్న ప్యాకెట్లలో ప్యాక్‌చేసి ఇక్కడి రైతులకు అంటగడుతున్నారు. జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి ,భీమిని మండలాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండగా, పక్క రాష్ట్రం నుంచి నకిలీ విత్తనాల దిగుమతి సులువవుతుంది. ఇక్కడకు చేరుకున్న విత్తనాలను జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు ఇచ్చి మోసగించడంతో పాటు చెన్నూరు, మంచిర్యాల, గోదావరిఖని మీదుగా జయశంకర్‌భూపాలపల్లిజిల్లా, పెద్దపల్లి జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. 

- పట్టుబడిన ఘటనలు..

- గత ఏడాది ఏప్రిల్‌ 6న మహారాష్ట్ర నుంచి తెలంగాణకు కారులో సరఫరా అవుతున్న 3 లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనా ల ను కోటపల్లి మండలంలోని అంతర్‌ రాష్ట్ర వంతెన వద్ద కోటపల్లి పోలీసులు పట్టుకున్నారు.ఈ ఘటనలో ఇద్దరు నిందితులను జైలుకు పంపారు.

- ఈ ఏడాది గత నెల 23న కర్ణాటకలోని సింగనూరు నుంచి జిల్లాలోని కన్నెపల్లి మండలానికి బొలేరో వాహనంలో సరఫరా చేస్తున్న 24 లక్షల రూపాయల విలువైన 12 క్వింటాళ్ల నిషేధిత విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. 

- ఈ ఏడాది ఏప్రిల్‌ 21న భీమిని మండలం రాజరాం, చిన్నగుడిపేట వద్ద 61 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.

- గత నెల 21న జిల్లాలోని జన్కాపూర్‌ సమీపంలో కన్నెపల్లి పోలీసులు జరిపిన తనిఖీల్లో 60 కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.

- ఈ నెల 1న కన్నెపల్లి మండలం  సుర్జాపూర్‌ గ్రామం వద్ద పది కిలోల నకిలీ విత్తనాలను పట్టుకుని పోలీసులు పట్టుకున్నారు.

- ఈ నెల 6న భీమిని మండలం ఖర్జీభీంపూర్‌ గ్రామంలో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. 

- మారుమూల గ్రామాల్లో అడ్డా..

నకిలీ విత్తన దళారులు మారుమూల గ్రామాలను అడ్డాలుగా ఎంచు కుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఆంధ్ర సెటిలర్స్‌ ఇక్కడి భూములను కౌలుకు తీసుకుని పత్తి పంటలు సాగు చేస్తుండగా వారి కనుసన్నల్లో ఈ విత్తన దందా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వ్యాపారులు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వారికి భారీగా పారితోషికాలు అందిస్తూ రైతులకు విత్తనాలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో నకిలీ విత్తన దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ద్ధిల్లుతుంది...

- టాస్క్‌ఫోర్స్‌ దాడులతో..

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వారం రోజులుగా దాడులు చేస్తున్నారు. అయితే ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రస్తుతం అధికారిక దుకాణాలు, గోదాముల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. అధికారుల కన్ను గప్పి  వ్యాపారులు నకిలీ విత్తనాలను గ్రామీణ ప్రాంతా ల్లోని స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. కమిషనరేట్‌ స్ధాయి నుంచి వచ్చిన అధికారుల బృందాలు బెల్లంపల్లి, భీమిని, చెన్నూరు ప్రాంతాల్లోని దుకాణాలు, గోదాములను తనిఖీ చేశాయి. కాగా అంతా సక్రమంగా ఉండడంతో నకిలీ విత్తనాలు ఎక్కడకు చేరాయనేది సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుంది. మరిన్ని రోజులు గడిస్తే రైతులు విత్తనాలు విత్తే అవకాశం ఉంది. పంట కాలం ప్రారం భమయ్యాక తనిఖీలు చేయడం కన్నా ప్రస్తుత సమయంలోనే గ్రామాల్లో నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.ఇప్పటి నుంచి పూర్తిస్ధాయిలో దృష్టి పెడితేనే టాస్క్‌ఫోర్స్‌ దాడులతో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సరిహద్దులు దాటి వస్తున్న ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాల్సి ఉంది.

- రైతులకు అవగాహన..

ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత ఏవోలు, ఏఈవోలు, సహాయ సంచాలకులు నకిలీ విత్తనాలపై రైతులకు అవగా హన కల్పించారు. అన్నదాతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నా రు.  వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అనుమతి పొందిన డీలర్ల వద్ద నే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కొనుగోలు చేసిన వాటి బిల్లులపై రశీదు నంబర్‌, రకం, గడువు తేదీ, డీలర్‌ సంతకం ఉండేలా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. పంటకాలం పూర్తయ్యేంత వరకు రశీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పంట నష్టపోతే రశీదు కీలకంగా మారుతుందని, దీని ద్వారానే సంబంధిత కంపెనీ రైతుకు పరిహారం ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

 ముమ్మరంగా తనిఖీలు..

- కల్పన, జిల్లా వ్యవసాయాధికారి 

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరం చేశాం.  ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నకిలీ విత్తనాల పై అవగాహన కల్పించాం. పక్క రాష్ట్రం నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నాయనే సమాచారం ఉండడంతో ముమ్మరంగా దాడులు చేపట్టాం. అనుమాన ప్రాంతాల్లోని దుకాణాలపై తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటికే 42 లక్షల రూపాయల విలువైన నిషేధిత విత్తనాలను పట్టుకుని సీజ్‌ చేశాం. గ్లైఫోసెట్‌ వాడకం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని రైతులు గమనించాలి. అలాగే భూసారం కూడా చెడిపోతుంది. వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృం దాలను ఏర్పాటు చేశాం. కమిషనరేట్‌ నుంచి ఉన్నతాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. గ్రామాల్లో ఎవరైనా విత్తనా లు అమ్మినట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి. నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-19T04:55:55+05:30 IST