ప్రభుత్వ భూములు ఆక్రమణ

ABN , First Publish Date - 2022-12-09T23:01:44+05:30 IST

పట్టణంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు ప్రభుత్వ భూములపై కన్నేశారు.

ప్రభుత్వ భూములు ఆక్రమణ

బెల్లంపల్లి, డిసెంబరు 9: పట్టణంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. సంబంధిత అధికారుల ఉదాసీనత, రికార్డులోని లోపాలను ఆసరాగా చేసుకుని భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. వీరికి రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఈ వ్యవహారం సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా పాలిటెక్నిక్‌ కళాశాలను ఆనుకుని 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి కంచె నిర్మించారు.

-6 ఎకరాల భూమి కబ్జా...విలువ రూ. 4 కోట్లకు పైనే...

బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలను ఆనుకుని ఆక్రమణ దారులు ఇటీవల సర్వే నెంబరు 170లోని ఆరు ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఈ భూమి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.4 కోట్ల పైనే ఉంటుం దని అంచనా. భూమి చుట్టూ కంచెను నిర్మించారు. ఎవరికి అనుమానం రాకుండా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. గుంట భూమి రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆక్రమించిన భూమి పక్క న నిర్మిస్తున్న ఫుడ్‌ జోన్‌ రహదారులు రావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కబ్జాదారులు ప్రజాప్రతినిధుల పేర్లను అడ్డం పెట్టుకుని ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. ఈ దందా వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప టికే కబ్జా చేసిన భూమిలో ఆక్రమణదారులు ప్లాట్లుగా విక్రయించారు. ఆరెకరాల పక్కన ఉన్న మరో ఎకరం కూడా కబ్జాచేసి కంచె వేసి అమ్మకానికి సిద్ధంగా పెట్టారు. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి ప్రజలు మోసపోయిన సందర్భాలున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా చూడడంతోపాటు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

-అధికారులు కట్టడాలు కూల్చినా ఆగని కబ్జాలు..

అంబేద్కర్‌, రవీంద్ర నగర్‌కు వెళ్లే దారిలో సర్వే నంబరులోని దాదాపు 6 ఎకరాల లావణీ పట్టా భూమిని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా విక్రయించారు. లావాణీ పట్టా భూమిని కొనుగోలు, అమ్మకాలు చేయవద్దని నిబంధనలు ఉన్నా రియల్‌ వ్యాపా రులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. లావణీ పట్టా భూమిని గుంటకు రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు విక్రయాలు జరిపారు. కొనుగోలు చేసిన పలువురు ఇందులో సిమెంటు ఇటుకలతో చిన్నపాటి రూమ్‌లను నిర్మించారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం గదులను తొలగించి ప్రభుత్వ భూమి అని కొనుగోలు, అమ్మకాలు చేయరాదని బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకే రియల్‌ వ్యాపారులు బోర్డును తొలగించి లావణీ పట్టా భూమి చుట్టూ ఫెన్సింగ్‌ స్తంభాలు ఏర్పాటు చేసి మళ్లీ విక్రయాలు చేపడు తున్నారు. అలాగే రవీంద్రనగర్‌ వెళ్లే దారిలోని సర్వే నెంబరు 170 ప్రభుత్వ భూమిలో కొందరు నాయకులు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూమిని గుంటకు రూ.3 లక్షలకు విక్రయిస్తు న్నారు. కొందరు కొనుగోలు చేసి సిమెంటు ఇటుకలతో తాత్కాలిక షెడ్లను నిర్మిస్తూ ఇంటి నంబర్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

- కుమారస్వామి, తహసీల్దార్‌, బెల్లంపల్లి

ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తే ఉపేక్షించేది లేదు. పాలిటెక్నిక్‌ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే విషయం తమ దృష్టికి రాలేదు. ప్రభుత్వ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే మోసపోతారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-12-09T23:01:48+05:30 IST