ఓపెన్‌కాస్టు వద్దు

ABN , First Publish Date - 2022-03-06T03:44:56+05:30 IST

ఇందారం సింగరేణి ఓపెన్‌కాస్టు గని విస్తరణ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఓసీపీని విస్తరించడం ద్వారా 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల బొగ్గు వెలికి తీసేందుకు సింగరేణి అధికారులు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించారు. ఓపెన్‌కాస్టు గని ఏర్పాటుకు తమ భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు. రైతులు ఇటీవల భూ నిర్వాసితుల కమిటీగా ఏర్పడి తీర్మానం చేశారు.

ఓపెన్‌కాస్టు వద్దు

భూములు ఇచ్చేందుకు నిరాకరణ

ప్రత్యేక కమిటీగా ఏర్పడ్డ రైతులు

సందిగ్ధంలో ఇందారం ఓసీపీ విస్తరణ

మంచిర్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇందారం సింగరేణి ఓపెన్‌కాస్టు గని విస్తరణ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఓసీపీని విస్తరించడం ద్వారా 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల బొగ్గు వెలికి తీసేందుకు సింగరేణి అధికారులు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించారు. ఓపెన్‌కాస్టు గని ఏర్పాటుకు తమ భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు.  రైతులు ఇటీవల భూ నిర్వాసితుల కమిటీగా ఏర్పడి తీర్మానం చేశారు. జైపూర్‌ మండలం ఇందారంలో గతంలో ఉన్న సింగరేణి శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఐకే-1, 1ఏ గనులను కలుపుతూ యాజమాన్యం 2020 సెప్టెంబరులో ఇందారం ఓపెన్‌కాస్టు గనిగా ఏర్పాటు చేసింది. 28 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఓసీపీ ఏర్పాటు చేయగా అప్పట్లో గనుల స్థలం పోనూ గ్రామ రైతుల నుంచి 1,100 ఎకరాల భూమిని సేకరించారు. ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఓసీపీని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు మరో 350 ఎకరాల స్థలం అవసరం కాగా సమీపంలోని టేకుమట్ల గ్రామ రైతుల నుంచి భూ సేకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

రెవెన్యూశాఖ ద్వారా నోటిఫికేషన్‌

భూ సేకరణలో భాగంగా సింగరేణి అధికారులు రెవెన్యూశాఖ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయించారు. భూములు ఉన్న రైతులకు ఈ మేరకు సమాచారం అందజేశారు. అయితే ఓసీపీకి భూములు ఇచ్చేందుకు అన్న దాతలు నిరాకరిస్తున్నారు. ఓసీపీ ప్రారంభించినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా చుట్టుపక్కల ఉన్న భూములు బీళ్లుగా మారడంతో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఓపెన్‌కాస్టు గని పేలుళ్ల కారణంగా సమీపంలోని ఇళ్ల గోడలు బీటలు వారడంతోపాటు, బ్లాస్టింగ్‌ శబ్దాలు ఇబ్బందిగా మారడంతో భూములు ఇవ్వకూడదని తీర్మానించారు. పైగా గ్రామంలో అన్ని భూములు సేకరించకుండా 350 ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో మిగిలిన భూములు సాగుకు పనికి రాకుండా పోతాయని రైతులు పేర్కొంటున్నారు. పూర్వీకుల నుంచి భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఓసీపీ పేరుతో అవి బీళ్లుగా మారితే తమకు ఉపాధి కరువవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓసీపీ కోసం భూములు ఇచ్చిన ఇందారం గ్రామ రైతులు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం చొరవ చూపడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం తమ భూములను అడుగుతున్నారని, తమను కూడా ఇబ్బందులు పాలు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. 

భూములు తీసుకొని సమస్య సృష్టించొద్దు

- నామని నారాయణ, రైతు, టేకుమట్ల గ్రామం

జీవనాధారమైన భూములు తీసుకొని సమస్య సృష్టించొద్దు. పూర్వీకుల నుంచి భూములపై ఆధారపడే జీవనం సాగిస్తున్నాం. భూములు ఇచ్చే వరకు సమస్యలన్నీ తీరుస్తామని అధికారులు చెబుతారు. తరువాత ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.   రైతులందరం ఒక్క నిర్ణయం పైనే ఉన్నాం. ప్రత్యేకంగా కమిటీ వేసుకొని సింగరేణి అఽధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతాం. 

రైతుల సమస్యలు తీర్చడంలో జాప్యం

- గుంత నాగరాజు, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు

ఓసీపీ కోసం భూములు ఇచ్చిన ఇందారం రైతుల సమస్యలు తీర్చడంలో సింగరేణి అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఓసీపీ నుంచి వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వారి బాధలు చూశాకే మళ్లీ భూ ములు ఇవ్వకూడదని నిర్ణయించాం. సింగరేణి అధికారులు తమ ప్రయత్నాలను విరమించాలి. 

Updated Date - 2022-03-06T03:44:56+05:30 IST