జాతీయ సమైక్యత స్ఫూర్తితో అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-18T04:45:33+05:30 IST

జాతీయ సమైక్యత స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ అన్నారు

జాతీయ సమైక్యత స్ఫూర్తితో అభివృద్ధి
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ

- ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ

- జిల్లా వ్యాప్తంగా జెండాల ఆవిష్కరణ 

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17: జాతీయ సమైక్యత స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  కలెక్టర్‌తో పాటు అధికారులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనాటి త్యాగధనుల పోరాటాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని తెలిపారు. దీనిలో భాగంగా ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. శనివారం రాష్ట్ర రాజధానిలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా బంజారభవన్‌, ఆదివాసీ గిరిజన భవనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పోడు భూముల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడానికి జీవో జారీ చేశామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. గిరి వికాస పథకం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కుమరం భీం జిల్లాలో దళిత బంధు కింద 177 మంది లబ్ధి పొందారన్నారు. వెనుకబడిన గొల్లకురుమ వర్గాల కోసం గొర్రెల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. మత్స్యకారుల కోసం చేపల పంపిణీతో పాటు 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్‌ లాంటి వాటితో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయి, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డీఆర్‌వో సురేష్‌ ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాంహుస్సేన్‌, ఆయా  పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T04:45:33+05:30 IST