దళితబంధుకు అవినీతి చీడ!

ABN , First Publish Date - 2022-09-28T05:47:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి దళారిచీడ పట్టింది. జిల్లాలో ఇంకా మొదటి విడత పూర్తే కాలేదు. అప్పుడే రెండో విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై నేతలు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల నియోజక వర్గానికి 500 యూనిట్ల ను మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అప్రమత్తమై న స్థానిక నేతలు ముందే వసూల్‌ దందాకు ఎగబడుతున్నారు. తొలివిడతగా

దళితబంధుకు అవినీతి చీడ!


బోథ్‌ నియోజకవర్గంలో నేతల వసూళ్ల  దందా

ఒక్కో యూనిట్‌కు రూ.లక్షకు పైగా డిమాండ్‌

ఇప్పటికే దళితబస్తీ, కల్యాణలక్ష్మి పథకాల్లో అవినీతి

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

నేడు జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పర్యటన

జిల్లావ్యాప్తంగా తొలి విడత 249 యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక 

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి దళారిచీడ పట్టింది. జిల్లాలో ఇంకా మొదటి విడత పూర్తే కాలేదు. అప్పుడే రెండో విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై నేతలు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల నియోజక వర్గానికి 500 యూనిట్ల ను మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అప్రమత్తమై న స్థానిక నేతలు ముందే వసూల్‌ దందాకు ఎగబడుతున్నారు. తొలివిడతగా నియోజకవర్గానికి వంద చొప్పున యూనిట్లను మంజూరు చేయడంతో జిల్లాలో 249 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటి వరకు 230 యూనిట్లను పంపిణీ చేశారు. మిగాతా 19 యూనిట్లు డెయిరీ యూనిట్లు కావడంతో ప్రస్తుతం పశువులకు వైరస్‌ ముప్పు ఉందన్న సాకుతో నిలిపివేశారు. ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్ప గించడంతో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.  చోటా మోటా నేతలంతా తమ పలుకుబడి తో ఎమ్మెల్యేల వద్ద చక్రం తిప్పుతూ దళితబంధు పథకంలో లబ్ధిదారుల ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దళితబంధు పథకం కింద తీసుకున్న యూనిట్లు పదుల సంఖ్యలో గయాబైనట్లు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకంలో అడుగడుగునా అవినీతే కనిపిస్తోంది. దీంతో జిల్లాలో ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా పథకం తీరు కనిపిస్తోంది. ముఖ్యంగా బోథ్‌ నియోజకవర్గంలో దళారి దందా సా గుతున్నట్లు బహిరంగంగానే వినిపిస్తోంది. నేతలు అడిగినంత ఇస్తేనే అర్హుల జాబితాలో పేర్లు ఉంటాయని లబ్ధిదారులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు స్థానిక నేతలు అధికారాన్ని అండగా పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అమాయక దళిత లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పొసప్పు చేసి ముడుపులు ముట్టచెప్పినా.. చివరకు అర్హుల జాబితాలో పేరు ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి ఉందని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు వురు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ జిల్లాలో పర్యటిం చనున్నారు. జిల్లాస్థాయి అధికారు లతో సమావేశమై దళితబంధు, దళి తబస్తీ, జిల్లాలోని మరిన్ని ఇతర సమ స్యలపై ఆయన చర్చించనున్నారు.

రూ.లక్ష ఇస్తేనే యూనిట్‌

ప్రతీఒక్క దళిత కుటుంబానికి వర్తించే దళితబంధు పథకాన్ని కొందరు నేతలు పక్కదారి పట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.లక్ష ఇస్తేనే ఎంపిక జాబితాలో పేరు ఉంటుందని నేతలు చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొంత ఆర్థికంగా బలంగా ఉన్న దళిత కుటుంబాలు ఎంతో కొంత ఇచ్చి ఎంపికయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నా.. నిరుపేద కుటుంబాలకు ఎదురుచూపు లు తప్పడం లేదు. ఎందుకంటే వేలల్లో అర్హులైన లబ్ధిదారులు ఉండగా.. ప్రభుత్వం వందల్లో యూనిట్లను మంజూరు చేయడంతో దళితబంధుకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింప చేస్తే అవినీతి, అక్రమాలు జరిగే అస్కారం ఉండదంటున్నారు. మొదటి విడతలో తప్పినా.. రెండో విడతలోనైనా యూనిట్లను దక్కించుకునేందుకు లబ్ధిదారులు పోటీ పడుతున్నారు. ఎందుకంటే యేడాది లోపే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున లబిదారుల్లో హడావుడి కనిపిస్తోంది. మళ్లీ ఎప్పుడు మంజూరయ్యేది కూడా తెలియక పోవడంతో లబ్ధిదారులు ముందుచూపుతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న నేతల చుట్టు తిరుగుతూ.. దళితబంధు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఈ పథకంలో కూడా అవినీతి, అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కాసులు దండుకుంటున్న నేతల వివరాలను చెప్పేందుకు లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. 

అన్ని పథకాల్లో అదే దందా

బోథ్‌ నియోజకవర్గంలో ఏ పథకమైన సరే దానికో రేటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి నేతల వరకు ఎంతో కొంత దండుకుని ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలైన అర్హులను కాదని అనర్హులకు పథకాలు దక్కడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండానే పోతోంది. ఇప్పటికే గత రెండేళ్ల క్రితమే ఇచ్చోడ మండల కేంద్రంగా కల్యాణలక్ష్మి పథకంలో భారీ స్కాం జరిగింది. ఇందులో నిందితులను గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కల్యాణలక్ష్మి స్కాంలో కొందరు అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు బహిరంగ ఆరోపణలే వచ్చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పేరిట తీవ్ర కాలయాపన చేసిన పోలీసులు ఎవరినీ కటకటాల వెనక్కి పంపకుండానే కేసును మూసేసినట్లు తెలుస్తుంది. సాంకేతిక ఆధారాలు పేరిట ఇదిగో, అదిగో అంటూ ఊరించి రెండేళ్లయినా.. కల్యాణలక్ష్మి స్కాం నిగ్గు తేల్చకుండానే వదిలేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బోథ్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పంపిణీ చేసిన దళితబస్తీ పథకంలోనూ అవినీతి అక్రమాలు జరిగినట్లు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. కొందరు మండలస్థాయి నేతలు తెలివిగా వ్యవహరించి లబ్ధిదారుల నుంచి భూమిని కొనుగోలు చేసి అధిక ధరలకు తిరిగి ప్రభుత్వానికి కట్టబెట్టారన్న ఆరోపణలు వస్తున్నా యి. సాగుకు అనుకూలంగా లేని భూములను సైతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎంపిక చేయడం వెనుక ఎన్నో అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో నూ అధికార పార్టీ నేతలు వసూలు దందాకు పాల్పడ్డారని ఏకంగా సొంత పార్టీ నేతలే జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీ లు బహిరంగంగానే ఆరోపించినా ఎలాంటి చర్యలు కనిపించలేవు. బోథ్‌ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడడం నేతలకు పరిపాటిగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. 

ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం

: శంకర్‌, ఎస్సీ కార్పొరేట్‌ ఈడీ, ఆదిలాబాద్‌

జిల్లాలో దళితబంధు పథకంలో అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రెండె విడత దళితబంధు పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలు ఖరారు కాలేదు. కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలు అందే అవకాశం ఉంది. దానాధారంగానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగితే మా దృష్టికి తీసుకు రావాలి. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు. 

Updated Date - 2022-09-28T05:47:01+05:30 IST