ఆసిఫాబాద్‌లో పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన
ABN , First Publish Date - 2022-03-06T03:59:41+05:30 IST
ప్రభుత్వం పదవ తరగతి వార్షిక పరీక్షలు మే 11 నుంచి నిర్వహించనుంది. ఈ సందర్భంగా జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
- మే11 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
- సర్కారు బడుల్లో ఇంకా పూర్తికాని సిలబస్
- ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
ఆసిఫాబాద్, మార్చి 5: ప్రభుత్వం పదవ తరగతి వార్షిక పరీక్షలు మే 11 నుంచి నిర్వహించనుంది. ఈ సందర్భంగా జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సిలబస్ పూర్తికాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా మహమ్మరితో విద్యార్థుల చదువు వెనకబడింది. రెండేళ్లుగా కరోనా కారణంగా పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. అయితే ఈ విద్యాసంవత్సరం మాత్రం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. కానీ జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల సిలబస్ ఇంకా పూర్తికాలేదు. పరీక్షలకు ఇంకా రెండు నెలల గడువు ఉండడంతో ఏ విధంగా పాస్ అవుతామోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం సెప్టెంబరు1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా కేవలం రెండు నెలలు మాత్రమే తరగతులు జరిగాయి. దసరా సెలవులు, ముందస్తూ సంక్రాంతి సెలవులతో చదువులు అంతంత మాత్రంగానే జరిగాయి. కరోనా మూడో దశ వల్ల ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ఫిబ్రవరి వరకు సెలవులు వచ్చాయి. దీంతో సిలబస్ పూర్తి కాలేదు. జిల్లాలో 7382మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
కరోనా ఎఫెక్ట్
కరోనా కారణంగా జూన్ 1న మొదలు కావాల్సిన విద్యా సంవత్సరం ఆన్లైన్ బోధనకు పరిమితమైంది. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించింది. సుమారు రెండు నెలల పాటు మాత్రమే ప్రత్యక్ష బోధన జరుగగా డిసెంబరు నుంచి ఉపాధ్యాయులు బదిలీలతో బిజీగా ఉండటంతో బోధన అంత సవ్యంగా జరగలేదు. బదిలీలు, ముందస్తు సంక్రాంతి సెలవులతో దాదాపు నెలపాటు విద్యార్థులు విద్యా బోధనకు దూరంగా ఉన్నారు. జనవరిలోనే పూర్తి కావాల్సిన సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ప్రభుత్వం రీడ్ కార్యక్రమం మొదలు పెట్టినా సిలబస్ పూర్తికాక పోవడంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో పరీక్షలపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సమీపిస్తున్న వార్షిక పరీక్షల గడువు
పదవ తరగతి వార్షిక పరీక్షలు మే11 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. వార్షిక పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా సిలబస్ పూర్తికాక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 165పాఠశాలల్లో 7382మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో 4150 మంది బాలురు ఉండగా, 3232మంది బాలికలు ఉన్నారు. వార్షిక పరీక్షల గడువు సమీపిస్తున్న వేళ అటు విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం పదవ తరగతి విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు గట్టెక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాం
- అశోక్, జిల్లా విద్యాధికారి
జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వం 70శాతానికి సిలబస్‌ను కుదించింది. సిలబస్‌ను పూర్తి చేసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. పది రోజుల్లోగా పదవ తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా కసరత్తు చేస్తున్నాం.