బయో మాఫియా!

ABN , First Publish Date - 2022-09-11T05:15:17+05:30 IST

జిల్లాలో బయోమందుల మాఫియా ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. అమాయక రైతులకు నకిలీ బయోమందులను అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నా రు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుండా పోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్రమం తప్పకుండా ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన అధికారులు నెలనెలా అందుతున్న మామూళ్లతోనే సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వానకాల సీజన్‌లో అధికంగా సాగు చేసే పత్తి పంటను ఆశిస్తున్న చీడ పీడల నివారణకు విచ్చలవిడిగా బయోమందులను పిచికారి చేస్తూ రైతులు నష్టపోతున్నారు.

బయో మాఫియా!
సోయా పంటలో పురుగు మందును పిచికారి చేస్తున్న రైతులు

జిల్లాలో యథేచ్ఛగా నాసిరకం మందుల అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర నుంచి దిగుమతి

పురుగు చావదు.. పూత కాత నిలువదు

మాములుగానే తీసుకుంటున్న వ్యవసాయ శాఖ 

ఆదిలాబాద్‌, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బయోమందుల మాఫియా ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. అమాయక రైతులకు నకిలీ బయోమందులను అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నా రు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుండా పోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్రమం తప్పకుండా ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన అధికారులు నెలనెలా అందుతున్న మామూళ్లతోనే సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వానకాల సీజన్‌లో అధికంగా సాగు చేసే పత్తి పంటను ఆశిస్తున్న చీడ పీడల నివారణకు విచ్చలవిడిగా బయోమందులను పిచికారి చేస్తూ రైతులు నష్టపోతున్నారు. బ యోమందులతో పంట ఏపుగా పెరుగుతుందని నమ్మిస్తున్నారు. గతంలో వీటిని గుర్తించిన అధికారులు వ్యాపారులపై కఠినంగా వ్యవహరించకపోవడంతో మళ్లీ అదే తీరు కనిపిస్తోంది. 

జిల్లావ్యాప్తంగా 4లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట.. 

జిల్లావ్యాప్తంగా 4లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట సాగవుతుండ గా 80 వేల ఎకరాలలో సోయా పంట, 52వేల ఎకరాలలో కంది పంట సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో బేల మం డలంలో నకిలీ బయోమందుల తయారీ గుట్టు రట్టయినా పొంతన లేని సమాధానం చెబుతూ వ్యాపారులు తప్పించుకోవడంతో బయోమాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి యేటా నకిలీ పురుగు మందుల వ్యవహారం వెలుగు చూస్తునా వ్యవసాయ శాఖాధికారులు తేలికగానే తీసుకుంటున్నారు. బయోమందుల విక్రయానికి కోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇన్‌ చార్జి అధికారులతోనే వ్యవసాయ శాఖ పాలన కొనసాగడంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. 

పర్యవేక్షణ కరువు..

క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుండానే పోతున్నారు. ప్రభుత్వం హెచ్చరిస్తునా క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. కొందరు రైతులు సాగు అనుభవంతోనే పురుగు మందులను కొనుగోలు చేసి పిచికారీ చేసుకుంటూ నష్టపోతున్నారు. పంటలను ఆశిస్తున్న తెగుళ్లకు ఏ మం దును పిచికారి చేయాలనో తెలియక సతమతమవుతున్నారు. కొం తమంది రైతులు అధికారులను ఫోన్‌లో సంప్రదిస్తున్నా సకాలంలో స్పందించడం లేదంటున్నారు. నిత్యం గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి అధికారులు పంటలను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో సర్వేల పేరు చెబుతూ అధి కారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి సిబ్బందిపై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోంది. క్షేత్ర స్థాయి పరిశీలన పేరిట కొందరు అధికారులు సొంత పనులకే పరిమితమవుతున్నారన్న విమర్శలు లేక పోలేదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వ్యవసాయ శాఖాధికారి ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో పూర్తిస్థాయి ని యామకాలు చేపట్టిన ప్రయోజనమే లేకుండా పోయింది. ఏదో అడపాదడపా గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు ఒకరిద్దరు రైతులనే పలుకరిస్తూ తిరుగుముఖం పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కొందరు అధికారులైతే నెలల తరబడి గ్రామాల ముఖం చూసిన దాఖలాలే కనిపించడం లేదంటున్నారు.

     రహస్యంగా దిగుమతి..

ఎలాంటి అనుమతి, నాణ్యత పరీక్షలు లేని బయోమందులను జిల్లా వ్యాపారులు రహస్యంగా దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు తదితర ప్రాంతాల నుంచి నాసిరకం బయోపురుగు మందులను తీసుకొచ్చి జిల్లాలో అమ్మేసుకుంటున్నారు. బయో పురుగు మందుల వాడకంతో భూసా రం దెబ్బతింటునప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. బయోమందులను పిచికారి చేసినా పురుగులు, చీడపీడలు చావడం లేదని,          అలాగే పూత. కాత కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎలాంటి ఎమ్మార్పీ ధరలు లేక పోయినా లీటరుకు రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధరలకు రెండింతలుగా విక్రయిస్తూ సంపాదిస్తున్నారు. దీంతో అధిక లాభాలు రావడంతో రసాయనమందుల కంటే వ్యాపారులు బయోమందుల విక్రయాల పైననే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పంటలను ఏ మాత్రం పరిశీలన చేయకుండానే కొందరు వ్యాపారులు పురుగు మందులను విక్రయిస్తున్నారు. నాణ్యత, పనితనంతో సంబంధం లేకుండానే ఎక్కువ లాభాలు వచ్చే పురుగు మందులనుఅమ్మేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కాలం చెల్లిన పురుగు మందులను కూడా రైతులకు అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా బయోమందుల వ్యాపారులు మాఫియాగా ఏర్పడి అధికారులకు నెలనెలా ఎంతో కొంత ముట్టజెప్పడంతోనే సైలెంట్‌ అయిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తేలికగా తీసుకోవడంతోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Read more