భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-07-03T17:23:42+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.. గత నెల 12న జిల్లా కేంద్రమైన కొత్తగూడం ఎంజీ రోడ్డు ప్రాంతంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న Covid కేసులు

- వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి.. 

- జిల్లాలో పాజిటివ్‌ రేటు నాలుగుశాతం 


కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి  విజృంభిస్తోంది.. గత నెల 12న జిల్లా కేంద్రమైన కొత్తగూడం ఎంజీ రోడ్డు ప్రాంతంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాలో నాలుగో విడత వ్యాప్తి ప్రారంభమైంది. అప్పటినుంచి జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మూడు  నుంచి ఎనిమిది కేసులు నమోదవుతుండడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గత ఆరు నెలల క్రితం కొవిడ్‌ ఉధృతి తగ్గిపోవడంతో జిల్లా ప్రజలు తమ రోజువారీ దినచర్యలో బీజీగా మారిపోయారు. ఈ నేపధ్యంలో మరోమారు ఈ మహమ్మారి జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఈ నేపధ్యంలో ఇంతకుముందులానే కరోనా నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటన జారీ చేసింది. 

 

వ్యాక్సినేషన్‌ తప్పని  సరి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. మొదటి రెండో డోస్‌లు వేసుకోని వారు తక్షణమే వ్యాక్సిన్‌ వేసుకోవాలని, రెండు డోస్‌లు వేసుకున్న వారు తప్పక బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, తలనొప్పి, జలుబు, నీరసం, వళ్ల నొపుపలు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే ఒకరి నుంచి మరొకరికి  వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా బారిన పడిన వ్యాదిగ్రస్తులకు జిల్లాలో ఐసోలేషన్‌ కేంద్రంగా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో 510 బెడ్లను అందుబాటులో ఉంచారు. ఐసోలేషన్‌కు జిల్లా పోగ్రాం అధికారిగా (డీఎస్‌వో) డాక్టర్‌ కే. ఇమ్మానియేల్‌ను  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నియమించింది.   

 

జిల్లాలో పాజిటివ్‌ రేటు నాలుగుశాతం 

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తీవ్రతలో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలో నాలుగు శాతాన్ని సాధించింది. 2020కరోనా కేసులు నమోదు నాటి నుంచి ప్రస్తుతం శనివారం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,35,456 పరీక్షలు నిర్వహించగా వాటిలో 57,210 పాజిటివ్‌ కేసులుగా వైద్యాధికారులు నిర్థారించారు. మొత్తం 4.2శాతం జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 559 మంది కరోనా సోకి మృతి చెందారు. మృతి రేటు 0.9 శాతం నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.  


లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి 

- డాక్టర్‌ దయానందస్వామి, భద్రాద్రి డీఎంఅండ్‌హెచ్‌వో 


ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా లేక అనారోగ్యంతో బాధపడుతూ నీరసంగా ఉన్నా దగ్గరలోని ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో రాపిడ్‌, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను చేయించుకోవాలి. కరోనా బారిన పడకుండా ముందస్తు 12నుంచి ఆపై వయస్సుల వారు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కరోనా సోకి బాధపడే కంటే ముందుగానే నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. 


 12 కరోనా కేసులు 

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 12కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో మొత్తం 691 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,044మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ నమోదైంది.

Read more