పాదయాత్రలో బండిముద్ర

ABN , First Publish Date - 2022-12-07T01:42:12+05:30 IST

బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ ఐదవ విడత ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా పది రోజుల పాటు జిల్లాలో చేపట్టిన పాదయాత్ర తనదైన ముద్ర వేసుకుంది.

పాదయాత్రలో బండిముద్ర
పాదయాత్రలో భాగంగా ఎడ్లబండి నడుపుతున్న బండి సంజయ్‌ (ఫైల్‌)

పార్టీ విస్తరణకు ఉపకరించిన సంగ్రామ యాత్ర

నిర్మల్‌ జిల్లాలో భారీ రెస్పాన్స్‌

మూడు నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతల్లో మొదలైన చలనం

వచ్చే ఎన్నికల నాటికి సమాయత్తమయ్యేందుకు పాదయాత్ర తోడ్పాటు

టికెట్‌ల కోసం పెరుగుతున్న ఆశావాహులు

నిర్మల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ ఐదవ విడత ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా పది రోజుల పాటు జిల్లాలో చేపట్టిన పాదయాత్ర తనదైన ముద్ర వేసుకుంది. గతంలో ఆ పార్టీకి ఎన్నడు లేనంతగా ఊపు తెచ్చి పెట్టింది. ఏ నియోజకవర్గానికి వెళ్లిన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. కానీ బండిసంజయ్‌ అధ్యక్ష హోదాలో చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త కళ తెచ్చి పెడుతోంది. దీన్ని రాజకీయ విశ్లేషకులతో పాటు అధికార పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అడుగడుగునా ఒక వైపు జనాలను కలుస్తూ మరోవైపు సభల్లో ప్రసంగిస్తూ ముం దుకు సాగుతున్నారు. అద్యంతం తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో సీఎం కేసీఆర్‌ పాలనపై దూకుడుగా మాట్లాడుతూ ఆయ న కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేస్తూ మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతల తీరుపైనా దాడికి దిగుతున్నారు. ముందుగానే స్థాని క పరిస్థితులను స్టడీ చేస్తున్న బండిసంజయ్‌ వేదికలపై నుంచి విమరనాస్త్రాలతో దాడి చేస్తుండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది.

భారీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

బండిసంజయ్‌ పాదయాత్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెడుతున్నది. భవిష్యత్‌లో పార్టీ బలోపేతమై అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం సైతం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బండిసభలకు జనం తరలివస్తుండడం చూసి పార్టీ ముఖ్య నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత భారీగా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్థాయిలో పార్టీ క్రమంగా బలపడుతుందన్న సంకేతాలతో స్థానిక నేతలతో పాటు అధిష్టానం కూడా భవిష్యత్‌ కార్యచరణపై మరింత కసరత్తు చేస్తోంది.

పార్టీ విస్తరణకు ఉపకరించిన సంగ్రామయాత్ర

జిల్లాలో బండిసంజయ్‌ నిర్వహించిన పదిరోజుల ప్రజాసంగ్రామ పాదయాత్ర పార్టీ విస్తరణకు తోడ్పాటునిచ్చింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతం కోసం ఆయన యాత్ర ఉపయుక్తమైందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తొలుత ప్రజాసంగ్రామయాత్ర నిర్వహించిన భైంసా పట్టణంలోనైతే పార్టీకి గట్టి పునాదులను వేసింది. జిల్లా కాంగ్రెస్‌ అఽధ్యక్షులు రామారావు పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ ఓటు బ్యాంకు భారీగానే పెరిగింది. పటేల్‌తో పాటు అనేక మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీ పీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పార్టీలో చేరడంతో గ్రామాల్లో పార్టీ వేళ్లూనుకుంది. ఇదీ ముథోల్‌ నియోజకవర్గానికి బాగా కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌ నియోజకవర్గంలోనూ పార్టీలోకి వివిధ పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి చేరడం పార్టీకి ఊపు తెచ్చి పెడుతోంది. ఇదిలా ఉంటే భైంసాతో పాటు నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలు కార్యకర్తల్లో విశ్వాసం నింపింది. ఈ రెండుసభల్లోనూ రాష్ట్రస్థాయిలో సీఎం కేసీఆర్‌, ఆయన కూతురు కవిత, కుటుంబ సభ్యులు టార్గెట్‌గా బండి చేసిన భావోద్వేగ ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయి. మరోవైపు నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బేరీజు వేస్తూ స్థానిక నేతలతీరు, అవినీతి, బంధుప్రీతి, భూకబ్జాల వంటి అంశాలపై ఏటాక్‌ చేసి స్థానిక శ్రేణులను ఏకం చేయడంలో బండి ఊపుతెచ్చి పెట్టారు. ఇలా ఆయన పాదయాత్ర పార్టీ విస్తరణకు బాగా ఉపయోగపడింది.

మూడు నియోజకవర్గాల్లో పార్టీలో చలనం.. పెరుగుతున్న ఆశావాహులు

బండిసంజయ్‌ పాదయాత్ర మూడు నియోజకవర్గాల రాజకీయాల్లో చలనం తెచ్చాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. బండి తన ప్రసంగంలో అధికార పార్టీని బలంగా టార్గెట్‌ చేసి చేస్తున్న ప్రసంగాలు అధికార పార్టీని ఉలిక్కిపడేలా చేశాయి. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా ప్రెస్‌కాన్పిరెన్స్‌ పెట్టి మాట్లాడారు. మరోవైపు అధికార పార్టీ నేతలు బండి వ్యాఖ్యాలతో అంతర్మధనం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బండిదూకుడు చూసి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి. అయితే బండిపాదయాత్ర నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందనతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కమలం పార్టీనేతల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముథోల్‌ నియోజకవర్గంలో బండియాత్రను విజయవంతం చేసేందుకు ఎవరికి వారుగా కృషి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, సీనియర్‌ నేత మోహ న్‌రావు పటేల్‌ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి చేరిన రామారావు పటేల్‌ జన సమీకరణలో పోటీపడ్డారు. వీరు ముగ్గురు వచ్చే ఆసెంబ్లీ టికెట్‌కు కూ డా పోటీ పడే పరిస్థితులు ఎక్కువయ్యాయి. నిర్మల్‌ నియోజకవర్గంలో సైతం పార్టీ టికెట్‌ ఆశించే నేతలు పెరిగిపోతున్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి, డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డిలు టికెట్‌ను ఆశిస్తూ పాదయాత్రలో ఇద్దరు పోటీ పడి బల ప్రదర్శన చేస్తున్నారు. దారి పొడవునా పోటీ పడి స్వాగత తోరణాలు పెట్టి బండి కంట్లో పడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలోనూ మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు జానుభాయి, హరి నాయక్‌ తదితరులు కూడా ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. పది రోజుల పాటు ఆయన చేపట్టిన పాదయాత్ర జిల్లా నేతల్లో ఒక్కసారిగా ఛలనం తెచ్చి పెట్టింది.

Updated Date - 2022-12-07T01:42:13+05:30 IST