ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధత

ABN , First Publish Date - 2022-05-29T03:59:47+05:30 IST

గడిచిన ఐదేళ్లుగా రైతాంగానికి అందజేస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయంపై ఈసారి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదన్న వార్తల నేపథ్యంలో ఈ దఫా రైతుబంధు ఇప్పట్లో జమ చేసే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధత

- జూన్‌లోగా ఖాతాలో జమ చేయటం కష్టమే

- జాబితాలో మార్పులు, చేర్పులపై స్పష్టత కరువు

- సాయంపై కటాఫ్‌ విధించే అవకాశం ఉందంటున్న నిపుణులు

- రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేక పోవటం అసలు కారణం 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

గడిచిన ఐదేళ్లుగా రైతాంగానికి అందజేస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయంపై ఈసారి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదన్న వార్తల నేపథ్యంలో ఈ దఫా రైతుబంధు ఇప్పట్లో జమ చేసే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతు బంధు రూపేణా దాదాపు రూ.15వేల కోట్ల మేర నిధులు అవసరమయ్యే పరిస్థితి ఉందంటున్నారు. ఉద్యోగులకు జీత భత్యాలు కూడా సకాలంలో ఇవ్వలేక పోతున్న ప్రస్తుత తరుణంలో రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేయటం అనుమానమేనని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా వానా కాలం సాగు పనులు ప్రారంభానికి ముందే రైతాంగం పట్టా పుస్తకాల ఆధారంగా జాబితాల మార్పులు, చేర్పుల ప్రక్రియ చేపట్టడం కోసం జిల్లా వ్యవసాయ శాఖకు లాగిన్‌కు అవకాశం ఇస్తూ వచ్చారు. అయితే ఏడాది ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో జాబితాల మార్పులు, చేర్పులపైన అధికార యంత్రాంగానికి స్పష్టత కొరవ డింది. కొత్తగా భూముల కొనుగోలు చేసి రైతుబంధు జాబితాలో పేర్ల నమోదు కోసం ప్రయత్నిస్తున్న రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి సమాచారం లేక పోవడంతో అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మార్పులు, చేర్పుల ప్రక్రియతోపాటు రైతు బంధు సాయంపైనా చర్చలు జరుపుతున్నట్టు ఊహాగానాలు విన్పిస్తు న్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ పెట్టుబడి సాయానికి సంబంఽధించి రైతు లకు ఎలాంటి విస్తీర్ణం పరిమితి విధించలేదు. దీంతో ఎకరా మొదలుకొని 500ఎకరాల వరకు భూములు కలిగిన వారందరికీ రెండు విడతల్లో ఎకరాకు పదివేల రూపాయి చొప్పున ఎంత భూమి ఉంటే అంత విస్తీర్ణానికి పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో, ఇటు కర్షకుల్లోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఒకటి రెండు సామాజిక వర్గాలకు చెందిన బడా భూ స్వాములు దీని ద్వారా భారీగా లబ్ధి పొందుతున్న పరిస్థితుల్లో విపక్షాలకు ఈ అంశం రాజకీయ అస్త్రంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న పరిస్థితుల్లో రైతుబంధు సాయంపై పరిమితి విధించాలన్న పార్టీ వర్గాల డిమాండు మేరకు రాష్ట్ర నాయకత్వం పెట్టుబడి సాయంలో కటాఫ్‌ విధించి మిగితా మొత్తానికి కోత విధించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత లేదని అధికార యంత్రాంగం చెబుతోంది. దానికి తోడు కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు కూడా నమోదు చేసుకు నేందుకు ఇంకా వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి అది ఇస్తారో లేదోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సీజన్‌ ప్రారంభం అయిన తర్వాత ఒకటి రెండు వారాల్లోపే ఖాతాల్లోకి జమ కావచ్చని చెబుతుండటం విశేషం. 

జిల్లాలో 1.11లక్షల మంది రైతులు

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం కింద మొత్తం1.11లక్షల మంది రైతులు పెట్టుబడి సాయాన్ని అందుకుం టున్నారు. సగటున ప్రతి ఏడాది వానాకాలం సీజన్‌లో రూ.199 కోట్ల మేర రైతుల ఖాతాలకు నేరుగా జమ అవుతున్నాయి. 2020-21వర్షాకాలం గణాం కాలను పరిశీలిస్తే 1.13లక్షల మంది పట్టాలకు గాను 1.07లక్షల మంది బ్యాంకు ఖాతాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా 1.06లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.188.02 కోట్ల నిధులు జమయ్యాయి. అయితే ఈ ఏడాది మరో ఐదువేల మంది రైతులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే రబీ సీజన్‌లో 1.15లక్షల ఖాతాలకు గాను 1.09లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా 1.08లక్షల మంది రైతుల ఖాతాల్లో 188.24 కోట్ల రూపాయలు జమయ్యాయి. అయితే ఈ సారి రైతుల సంఖ్య పెరుగటంతో పాటు పెట్టుబడి సాయం కూడా 199 కోట్లకు చేరుకోనుంది. 

Updated Date - 2022-05-29T03:59:47+05:30 IST