అంబరాన్నంటిన సంబురాలు

ABN , First Publish Date - 2022-10-04T05:12:01+05:30 IST

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు.

అంబరాన్నంటిన సంబురాలు

- ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలు

- మహిళల పాటలతో మారుమోగిన జిల్లా 

ఆసిఫాబాద్‌, అక్టోబరు 3: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం శోభయాత్రగా బతుకమ్మలను తీసుకెళ్లి సమీప చెరువులు, వాగుల సమీపంలో సామూహికంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవ ఉయ్యాలో.. హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సందడి కనువిందు చేసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణలతో లయ బద్దంగా ఆడుతూ.. పాడుతూ.. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీ పడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒక్క చోట చేరి బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ ఆడడంతో పాటు యువతులు, మహిళలు కోలాటం ఆడారు.  పట్టణంలో బ్రహ్మణ్‌వాడ, రావులవాడ, కన్యకాపరమేశ్వరి ఆలయం, పొట్టి శ్రీరాములు చౌక్‌, కంచుకోట, తారక రామానగర్‌, రాజంపేట, సాయినగర్‌, పైకాజీనగర్‌, బజార్‌వాడీ, హడ్కో కాలనీ, సందీప్‌నగర్‌, జన్కాపూర్‌, దస్నాపూర్‌లో కాలనీల్లో మహిళలు ఆడి పాడారు. కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు జిల్లాలోని సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.

కాగజ్‌నగర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. వివిధ వార్డుల్లో బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎస్పీఎం క్రీడా మైదానంలో ఆడేందుకు మహిళలు బయలు దేరారు. ఈ సందర్భంగా ఎస్పీఎం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానిక సర్‌సిల్క్‌ కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి బతుకమ్మ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రత్యేక బహుమతులను అందజేశారు. అలాగే ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమంలో మిల్లు ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవటం గర్వంగా ఉందన్నారు. అలాగే వివిద పార్టీలకు చెందిన నాయకులు కూడా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Read more