వైస్‌చైర్మన్‌ పదవిపై గురి

ABN , First Publish Date - 2022-03-05T07:11:52+05:30 IST

నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవీ వ్యవహారం ప్రస్తు తం అంతటా హాట్‌టాఫిక్‌గా మారింది.

వైస్‌చైర్మన్‌ పదవిపై గురి
నిర్మల్‌ పురపాలకసంఘ కార్యాలయం

అందరి దృష్టి అటువైపే 

టీఆర్‌ఎస్‌లో మొదలైన సమీకరణలు 

రంగంపైకి ఆరుగురు టీఆర్‌ఎస్‌ మైనారిటీ కౌన్సిలర్‌లు 

మైనారిటీ మహిళ కౌన్సిలర్‌కు అవకాశాలు దక్కవచ్చని ప్రచారం 

మార్కెట్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ చేరికపై ఊహాగానాలు 

మంత్రి, చైర్మన్‌ల నిర్ణయమే కీలకం 

రాబోయే సాధారణ ఎన్నికలే లక్ష్యం 

నిర్మల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవీ వ్యవహారం ప్రస్తు తం అంతటా హాట్‌టాఫిక్‌గా మారింది. ఇప్పటి వరకు వైస్‌చైర్మన్‌గా వ్యవహరించిన షేక్‌సాజిద్‌ రేప్‌ కేసులో ఇరుక్కొని జైలుపాలవ్వడంతో జిల్లా కలెక్టర్‌ అతనిని ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతం నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి ఖాళీ అయినట్లేనంటున్నారు. ఇక ఆ పదవిని దక్కించుకునేందుకు మున్సిపాలిటీలోని టీఆర్‌ఎస్‌ చెందిన పలువురు మైనారిటీ కౌన్సిలర్‌లు ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. నిర్మల్‌ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 8 మంది మైనారిటీలు కౌన్సిలర్‌లుగా గెలుపొందారు. అయితే వీరిలో నుంచి ఒకరు వైస్‌చైర్మన్‌గా ఎంపికై ప్ర స్తుతం కేసుల కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీంతో పదవి ఖాళీ కావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు మైనారిటీ కౌన్సిలర్‌లు ఆ పదవిని దక్కించుకునేందుకు ఇక తమవంతు ఎత్తులు వేస్తున్నారంటున్నారు.  ప్రస్తుతం ఆరుగురు మైనారిటీ కౌన్సిలర్‌లు వైస్‌చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలన్న ధ్యేయంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటి కే వీరిలో కొంతమంది మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌పై ఒత్తిడి మొదలుపెట్టారంటున్నారు. మరోఇద్దరు కౌన్సిలర్‌లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి కూడా వైస్‌చైర్మన్‌ పదవి ఎంపిక వ్యవహారాన్ని తీసుకువెళ్లినట్లు పేర్కొంటున్నారు. సంఘటన జరిగిన కనీసం వారంరోజులు గడవక ముందే అధికార టీఆర్‌ఎస్‌లో పదవీ దుమారం రేపుతోంది. మంత్రికి, చైర్మన్‌కు సన్నిహితంగా ఉంటున్న కొంతమంది మైనారిటీ కౌన్సిలర్‌లు ఎలాగైనా  పదవిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారంటున్నారు. వైస్‌చైర్మన్‌ పదవి కేటాయింపు వ్యవహారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ల కనుసైగల మేరకే జరుగుతున్నదన్నది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా ఓ వైపు టీఆర్‌ఎస్‌లోని మైనారిటీ కౌన్సిలర్‌లు వైస్‌ చైర్మన్‌ పదవి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలోనే మార్కెట్‌ ప్రాంతం నుంచి కౌన్సిలర్‌లుగా గెలుపొందిన దంపతులిద్దరినీ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. మార్కెట్‌ ప్రాంతంలో మంచి పట్టున్న సదరు కౌన్సిలర్‌ దంపతులను ఎ లాగైనా టీఆర్‌ఎస్‌లో చే ర్పించినట్లయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రయోజనం దక్కుతుందనే అభిప్రాయంలో టీఆర్‌ఎస్‌ అధినేతలు ఉన్నారంటున్నారు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ మున్సిపల్‌ చైర్మన్‌కు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కూడా సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరుగురు కౌన్సిలర్‌ల నుంచి ఏ ఒక్కరికీ వైస్‌చైర్మన్‌ పదవిని కట్టబెట్టినా మిగతా కౌన్సిలర్‌లు వ్యతిరేకించే అవకాశాలున్నాయంటున్నారు.  అలాగే ఈ పదవి విషయంలో టీఆర్‌ఎస్‌లో కూడా అభిప్రాయబేధాలు ఏర్పడవచ్చంటున్నారు. మొదటి నుంచి తాము పార్టీలో పని చేస్తున్నప్పటికీ తమను పక్కన పెట్టి కొత్త వారికి పదవిఎలా కట్టబెడతారన్న విమర్శలు సైతం తెరపైకి వచ్చే అవ కాశం ఉందంటున్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ సంపూర్ణ మద్దతును సాధించేందుకే కాకుండా మార్కెట్‌ ప్రాంతంలో తమకు అడ్డులేకుండా చేసుకోవాలనే ధ్యేయంతో అధిష్టానం యోచిస్తోందంటున్నారు.

టీఆర్‌ఎస్‌లో మొదలైన సమీకరణలు

ఇదిలా ఉండగా ప్రస్తుత వైస్‌చైర్మన్‌ పదవి ఖాళీ కాబోతున్న నేపథ్యంలో కొత్తవైస్‌చైర్మన్‌ ఎంపిక విషయమై టీఆర్‌ఎస్‌ తీసుకోబోతున్న నిర్ణయంపైనే అందరిదృష్టి కేంద్రీకృతమవుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ రాబో యే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈదిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మార్కెట్‌ప్రాంతంలో గట్టి పట్టున్న కౌన్సిలర్‌ దంపతులను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్పించి వారిలో ఒకరికి వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలన్న యోచనలో కూడా ఉన్నట్లు పార్టీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. మైనారిటీ కౌన్సిలర్‌ పదవులు టీఆర్‌ఎస్‌ కలిగి ఉన్న కారణంగా ఆపార్టీ అభ్యర్థికే వైస్‌చైర్మన్‌ పదవి దక్కుతుందన్నది బహిరంగ రహస్యమే. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కౌన్సిలర్‌లుగా గెలుపొందిన ఆరుగురు ఈ పదవి కోసం పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. మొదట్లోనే వీరిలో కొంతమంది వైస్‌చైర్మన్‌ పదవి కోసం పట్టుబట్టినప్పటికీ ఆనాటి సమీకరణల కారణంగా షేక్‌సాజిద్‌కు ఆ పదవిని కట్టబెట్టారు. దీంతో అప్పట్లో కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణ యం మేరకు ఆయనకు ఆ పదవిని అప్పజెప్పారు. అనూహ్య పరిణామాలతో వైస్‌చైర్మన్‌ పదవిఖాళీ కాబోతున్న కారణంగా మొదట ఈ పదవిని కోరుకున్న కౌన్సిలర్‌లు ప్రస్తుతం ఈ పదవి కోసం పట్టుబట్టే అవ కాశం ఉందంటున్నారు. 

కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ దంపతులపైనా చర్చ

కాగా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ దంపతులపైనా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వీరిద్దరినీ ఎలాగైనా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్పించి వారిద్దరిలో ఒకరికి వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలన్న ప్రయత్నాలు కూడా మొదలయ్యాయంటున్నారు. మార్కెట్‌ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు బలం చేకూర్చే వ్యూహంలో భాగంగానే వీరిని తమవైపు పార్టీలోకి ఆహ్వానించాలన్న యోచన కూడా ఉందంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆరుగురు టీఆర్‌ఎస్‌ మైనారిటీ కౌన్సిలర్‌ల నుంచి కూడా ఈ వ్యవహారంపై వ్యతిరేకత తలెత్తకపోవచ్చంటున్నారు. 

మంత్రి , చైర్మన్‌ల నిర్ణయమే కీలకం

ఇదిలాఉండగా మున్సిపల్‌చైర్మన్‌ ఎంపిక వ్యవహారంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ల నిర్ణయమే కీలకమవుతోందంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ల నుంచి ఎవరికో ఒకరికి ఈ పదవిని కట్టబెట్టదలిస్తే మైనారిటీ మహిళ కౌన్సిలర్‌కు ఈ పదవిని అప్పజెప్పవచ్చంటున్నారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని మైనార్టీల బలంను మరింతగా సమకూర్చుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఆయనకు వైస్‌చైర్మన్‌ పదవిని అప్పజెప్పే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రి, చైర్మన్‌లు ఈ అంశంపై ఎక్కడా కూడా ప్రస్థావించకుండా కేవలం కాంగ్రెస్‌, బీజేపీల విమర్శలను తిప్పికొట్టేందుకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. చివరకు వైస్‌ చైర్మన్‌ ఎంపిక వ్యవహారంలో మంత్రి, చైర్మన్‌ల నిర్ణయమే ఆ పార్టీలోని కౌన్సిలర్‌లందరికి శిరోఽధార్యం కానుందంటున్నారు. 

Updated Date - 2022-03-05T07:11:52+05:30 IST