సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-03-13T04:35:58+05:30 IST

మండల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు
మాట్లాడుతున్న ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌

- ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌
మందమర్రిరూరల్‌, మార్చి 12: మండల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ  అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను వెల్లడించారు. మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ నజీరొద్దీన్‌ మాట్లాడుతూ  ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తిస్ధాయిలో హాజరు కావాలని అప్పుడే సమస్యలు పూర్తి స్ధాయిలో పరిష్కారమవుతాయని తెలిపారు. అలాగే  మండలంలో ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం ఉంటుందని, అటవీ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందిగా మారిందని చెప్పారు. జెడ్పీటీసీ వేల్పుల రవి మాట్లాడుతూ వ్యవసాయాధికారులు రైతు వేదికలోనే కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. పులి మడుగు గ్రామం గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రానికి వస్తేనే పోషకాహారం ఇస్తున్నారని, దీంతో కేంద్రానికి వెళ్లలేని వారు  ఇబ్బందులు పడుతున్నారని  చెప్పారు. బంధువులకు గానీ , ఇంటికి వెళ్లి కానీ అంగన్‌వాడీ సిబ్బంది ఇవ్వాలని సర్పంచు భుక్య దేవి కోరారు. సారంగపల్లి గ్రామంలో మిని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నసీరొద్దీన్‌ కోరారు. అందుగులపేటలోని చెరువు కింద ఉన్న రెండు కాలువల్లో ఒక కాలువను కొందరు మూసివేశారని వెంటనే రీ ఓపెన్‌ చేయాలని వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌  సమావేశంలో తెలిపారు. కోటేశ్వర్‌రావు పల్లెలో మన ఊరు మన బడికి ఎంపికైన పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం వెంటనే చేపట్టాలని సర్పంచు బొలిశెట్టి సువర్ణ ఎంపీపీ, జడ్పీటీసీలకు వినతి పత్రం అందించారు.  సమావేశంలో ఎంపీడీవో శశికళ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రావు, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, సర్పంచులు ఒడ్నాల కొమురయ్య, బొలిశెట్టి సువర్ణ, విద్యుత్‌ శాఖ అధికారులు జయకృష్ణ, మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-13T04:35:58+05:30 IST