వేధిస్తున్న సిబ్బంది కొరత

ABN , First Publish Date - 2022-10-07T04:50:18+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. పలు కీలక పోస్టులన్నీ కూడా ఇన్‌చార్జీలతోనే కొనసాగిస్తున్నారు. రెగ్యూలర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం లేదు. జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే వీఆర్వోలను రెండు నెలల క్రితం వివిధశాఖలకు బదిలీ చేశారు. దీంతో జిల్లాలో పనిచేసే 104మంది వీఆర్వోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత
కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం

- ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు

- వీఆర్వోలను ఇతర శాఖల్లోకి తీసుకున్న ప్రభుత్వం

- ఇబ్బందులు పడుతున్న తహసీల్దార్లు

- కాగజ్‌నగర్‌లో ఆర్డీవో పోస్టు ఖాళీ

- దరఖాస్తుదారులకు తప్పనితిప్పలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 6: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. పలు కీలక పోస్టులన్నీ కూడా ఇన్‌చార్జీలతోనే కొనసాగిస్తున్నారు. రెగ్యూలర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం లేదు. జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే వీఆర్వోలను రెండు నెలల క్రితం వివిధశాఖలకు బదిలీ చేశారు. దీంతో జిల్లాలో పనిచేసే 104మంది వీఆర్వోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 65రోజులుగా వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టడంతో ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్‌, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మాత్మ్రమే విధులు నిర్వహిస్తున్నారు.

విచారణ సందర్భంలో ఇబ్బందులు..

 భూ తగాదాల విషయంలో విచారణ చేపట్టాల్సిన సమయంలో గతంలో ప్రాథమికంగా వీఆర్వోలు, వీఆర్‌ఏలు నివేదికలు సమర్పించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం తహసీల్దార్‌ మాత్రమే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్యాలయాల్లో రిజిసే్ట్రషన్‌, ఇతర సర్టిఫికేట్ల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆత్మహత్య జరిగిన సంఘటనలో కూడా తహసీల్దార్లు స్వయంగా నివేదికలను రూపొందిస్తారు. ఇందుకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కీలక పనులు నిర్వహించే తహసీల్దార్లందరికీ ఇప్పుడు గడ్డు పరిస్థితి నెలకొంది. చిన్నా, చితక పనులన్నీ కూడా తహసీల్దార్లే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో 317 మంది వీఆర్‌ఏలున్నారు. వీరందరినీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో వివిధపనులు చేసేందుకు ఉపయోగిస్తారు. ఐతే వీఆర్‌ఏలు సమస్యలను పరిష్కరించాలని 65రోజులుగా నిరవధికంగా సమ్మెబాట పట్టారు. ఒకవైపు రిజిసే్ట్రషన్‌లతో పూర్తి బిజీగా గడుపుతున్న తహసీల్దార్లకు కిందస్థాయి సిబ్బంది లేకపోవటంతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. జిల్లాలో పనిచేసే వీఆర్వోల బదిలీ చేసిన తర్వాత వీరిస్థానంలో ఇంతవరకు ఎవర్నీ భర్తీ చేయలేదు. 

తప్పని నిరీక్షణ..

వివిధ ఉద్యోగాల కోసం, భూ సమస్యలకోసం దరఖాస్తులు చేసుకునే వారు అధికంగా వస్తుండటంతో వాటికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు సమయం తీసుకుంటున్నారని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ధరణిలో భూ సమస్యలకు కొత్త ఆప్షన్లను ఇచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి నిరీక్షణ తప్పటం లేదు. భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకుంటే వాటిని తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది ఆర్‌ఐతో విచారణ జరిపించిన తర్వాత ప్రత్యేక నోటీసులను గ్రామ పంచాయతీలకు గానీ, మున్సిపాల్టీ కార్యాలయాలకు గానీ అంటిస్తారు. పదిహేను రోజుల తర్వాత సంబంధిత జీపీలు, మున్సిపాల్టీల నుంచి ఎన్‌వోసీ వచ్చిన తర్వాతనే తదుపరి సమస్యలను పరిష్కరించి ధరణిలో అప్‌లోడ్‌ చేసేందుకు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్రక్రియను వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు చూసుకునే వారు. ఇప్పుడు మాత్రం కార్యాలయ సిబ్బంది మాత్రమే స్వయంగా చేస్తుండడంపై తమపై అదనపు భారం పడుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. వీటితోపాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేస్తుండేందుకు వాకాబు చేస్తుండటం, రికార్డుల సమాచారం ఇచ్చేందుకు కూడా కిందస్థాయి సిబ్బంది లేకపోవటంతో అంతా తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కాగజ్‌నగర్‌లో ఆర్డీవో పోస్టు కూడా ఇన్‌చార్జీతోనే నడుస్తోంది. గతంలో పనిచేసిన ఆర్డీవో చిత్రుసస్పెన్షన్‌కు గురికావటంతో ఆ తర్వాత ఇంతవరకు రెగ్యూలర్‌ ఉద్యోగిని నియమించలేదు. అలాగే మున్సిపాల్టీలోనూ రెగ్యూలర్‌ ఉద్యోగులు భర్తీ కాలేదు. సీనియర్‌ అసిస్టెంట్‌-2,  ఏఈ1 డీఈ-1, శానిటరీ విభాగంలో-1 పోస్టు ఖాళీగా ఉంది. అకౌంటు విభాగంలో జేఏవో కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టు కూడా ఇన్‌చార్జీ అనిత నడిపిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల, మందమర్రి, కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీల్లో రెండ్రోజుల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యూలర్‌పోస్టులను వెంటనే భర్తీచేసేట్టు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే పూర్తిస్థాయిలో ప్రజలకు మరిన్నిసేవలు అందించే అవకాశాలుంటాయని పలువురు పేర్కొంటున్నారు.

ఖాళీలను భర్తీ చేసేట్టు చూడాలి

-నర్సయ్య, పట్నం అధ్యక్షుడు, కాగజ్‌నగర్‌ 

రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలను భర్తీచేసేట్టు చూడాలి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వీఆ ర్వోలు, వీఆర్‌ఏలు లేరు. కేవలం తహసీల్దార్‌, నలుగురు సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో వీరిపై అదనపుభారం పడుతోంది. భూసమస్య కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సత్వర పరిష్కారం లభించడం లేదు.

Read more