30 ఏళ్ల నాటి సమస్యకు మోక్షం

ABN , First Publish Date - 2022-09-13T06:23:22+05:30 IST

ఆదర్శ కాలనీలో మెరుగుపడిన డ్రైనేజీ వ్యవస్థ

30 ఏళ్ల నాటి సమస్యకు మోక్షం
పైపులైన్‌ ఏర్పాటుతో మారిన ఆదర్శ కాలనీ రహదారి

30 ఏళ్ల నాటి సమస్యకు మోక్షం

 ఆదర్శ కాలనీలో మెరుగుపడిన డ్రైనేజీ వ్యవస్థ

 రూ.కోటితో పైపులైన్‌ 

 సజావుగా వరద ప్రవాహం

 సమన్వయంతో సత్ఫలితం

 సంబరపడుతున్న కాలనీ వాసులు

30 ఏళ్లనాటి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చొరవతో ఆదర్శ కాలనీలో  ముంపు బెడద తప్పింది. కోటి రూపాయలు వెచ్చించి కొత్త పైపులైన్‌ వేయడంతో డ్రైనేజ్‌ వ్యవస్థ మెరుగుపడింది. పరిస్థితి                     చక్కబడడంతో కాలనీ  వాసులు  హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

 ముషీరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ఆగస్టు వస్తే ముషీరాబాద్‌లోని ఆదర్శకాలనీ వాసులు హడలెత్తిపోయేవారు. చినుకు రాలితో కలవరపడేవారు. చిన్నపాటి వర్షానికే కాలనీ అంతా నీట మునిగేది. ఇళ్లంతా చిందరవందరగా తయారయ్యేంది. ఇళ్లముందు వరద నీరు ఉగ్రరూపం దాల్చేది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందేవారు. రోడ్డంతా చిత్తడిగా మారడంతో రాకపోకలకు అవాంతరాయాలు ఏర్పడేవి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కునుకు తీయడానికి అవకాశం లేకపోయేది. కళ్లముందే వరద ప్రవాహం విలయ తాండవం చేయడంతో చాలామంది  తమ ఇళ్లను వేరొకరికి విక్రయించుకొని ఇతర ప్రాంతాలకు వలసపోయేవారు. 30 ఏళ్లగా వరద సమస్య ఎదురవ్వడంతో వారు సతమతమయ్యేవారు. అది నిన్నటి మాట...తాజాగా పరిస్థితి మారింది. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పుణ్యమా అని నేడు ముంపు బెడద తప్పింది. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడడంతో వరద ప్రవాహం సజావుగా సాగుతోంది. పరిస్థితి మారడంతో కాలనీవాసులు నేడు సంబరాలు జరుపుకుంటున్నారు. కాలనీలో సుమారు దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. డ్రైనేజ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురయ్యేది. మురు గు నీరు సైతం ఇళ్లల్లోకి చొరబడేది. వరద ప్రవాహం ఇంటిలోకి చేరడంతో ఇంటిలోని నిత్యావసర సరుకులు, ఫర్నీచర్‌ తదితర వస్తువులు తడిసిముద్దయ్యేవి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎందరు అధికారులు మారినా వారి సమస్య పరిష్కారం కాలేదు. భూగర్భంలో మోటార్లు,  భారీ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసినా ఫలితాన్ని ఇవ్వలేదు. సాంకేతికపరమైన సమస్యలు ఎదురవ్వడంతో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు. ఎన్ని పోరాటాలు చేసినా ఫలితమివ్వకపోవడంతో కాలనీవాసులు నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో ఆయన చలించిపోయారు. ఈ కాలనీలో సుమారు 40 నుంచి 50 మార్లు పర్యటించారు.గడ్డు సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తక్షణం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించడంతో కోటి రూపాయల అంచనా వ్యయంతో డ్రైనేజ్‌ వ్యవస్థను మెరుగుపరిచారు. పైపులైన్‌ వేసి వరద ప్రవాహానికి వీలు కల్పించారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులను సమన్వయంగా వ్యవహరించి ప్రాజెక్టును ముందుకు నడిపించడంతో ఆదర్శ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-09-13T06:23:22+05:30 IST