WhatsApp Privacy: ఇక డెస్క్‌టాప్‌‌లోనూ వాట్సాప్‌కు తాళం!

ABN , First Publish Date - 2022-11-22T16:29:18+05:30 IST

వాట్సాప్‌ (WhatsApp)లో పంపే మెసేజ్‌లు ఎంత రహస్యంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూజర్ల గోప్యతకు

WhatsApp Privacy: ఇక డెస్క్‌టాప్‌‌లోనూ వాట్సాప్‌కు తాళం!

న్యూఢిల్లీ: వాట్సాప్‌ (WhatsApp)లో పంపే మెసేజ్‌లు ఎంత రహస్యంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్లును అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా, డెస్క్‌టాప్ (Desktop) యూజర్ల కోసం మరో సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేస్తోంది. ప్రస్తుతం డెస్క్‌‌టాప్‌ యూజర్లు ఒకసారి లాగిన్ అయితే ప్రతిసారీ లాగిన్ అవాల్సిన పని ఉండదు. వెబ్ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆటోమెటిక్‌గా అప్పటికే లాగిన్ అయి ఉన్న వాట్సాప్ డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షమవుతుంది. అయితే, ప్రతిసారి లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా చాలామంది దానిని అలాగే క్లోజ్ చేసి సిస్టంను షట్‌డౌన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి అది మూడో వ్యక్తి కంటిలో పడి గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. అయితే, ఇకపై అలాంటి బాధ లేకుండా ఇప్పుడు దానిని కూడా లాక్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది.

ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌కు అదనపు రక్షణ లభిస్తుంది. ఒకరి వాట్సాప్ సంభాషణలను మరొకరు చూసే అవకాశం ఉండదు కనుక యూజర్ నిశ్చింతంగా ఉండొచ్చు. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్‌ను ఆప్షనల్‌గానే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. యూజర్లు కావాలనుకుంటే తమ వాట్సాప్‌కు పాస్‌వర్డ్ రక్షణ పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. న్యూమరిక్, లేదంటే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తోనూ తమ చాట్‌లను లాక్ చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దుతోంది. యూజర్లు కనుక ఒకవేళ తమ వాట్సాప్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా గాబరా పడాల్సింది ఏమీ లేదు. డెస్క్‌టాప్ నుంచి లాగవుట్ అయి మళ్లీ లాగిన్ అయితే సరిపోతుంది. డివైజ్‌ను క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేయడం ద్వారా మళ్లీ డెస్క్‌టాప్‌లోకి లాగిన్ అయి అప్పుడు మళ్లీ పాస్‌వర్డ్‌ను సెట్‌చేసుకోవచ్చు.

Updated Date - 2022-11-22T16:48:09+05:30 IST