Google: గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్లు చూస్తే..

ABN , First Publish Date - 2022-11-22T18:33:01+05:30 IST

వినియోగదారుల సౌలభ్యం కోసం గూగుల్ నిత్యం కొత్త పీచర్లను అభివృద్ధి చేస్తుంటుంది. తాజాగా అలాంటి కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో గూగుల్ వీటిని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. అసలు అవి ఏంటో తెలుసుకుందాం.

Google: గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ  ఫీచర్లు చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ అప్లికేషన్స్ (Google) లేనిదే క్షణం కూడా గడవని పరిస్థితి. పర్యటనలు, షాపింగ్ వంటి వాటి కోసం మనం మ్యాప్స్(Google Maps), గూగుల్ సెర్చ్(Search) వంటి వాటిపై పూర్తిగా ఆధారపడిపోయాం. అయితే..వినియోగదారుల సౌలభ్యం కోసం గూగుల్ నిత్యం కొత్త పీచర్లను అభివృద్ధి చేస్తుంటుంది. తాజాగా అలాంటి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో గూగుల్ వీటిని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.

వీటిల్లో ముఖ్యమైనది గూగుల్ మ్యాప్స్‌లోని ‘లైవ్ వ్యూయ్’(Live View) ఫీచర్. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన పాశ్చాత్య నగరాల్లోనే అందుబాటులో ఉన్న ఈ సౌలభ్యం యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ వాడటం కూడా చాలా ఈజీ.. ఉదాహరణకు మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లామనుకుందాం..అక్కడ బోలెడన్ని షాపులు, భవంతులు కనిపిస్తాయి. కానీ వాటి వివరాలేవీ మనకు తెలియదు. అలాంటి టైంలో మ్యాప్స్‌ అప్లికేషన్‌లోని కెమెరా బటన్‌కు క్లిక్ చేసి ఎదురుగా కనిపిస్తున్న షాపుపై ఫోకస్ చేస్తే చాలు.. దాని వివరాలన్నీ స్క్రీన్‌పై కనబడతాయి. ఆ షాపులో పాపులర్ వస్తువు ఏదీ.. షాపు టైమింగ్స్ ఏంటి వంటివి తెలిసిపోతాయి. అంతేకాకుండా.. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇతర షాపుల వివరాలన్నీ తెలిసిపోతాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ(Augmented Reality) సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ ఫీచర్ యూజర్లకు గొప్ప షాపింగ్ అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.

ఇక భోజనప్రియుల కోసం.. కొత్తగా ప్రవేశపెట్టిన సెర్చ్ ఫీచర్‌తో నచ్చిన ఆహార పదార్థాలు సమీపంలోని ఏ రెస్టారెంట్‌లో ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. ఆ వంటకాన్ని ఏయే పదార్థాలతో తయారు చేశారు..? ధర ఎంత తదితర వివరాలు కూడా గూగుల్ చెప్పేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో అద్భుతమైన ఫీచర్.. మల్టీ సెర్చ్(Multi Search). ఉదాహరణకు మీ ఎదురుగా ఏదో ఫుడ్ ఐటెమ్ ఉంది. దాని పేరేంటో తెలీదుకానీ.. చూడగానే నోరూరించేలా ఉందని అనుకుందాం..అప్పుడు మల్టీసెర్చ్ ఆధారంగా ఆ ఫుడ్ ఫొటోను కెమెరాతో క్లిక్ మనిపించాలి. ఆ తరువాత.. మనకున్న ఇతర ప్రశ్నలలో సెర్చ్ బార్‌లో టైప్ చేయాలి అంతే... దానికి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమైపోతాయి. గూగుల్ లెన్స్ ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వీటిని మీరూ ట్రై చేయండి..

Updated Date - 2022-11-22T18:34:32+05:30 IST