Umran Malik: మెరుపు వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్ మాలిక్.. ఎన్ని కిలోమీటర్ల వేగమంటే?

ABN , First Publish Date - 2022-11-25T17:47:46+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) మరోమారు తన మార్కు

Umran Malik: మెరుపు వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్ మాలిక్.. ఎన్ని కిలోమీటర్ల వేగమంటే?
Umran Malik

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) మరోమారు తన మార్కు బంతులు విసిరి కివీస్ బ్యాటర్లను భయపెట్టాడు. ఈ సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఉమ్రాన్‌ (Umran)కు అవకాశం లభించలేదు. టీ20 జట్టుకు అతడిని ఎంపిక చేయకపోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ (Umran Malik).. బౌలింగుకు దిగడంతోనే తన మెరుపు వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌లో ఉమ్రాన్ సంధించిన రెండో బంతి రికార్డులకెక్కింది. ఆ బంతిని ఉమ్రాన్ (Umran) ఏకంగా 153.1 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. ఆ బంతిని ఎదుర్కొన్న డరిల్ మిచెల్ రెండు పరుగులు సాధించాడు.

11వ ఓవర్‌లో బౌలింగ్ వేసేందుకు వచ్చిన ఉమ్రాన్ ఆ ఓవర్‌లో 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఓవర్‌లో తొలిసారి 150 కిలోమీటర్ల మార్కును చేరుకున్నాడు. ఇక మూడో ఓవర్‌లో మరింత చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండానే డెవోన్ కాన్వే వికెట్‌ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ఉమ్రాన్ బౌలింగును బ్యాటర్లు జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టారు. ఉమ్రాన్ (Umran) తన ఐదో ఓవర్‌లో డరిల్ మిచెల్‌ వికెట్ పడగొట్టి రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తొలి ఐదు ఓవర్లలో ఉమ్రాన్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆరో ఓవర్‌లో మాత్రం లాథమ్ 10 పరుగులు పిండుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టి జాసన్ రాయ్ వికెట్‌ను పడగొట్టాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

Updated Date - 2022-11-25T17:48:02+05:30 IST