T20 India VS Bangladesh : గట్టెక్కారు..

ABN , First Publish Date - 2022-11-03T05:33:22+05:30 IST

వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ పయనంలో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ గెలిచి ఊపిరిపీల్చుకుంది. సూపర్‌-12లో భాగంగా బుధవారం గ్రూప్‌-2లో ..

T20 India VS Bangladesh : గట్టెక్కారు..
T20 World Cup india bangla match

రాణించిన కోహ్లీ, రాహుల్‌

సెమీఫైనల్‌ అవకాశాలు మెరుగు

బంగ్లాపై భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాపై రోహిత్‌ సేన గెలిచి.. సెమీస్‌ అవకాశాలను మెరుగుపరచుకొంది. బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. మధ్యలో వర్షం.. టీమిండియా విజయంపై అనుమానాలు..!

మ్యాచ్‌ నిలిచిపోతే.. డ/లూ ప్రకారం బంగ్లాదే గెలుపు..! కానీ, తెరిపినిచ్చిన వరుణుడు టీమిండియాను ఆదుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రాహుల్‌ బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీ, ఆనక ఓ మెరుపు రనౌట్‌తో మెరిశాడు. ఆ తర్వాత కీలక వికెట్లను కూల్చిన పేసర్లు.. భారత్‌కు విజయం అందించారు.

అడిలైడ్‌: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ పయనంలో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ గెలిచి ఊపిరిపీల్చుకుంది. సూపర్‌-12లో భాగంగా బుధవారం గ్రూప్‌-2లో జరిగిన వర్ష ప్రభావిత థ్రిల్లర్‌లో రోహిత్‌ సేన 5 పరుగులతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్‌), రాహుల్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) అర్ధ శతకాలతో రాణించడంతో.. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (16 బంతుల్లో 30) వేగంగా ఆడాడు. హసన్‌ 3, షకీబల్‌ 2 వికెట్లు పడగొట్టారు. అయితే, బంగ్లా 7 ఓవర్లలో 66/0 స్కోరువద్ద ఉన్నపుడు వర్షం ఆటంకం కలిగించడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులుగా కుదించారు. ఛేదనలో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 145/6 స్కోరు చేసి ఓడింది. లిటన్‌ దాస్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) దంచికొట్టాడు. ఆఖరి ఓవర్‌లో బంగ్లా గెలుపునకు 20 పరుగులు కావాల్సి ఉండగా.. నూరుల్‌ హసన్‌ (25 నాటౌట్‌) సిక్స్‌, ఫోర్‌తో గుబులు రేపినా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/38) కచ్చితమైన యార్కర్లతో భారత్‌ను గెలిపించాడు. హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు కూల్చాడు. ఈ విజయంతో మొత్తం 6 పాయింట్లు సాధించిన భారత్‌ గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే, నాకౌట్‌ బెర్త్‌ ఖరారు కావాలంటే ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో రోహిత్‌ సేన నెగ్గాలి. లేదంటే గణాంకాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

బెంబేలెత్తించిన లిటన్‌: భారీ లక్ష్యం.. పైగా ఫామ్‌లో ఉన్న టీమిండియా పేసర్లు. దీంతో బంగ్లా ఓటమి లాంఛనమేనని అనుకున్నారంతా. అయితే వర్షం వచ్చే పరిస్థితులు ఉండడంతో బంగ్లా దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ ఎడాపెడా షాట్లతో సీన్‌ మారిపోయింది. అర్ష్‌దీప్‌ వేసిన రెండో ఓవర్‌లో 3 బౌండ్రీలు బాదిన లిటన్‌.. తర్వాతి ఓవర్‌లో 6,4,4తో 16రన్స్‌ పిండుకున్నాడు. దాస్‌ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను కార్తీక్‌ అందుకోలేకపోయాడు. షమీ వేసిన ఆరో ఓవర్‌లో 4,6,4తో లిటన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఏడు ఓవర్ల తర్వాత బంగ్లా 66/0తో పటిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు.. వర్షం కురవడంతో 45 నిమిషాలు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చూసుకొంటే లక్ష్యానికి బంగ్లా 17 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌ నిలిపేస్తే కచ్చితంగా బంగ్లాదే గెలుపు. ఒకవైపు షకీబల్‌ సేనలో ఆనందం.. మరోవైపు టీమిండియా శిబిరంలో ఆందోళన. కానీ, వర్షం ఆగిపోవడంతో డ/లూ పద్ధతిలో లక్ష్యాన్ని సవరించగా.. బంగ్లా విజయానికి 54 బంతుల్లో 85 పరుగులు చేయాల్సివచ్చింది.

మలుపు తిప్పిన రనౌట్‌: వరుణుడు అడ్డురావడంతో ఒక రకంగా బంగ్లా జోరుకు బ్రేక్‌ పడిందేమోననిపించింది. మ్యాచ్‌ తిరిగి మొదలైన తర్వాత దాస్‌ను రాహుల్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేసి జట్టుకు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌ శాంటో (21)ను షమీ వెనక్కి పంపడంతో టీమిండియా ఊపిరిపీల్చుకొంది. ఇక 12వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు దిగిన అర్ష్‌దీప్‌.. అఫీఫ్‌ (3), షకీబల్‌ను అవుట్‌చేసి సమీకరణలను మార్చేశాడు. తర్వాత యాసిర్‌ (1), మొసద్దిక్‌(6)ను పాండ్యా పెవిలియన్‌ చేర్చాడు. కానీ, నూరుల్‌, టస్కిన్‌ (12 నాటౌట్‌) 37 రన్స్‌ భాగస్వామ్యంతో ఉత్కంఠ రేపినా అర్ష్‌దీప్‌ కూల్‌గా ముగించాడు.

నడిపించిన కోహ్లీ: అడిలైడ్‌పై తనకున్న ప్రేమను కోహ్లీ మరోసారి చాటుకోగా.. విమర్శలు ఎదుర్కొంటున్న ఓపెనర్‌ రాహుల్‌ మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవడంతో టీమిండియా సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. రాహుల్‌తో కలసి రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్‌.. సూర్యతో కలసి మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు.

రోహిత్‌ శర్మ (2) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ రాహుల్‌, కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్‌ 37/1తో నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, షోరిఫుల్‌ వేసిన 9వ ఓవర్‌లో రాహుల్‌ 6,6,4తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. షకీబల్‌ బౌలింగ్‌లో డబుల్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న రాహుల్‌.. తర్వాతి బంతికి భారీ షాట్‌ ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరాడు. అనంతరం సూర్య క్రీజులోకి రావడంతో రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. మూడు ఫోర్లు బాది జోరుమీదున్న సూర్యను షకీబల్‌ బౌల్డ్‌ చేశాడు. హార్దిక్‌ (5), దినేష్‌ కార్తీక్‌ (7), అక్షర్‌ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. కోహ్లీ మాత్రం షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో అశ్విన్‌ (13 నాటౌట్‌) 6,4తో జట్టు స్కోరును 180 మార్క్‌ దాటించాడు.

స్కోరు బోర్డు

భారత్‌: రాహుల్‌ (సి) ముస్తాఫిజుర్‌ (బి) షకీబల్‌ 50, రోహిత్‌ శర్మ (సి) యాసిర్‌ (బి) హసన్‌ 2, కోహ్లీ (నాటౌట్‌) 64, సూర్యకుమార్‌ (బి) షకీబల్‌ 30, హార్దిక్‌ పాండ్యా (సి) యాసిర్‌ (బి) హసన్‌ 5, దినేష్‌ కార్తీక్‌ (రనౌట్‌/షకీబల్‌) 7, అక్షర్‌ (సి) షకీబల్‌ (బి) హసన్‌ 7, అశ్విన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 184/6; వికెట్ల పతనం: 1-11, 2-78, 3-116, 4-130, 5-150, 6-157; బౌలింగ్‌: టస్కిన్‌ 4-0-15-0, షోరిఫుల్‌ ఇస్లాం 4-0-57-0, హసన్‌ మెహ్మూద్‌ 4-0-47-3, ముస్తాఫిజుర్‌ 4-0-31-0, షకీబల్‌ 4-0-33-2.

బంగ్లాదేశ్‌: నజ్ముల్‌ శాంటో (సి) సూర్య (బి) షమి 21, లిటన్‌ దాస్‌ (రనౌట్‌/రాహుల్‌) 60, షకీబల్‌ (సి/సబ్‌) హుడా (బి) అర్ష్‌దీప్‌ 13, అఫీఫ్‌ (సి) సూర్య (బి) అర్ష్‌దీప్‌ 3, యాసిర్‌ అలీ (సి) అర్ష్‌దీప్‌ (సి) హార్దిక్‌ 1, నూరుల్‌ హసన్‌ (నాటౌట్‌) 25, మొసద్దక్‌ (బి) హార్దిక్‌ 6, టస్కిన్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16 ఓవర్లలో 145/6; వికెట్ల పతనం: 1-68, 2-84, 3-99, 4-100, 5-102, 6-108; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-27-0, అర్ష్‌దీప్‌ 4-0-38-2, షమి 3-0-25-1, అక్షర్‌ పటేల్‌ 1-0-6-0, అశ్విన్‌ 2-0-19-0, హార్దిక్‌ 3-0-28-2.

1 టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక (1065) పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌.. లంక దిగ్గజం జయవర్దనె (1016)ను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గేల్‌ (965), రోహిత్‌ (921) 3,4 స్థానాల్లో ఉన్నారు.

Updated Date - 2022-11-03T05:38:19+05:30 IST