Shakib al Hasan: భారత్‌పై ఆ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబల్ హసన్!

ABN , First Publish Date - 2022-12-05T17:29:39+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ఒక్క పరుగు తేడాతో

Shakib al Hasan: భారత్‌పై ఆ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబల్ హసన్!

ఢాకా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ (Shakib al Hasan) అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఐదుగురు బ్యాటర్లను పెవిలియన్ పంపిన షకీబ్.. వన్డేల్లో భారత్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, ఓవరాల్‌గా 8వ స్పిన్నర్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. అతడి కంటే ముందు ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీ ధరన్, ఆష్లే గెయిల్స్, అజంత మెండీస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ ఈ జాబితాలో ఉన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భారత్‌కు తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఎదురుదెబ్బే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ లోపాలు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించాయి. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 187 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలుత నిలకడగా ఆడింది. అయితే, ఆ తర్వాత టీమిండియా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. 39.3 ఓవర్ల వద్ద హసన్ మహ్మూద్ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ విజయం ఖాయమని అభిమానులు సంబరం చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత దాదాపు 7 ఓవర్లు వేసిన బౌలర్లు బంగ్లాదేశ్ టెయిలెండర్లను వెనక్కి పంపేందుకు ఆపసోపాల పడినా ఫలితం లేకుండా పోయింది.. 39 బంతులు వేసి కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోవడం బౌలర్ల వైఫల్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఈ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక, ఫీల్డింగ్ లోపాలు కూడా ఈ మ్యాచ్‌లో జట్టును వేధించాయి.

Updated Date - 2022-12-05T17:31:01+05:30 IST