Lionel Messi: ఏం ప్రకటించబోతున్నాడు?.. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ నిర్ణయంపై ఉత్కంఠ !

ABN , First Publish Date - 2022-12-14T17:09:07+05:30 IST

చిరుతను తలపించే పరుగులోనూ బంతిని పాదాలతో సంపూర్ణ నియంత్రణ సాధించే నైపుణ్యమున్న ఆటగాడు ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi). మైదానంలో చిచ్చర పిడుగులా చెలరేగే ఈ ప్లేయర్‌కి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడనే పేరుంది.

Lionel Messi: ఏం ప్రకటించబోతున్నాడు?.. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ నిర్ణయంపై ఉత్కంఠ !

చిరుతను తలపించే పరుగులోనూ బంతిని పాదాలతో సంపూర్ణ నియంత్రణ సాధించే నైపుణ్యమున్న ఆటగాడు ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi). మైదానంలో చిచ్చర పిడుగులా చెలరేగే ఈ ప్లేయర్‌కి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడనే పేరుంది. మరి మైదానంలోనే కాకుండా కెరీర్‌పరంగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటాడా?.. ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA WorldCup 2022) ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా ? అనే ప్రశ్నలకు ఔననే సందేహం కలుగుతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచే అర్జెంటీనాకు తన చివరి మ్యాచ్ అని మెస్సీ అన్నట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

‘‘ అర్జెంటీనా ఫైనల్ చేరడం చాలా ఆనందంగా ఉంది. ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడి నా వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగిస్తా’’ అని మెస్సీ వ్యాఖ్యానించినట్టు అర్జెంటీనా మీడియా సంస్థ ‘డియారియో డెపొర్టివో ఒలే’ తెలిపింది. ‘‘ తదుపరి వరల్డ్ కప్‌కు చాలా సంవత్సరాలు ఉంది. అందులో ఆడే సామర్థ్యం నాకు ఉందనే నమ్మకం లేదు. ఈ వరల్డ్ కప్‌లా ముగిస్తామనే ఆశ అసలే లేదు. ఈ ఫిఫా కప్ ఉత్తమం’’ అని మెస్సీ పేర్కొన్నాడని వెల్లడించింది. మరోవైపు సెమీ-ఫైనల్ విజయం తర్వాత.. ఎంజాయ్ చేయాలంటూ తోటి ఆటగాళ్లందరినీ మెస్సీ కోరాడని సమాచారం. ‘‘ అర్జెంటీనా మరోసారి ఫిఫాలో ఫైనల్ చేరింది కాబట్టి దీన్ని అందరూ ఎంజాయ్ చేయండి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ రోజు ఎంతో ప్రత్యేకం’’ అని మెస్సీ అన్నాడని మీడియా తెలిపింది. వీటన్నింటి బట్టి చూస్తే మెస్సీ రిటైర్మెంట్ ఖాయమని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ రిపోర్టుల ప్రకారమే ఫైనల్ మ్యాచ్‌ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవ్వడం ఖాయం.

కాగా మంగళవారం రాత్రి క్రొయేసియా వర్సెస్ అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ సేన విజయం సాధించింది. 3-0 గోల్డ్ తేడాతో క్రొయేసియాను మట్టికరిపించింది. దీంతో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ 2022లో ఫైనల్ చేరుకుంది. ఫైనల్ చేరే జట్టుతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. కాగా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ చెలరేగి ఆడాడు. ఒక పెనాల్టీని అద్భుతమైన గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత మరో చక్కటి పాస్ అందించి తన జట్టు మరో గోల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మెస్సీ మొత్తం 5 గోల్స్ చేసినట్టయ్యింది. అంతేకాకుండా వరల్డ్ కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. తన దేశానికే చెందిన గాబ్రియెల్ బటిస్టుటాను (10 గోల్స్) అధిగమించాడు. 35 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్స్‌లో ఇప్పటివరకు మొత్తం 11 గోల్స్ చేశాడు. కాగా ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ 2022 తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనా భంగపాటుకు గురైంది. పసికూన సౌదీఅరేబియా చేతిలో 1-2 గోల్డ్స్ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌కు ముందు ఏకంగా 32 మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన ఆ జట్టు సౌదీ చేతిలో ఓడిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Updated Date - 2022-12-14T17:25:50+05:30 IST