Tom Latham: టామ్ లాథమ్ సంచలన ఇన్నింగ్స్.. తొలి వన్డేలో కివీస్ ఘన విజయం

ABN , First Publish Date - 2022-11-25T15:49:28+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ (Team India)తో ఇక్కడి ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ (New Zealand)

Tom Latham: టామ్ లాథమ్ సంచలన ఇన్నింగ్స్.. తొలి వన్డేలో కివీస్ ఘన విజయం

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ (Team India)తో ఇక్కడి ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ (New Zealand) ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టామ్ లాథమ్ (Tom Latham) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ నిర్దేశించిన 307 పరుగుల విజయ లక్ష్యం చిన్నదైపోయింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలోనే ఛేదించి సిరీస్‌లో శుభారంభం చేసింది.

ఫామ్ లేమితో తంటాలు పడుతున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఈ మ్యాచ్‌తో మళ్లీ ఊపులోకి వచ్చాడు. ఇక టామ్ లాథమ్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 307 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 35 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (22)ను శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. 68 పరుగుల వద్ద డెవోన్ కాన్వే (24), 88 పరుగుల వద్ద డరిల్ మిచెల్ (11) అవుటయ్యారు. దీంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గుతున్నట్టు కనిపించింది. అయితే, భారత అభిమానుల ఆశలను కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ అడియాసలు చేశారు.

క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించారు. విలియమ్సన్ సంయమనంతో ఆడగా, లాథమ్ మాత్రం చెలరేగిపోయాడు. బంతి కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఫోర్లు సిక్సర్లతో స్టేడియంను హోరెత్తించాడు. అతడి దెబ్బకు భారత బౌలింగ్, ఫీల్డింగ్ కకావికలమైంది. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న లాథమ్ ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగించాడు. విలియమ్సన్ అతడికి అండగా నిలుస్తూ అడపా దడపా బౌండరీలు బాదుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు.

వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేన్, లాథమ్ బాదుడుతో భారీ లక్ష్యం కాస్తా కరిగిపోయింది. చివరికి 17 బంతులు మిగిలి ఉండగానే విజయం కివీస్ సొంతమైంది. విలియమ్సన్ 98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 94 పరుగులు చేసి సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో అజేయంగా 145 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధవన్-శుభమన్ గిల్ జంట తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. అర్ధ సెంచరీ (50) చేసి గిల్ (Shubman Gill) అవుటయ్యాడు. ఆ వెంటనే అదే స్కోరు వద్ద 72 పరుగులు చేసి జోరుమీదున్నట్టు కనిపించిన ధవన్ (Shikhar Dhawan) కూడా పెవిలియన్ చేరాడు. పంత్ (Rishabh Pant) మరోమారు నిరాశపరిచాడు. ఫార్మాట్ మారినా అతడి ఆటతీరులో మాత్రం మార్పు కనిపించలేదు. 15 పరుగులు మాత్రమే చేసి ఉసూరు మనిపించాడు.

సూర్యకుమార్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే, క్రీజులో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం కివీస్ బౌలర్లపై దాడి చేశాడు. 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసి అవుటయ్యాడు. సంజు శాంసన్ 36 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు 300 పరుగులు దాటించాడు. 16 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అజేయ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2022-11-25T16:00:22+05:30 IST

Read more