FIFA World Cup Semis : ఫ్రాన్స్‌ ఎటాక్‌.. మొరాకో డిఫెన్స్‌

ABN , First Publish Date - 2022-12-14T00:51:08+05:30 IST

సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్‌ సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన అండర్‌ డాగ్‌ మొరాకోకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌లకు షాకిస్తూ జెయింట్‌ కిల్లర్‌గా నిలిచిన ..

 FIFA World Cup Semis : ఫ్రాన్స్‌ ఎటాక్‌.. మొరాకో డిఫెన్స్‌

నేడు రెండో సెమీస్‌

ఫిఫా వరల్డ్‌కప్‌

రాత్రి 12.30 నుంచి

స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో

దోహా: సంచలన రీతిలో తొలిసారి వరల్డ్‌కప్‌ సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన అండర్‌ డాగ్‌ మొరాకోకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌లకు షాకిస్తూ జెయింట్‌ కిల్లర్‌గా నిలిచిన మొరాకో.. బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హ్యూగో లోరిస్‌ సేన ఫేవరెట్‌ అయినా.. టోర్నీలో మొరాకో ఆటను చూసిన తర్వాత ఆ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు. లీగ్‌ దశలో వరల్డ్‌ నెం:2 బెల్జియానికి షాకిచ్చిన అట్లాస్‌ లయన్స్‌.. రౌండ్‌-16లో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ను షూటౌట్‌ చేసింది. ఇక క్వార్టర్స్‌లో బలమైన పోర్చుగల్‌ను ఓడించి తొలిసారి సెమీ్‌సకు చేరుకొంది. ఇదే జోరుతో ఫైనల్‌ చేరాలన్న పట్టుదలతో ఉంది. ఇక, సమష్టిగా ప్రత్యర్థి గోల్‌ పోస్టులపై దాడులు చేయడం మొరాకో ప్రత్యేకత. హాకీమి జియేష్‌, సోఫియానే బౌఫాల్‌, యూసుఫ్‌ నేసిరో ఫార్వర్డ్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. జట్టులో స్టార్‌ ఆటగాడు అచారఫ్‌ హకీమి ఉండనే ఉన్నాడు.

జోరుమీదున్న ఫ్రాన్స్‌..: టైటిల్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్న ఫ్రాన్స్‌.. టోర్నీలో ఇప్పటి వరకు ప్రత్యర్థి ఆటగాడికి గోల్‌ చేసే అవకాశం ఇవ్వని మొరాకోను ఎదుర్కొనడం ఒకరకంగా సవాలే..! వరుసగా రెండోసారి సెమీస్‌ చేరిన ఫ్రెంచ్‌ టీమ్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్యునీసియా చేతిలో ఓడినా.. సునాయాసంగా నాకౌట్‌ బెర్త్‌ను పట్టేసింది. ఇక, ప్రీక్వార్టర్స్‌లో పోలెండ్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్‌.. క్వార్టర్స్‌లో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్ట్రయికర్లు ఎంబప్పే, గిరోర్డ్‌ మంచి ఫామ్‌లో ఉండడం జట్టుకు శుభపరిణామం కాగా.. అనుభవజ్ఞుడైన గ్రీజ్‌మెన్‌ చక్కని అవకాశాలు సృష్టిస్తున్నాడు. మొత్తంగా చూస్తే మొరాకో డిఫెన్స్‌కు ఫ్రెంచ్‌ ఎటాకింగ్‌కు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. కానీ, పెద్ద జట్టు కావడంతో ఫ్రాన్స్‌ టీమ్‌పైనే ఒత్తిడంతా..!

  • ఈ వరల్డ్‌కప్‌లో బెల్జియం, క్రొయేషియా, స్పెయిన్‌, పోర్చుగల్‌ లాంటి ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌ జట్లలో ఒక్కటి కూడా మొరాకోపై ఒక్కగోల్‌ కూడా చేయలేక పోవడం విశేషం. కెనడాతో మ్యాచ్‌లో మాత్రం ఓన్‌ గోల్‌ నమోదైంది.

  • వరల్డ్‌కప్‌లో మొరాకోతో ఫ్రాన్స్‌ తలపడడం ఇదే మొదటిసారి.

  • విశ్వకప్‌ సెమీస్‌లో ఆడడం ఫ్రాన్స్‌కు ఇది ఏడోసారి. గతంలో 1958, 1982, 1986ల్లో జరిగిన టోర్నీల్లో సెమీస్‌లో ఫ్రెంచ్‌ టీమ్‌ వెనుదిరగ్గా.. 1998, 2006, 2018ల్లో ఫైనల్‌ చేరింది.

Updated Date - 2022-12-14T06:59:22+05:30 IST