Anjali: మహిళల టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు అంజలి
ABN , First Publish Date - 2022-12-29T00:56:50+05:30 IST
ఆస్ట్రేలియాతో ఇటీవలి టీ20 సిరీ్‌సలో సత్తా చాటిన తెలుగు క్రికెటర్ అంజలీ శర్వాణికి అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ఈసారి ఆమెకు ఏకంగా టీ20 వరల్డ్ కప్‌లో తలపడే భారత జట్టులో చోటు లభించింది...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఇటీవలి టీ20 సిరీ్‌సలో సత్తా చాటిన తెలుగు క్రికెటర్ అంజలీ శర్వాణికి అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ఈసారి ఆమెకు ఏకంగా టీ20 వరల్డ్ కప్‌లో తలపడే భారత జట్టులో చోటు లభించింది. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 10నుంచి 26 వరకు జరిగే మహిళల పొట్టి ప్రపంచ కప్‌లో తలపడే 15మంది సభ్యుల టీమిండియాను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల లెఫ్టామ్ పేసర్ కేశవరాజుగారి అంజలీ శర్వాణికి చోటు కల్పించారు. అలాగే మరో తెలుగు క్రికెటర్, ఓపెనర్ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. 33 ఏళ్ల వెటరన్ పేసర్ శిఖా పాండే పునరాగమనం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు సారథ్యం వహించనుంది. స్మృతీ మంధాన వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవలి ఆస్ట్రేలియాతో సిరీ్‌సలో విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వరల్డ్ కప్‌నకు ముందు జరిగే దక్షిణాఫ్రికాలోనే జరిగే ముక్కోణపు సిరీ్‌సకు కూడా జట్టును ప్రకటించారు. జనవరి 19న మొదలయ్యే ముక్కోణపు సిరీ్‌సలో భారత్‌తోపాటు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పాల్గొంటాయి.
ముక్కోణపు సిరీస్ జట్టు: హర్మన్ (కెప్టెన్), మంధాన (వైస్-కెప్టెన్), అంజలీ శర్వాణి, యాస్తిక (కీపర్), జెమీమా, హర్లీన్, దీప్తీశర్మ, దేవిక, రాజేశ్వరీ గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, సుష్మా వర్మ (కీపర్), అమన్‌జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే.
ఇదీ ప్రపంచ కప్ జట్టు
హర్మన్ ప్రీత్ (కెప్టెన్), మంధాన (వైస్-కెప్టెన్), అంజలీ శర్వాణి, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (కీపర్), జెమీమా, హర్లీన్, దీప్తీశర్మ, దేవిక, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే.
స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్.