New Zealand: కివీస్‌దే తొలి అడుగు

ABN , First Publish Date - 2022-11-05T01:57:50+05:30 IST

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

New Zealand: కివీస్‌దే తొలి అడుగు

ఐర్లాండ్‌పై విజయంతో సెమీ్‌సలోకి..

చెలరేగిన విలియమ్సన్‌

లిటిల్‌ హ్యాట్రిక్‌ వృథా

టీ20 వరల్డ్‌కప్‌

అడిలైడ్‌: న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సూపర్‌-12లో భాగంగా జరిగిన తమ చివరి గ్రూప్‌-1 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 35 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్‌ కూడా ఏడు పాయింట్లతోనే ఉన్నా రన్‌రేట్‌ మైన్‌సలో ఉంది. ఇక ఇప్పటికే రేసు నుంచి వైదొలిగిన ఐర్లాండ్‌కు పేసర్‌ జోషువా లిటిల్‌ హ్యాట్రిక్‌ తీయడం ఊరటనిచ్చే విషయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), ఆలెన్‌ (18 బంతుల్లో 32), మిచెల్‌ (31 నాటౌట్‌) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసి ఓడింది. స్టిర్లింగ్‌ (37), బాల్బర్నీ (30), డాక్‌రెల్‌ (23) ఫర్వాలేదనిపించారు. ఫెర్గూసన్‌కు మూడు.. సౌథీ, సోధీ, శాంట్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విలియమ్సన్‌ నిలిచాడు.

ఆరంభంలో అదరగొట్టినా..: భారీ ఛేదనను ఐర్లాండ్‌ ఆశాజనకంగానే ఆరంభించింది. ఓపెనర్లు స్టిర్లింగ్‌, బాల్బర్నీ కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కానీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరితో పాటు టెక్టర్‌ (2) పెవిలియన్‌కు చేరడంతో 73/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో మిగతా బ్యాటర్లు కూడా జట్టుకు అండగా నిలవలేకపోయారు. మిడిలార్డర్‌ను ఫెర్గూసన్‌ కట్టడి చేశాడు.

కెప్టెన్‌ అదుర్స్‌.. లిటిల్‌ హ్యాట్రిక్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సలో టాప్‌-5 ఆటగాళ్లు అదరగొట్టారు. అయితే చివర్లో లిటిల్‌ హ్యాట్రిక్‌ కారణంగా 200లోపే వీరి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఓపెనర్లు ఆలెన్‌, కాన్వే (28) ధాటికి పవర్‌ప్లేలోనే జట్టు 52 పరుగులు సాధించింది. నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన ఆలెన్‌, ఆరో ఓవర్‌లోనూ 6,4తో ఆకట్టుకుని ఐదో బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాన్వేతో కలిసి విలియమ్సన్‌ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. ఫిలిప్‌ (17) ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. అటు చక్కటి షాట్లతో ఆకట్టుకొని కేన్‌ పూర్తి ఆధిపత్యం చాటుకున్నాడు. ఇదే క్రమంలో అర్ధసెంచరీ సాధించడంతో పాటు ఐదో వికెట్‌కు మిచెల్‌తో కలిసి 60 పరుగులు జోడించాడు. అలాగే 18వ ఓవర్‌లో విలియమ్సన్‌ వరుసగా 6,4,6తో 21 పరుగులు రాబట్టాడు. కానీ ఈ జోరుకు తర్వాతి ఓవర్‌లోనే జోషువా హ్యాట్రిక్‌తో తెర దించాడు. వరుస బంతుల్లో కేన్‌, నీషమ్‌ (0), శాంట్నర్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో కివీస్‌ 12 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 185/6 (విలియమ్సన్‌ 61, ఆలెన్‌ 32; లిటిల్‌ 3/22, డెలానీ 2/30).

ఐర్లాండ్‌: 20 ఓవర్లలో 150/9 (స్టిర్లింగ్‌ 37, బాల్బర్నీ 30; ఫెర్గూసన్‌ 3/22, శాంట్నర్‌ 2/26, సౌథీ 2/29, సోధీ 2/31).

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జోషువా లిటిల్‌ (39). సందీప్‌ లామిచానే (38)ను అధిగమించాడు.

టీ20 ప్రపంచక్‌పలో హ్యాట్రిక్‌ సాధించిన ఆరో బౌలర్‌గా జోషువా లిటిల్‌. తాజా టోర్నీలో కార్తీక్‌ మయప్పన్‌ (యూఏఈ) తర్వాత మరోసారి ఈ ఫీట్‌ నమోదైంది.

Updated Date - 2022-11-05T05:57:21+05:30 IST