పచ్చని పెళ్లిలో లడ్డూ చిచ్చు.. అసలు పెళ్లే వద్దని తేల్చిచెప్పిన వరుడు.. అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2022-04-26T23:10:09+05:30 IST

పెళ్లికి అన్ని ఏర్పాట్లూ ఘనంగా జరిగాయి.. వరుడు, వధువు పీటల మీద కూర్చున్నారు..

పచ్చని పెళ్లిలో లడ్డూ చిచ్చు.. అసలు పెళ్లే వద్దని తేల్చిచెప్పిన వరుడు.. అసలు కథేంటంటే..!

పెళ్లికి అన్ని ఏర్పాట్లూ  ఘనంగా జరిగాయి.. వరుడు, వధువు పీటల మీద కూర్చున్నారు.. మండపంలో బంధువులు కోలాహలంగా తిరుగుతున్నారు.. మగ పెళ్లివారు భోజనాలకు వెళ్లారు.. భోజనంలో లడ్డూ కావాలని ఒక వ్యక్తి అడిగాడు.. లడ్డూ లేదని ఆడ పెళ్లివారు చెప్పారు.. దీంతో మాటామాటా పెరిగింది.. ఇరు వర్గాల వారూ కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.. దీంతో వరుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆడ పెళ్లివారు తమను కొట్టారని ఫిర్యాదు చేశాడు.. పోలీసులు ఇరు వర్గాల వారికీ నచ్చ చెప్పి పెళ్లి జరిపించారు. 


ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు సమీపంలోని ముంగేలికి చెందిన కుంతి అనే యువతికి సూరజ్ సాహుతో వివాహం నిశ్చయించారు. ఊరేగింపు అనంతరం వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వరుడు పెళ్లి పీటల మీద కూర్చోగా.. అతడి బంధువులు భోజనాలకు వెళ్లారు.  పెళ్లికూతురు తరపు వారు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భోజనంలో లడ్డూలు కావాలని మగపెళ్లి వారు అడిగారు. లడ్డూలు చేయించ లేదని ఆడపెళ్లి వారు చెప్పారు. దాంతో చిన్నగా గొడవ మొదలైంది. ఆ గొడవ తారస్థాయికి చేరి ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. 


విషయం తెలుసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించాడు. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వధువు తరఫు వారు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. స్టేషన్ ఎస్సై వధువు తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. ఇరు వర్గాల వారికీ నచ్చ చెప్పారు. అనంతరం పోలీసుల సమక్షంలో అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు వారిని ఆశీర్వదించి కథను సుఖాంతం చేశారు.

Updated Date - 2022-04-26T23:10:09+05:30 IST