అభాగినుల జయకేతనం
ABN , First Publish Date - 2022-11-20T11:51:42+05:30 IST
ఒకప్పుడు అక్కడి ఊరు - వాడలు సాంస్కృతిక వికాసోద్యమాలకు ఆలవాలం. చరిత్ర పుటల్లోకి వెళితే...
ఒకప్పుడు అక్కడి ఊరు - వాడలు సాంస్కృతిక వికాసోద్యమాలకు ఆలవాలం. చరిత్ర పుటల్లోకి వెళితే... అక్కడి వీధులన్నీ జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్ళకు కడతాయి. గుంటూరు బ్రాడీపేటలోని శంకర్ విలాస్ మీదుగా ముందుకెళితే... రోడ్డు వారగా రాజ ఠీవితో వందేళ్ల వైభవోపేత చరిత్రకు అద్దం పట్టే పురాతన భవనం కనిపిస్తుంది. అదే తెలుగు మహిళా చైతన్యగీతం... అభాగినుల జయకేతనం... మహాత్ముడు మెచ్చిన ‘శారదా నికేతనం’. ఈ నెల 22న ఈ స్ఫూర్తివికాసం శతవసంతాలు పూర్తి చేసుకుంటోంది...
అంధ విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో సమాజం ఆవలకు నెట్టేసిన మహిళలను అమ్మలా అక్కున చేర్చుకొని, వారికొక వెలుగు దారి చూపిన మహోన్నత మానవతామూర్తి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. మహిళల జీవితాల్లోని చీకట్లను చీల్చే శక్తి చదువుకే సొంతమని వందేళ్ళ కిందటే ఆమె నమ్మారు. బాధితురాళ్ళకు బాసటగా ఓ ఆశ్రమం అవసరమని ఆనాడే గుర్తించారు. అలా 1922, నవంబరు 22న గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు ‘శారదా నికేతనం’ నెలకొల్పారు. పదిమందితో మొదలైన ఈ గురుకులానిది సాంఘిక సంస్కరణోద్యమ చరిత్రలో సువర్ణాధ్యాయం. తెలుగుగడ్డపై దీనిదొక మహోజ్వల ప్రస్థానం.
అలాంటి వాళ్లకు అమ్మా, నాన్న...
వందేళ్ల క్రితమే... కుల, మత అంతరాలు శారదా నికేతనానికి ఆమడ దూరంగా ఉండేది. అక్కడి ఆవరణలో తరతమ భేదాలుండవు. ధనిక, పేదా తేడాలుండవు. వారిదంతా అరమరికలెరుగని ఒకటే కుటుంబం. లక్ష్మీబాయమ్మ కడుపున పుట్టింది అర్జునరావే అయినా, తాను మాత్రం కొన్నివందల మందికి అమ్మగా మారారు. నికేతనంలో అబ్బాయిలకు ప్రవేశం ఉండొద్దని, కన్నకొడుకునూ దూరం పెట్టిన అంకితత్వం ఆమెది. కాత్యాయని, కల్యాణి, చారుశీల, శారద, రాజమ్మ... ఇలా నా అన్నవాళ్లెవరూ లేని పదిమందికి అమ్మానాన్నలయ్యారు ఉన్నవ దంపతులు. అలాంటి ఎంతోమంది చదువులు మొదలు, పెళ్లిళ్లు, పురుళ్ళు వంటి బాధ్యతలన్నీ లక్ష్మీబాయమ్మ నిర్వర్తించారు.
ఎల్లలు దాటిన అభిమానం...
శారదా నికేతన్ మహోన్నత లక్ష్యానికి మెచ్చిన మునగాల రాజా నాయని వెంకట రంగారావు బ్రాడీపేటలో మూడెకరాల స్థలం విరాళమిచ్చారు. అందులోనే దాతల సహకారంతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. హైదరాబాద్ వాసి హనుమంతు గుప్తా 1930లలో నికేతనంలో ప్రత్యేక గదులు కట్టించడం ఉన్నవ మీద తెలుగు నాట ఎల్లలు దాటిన అభిమానానికి నిదర్శనం. శారదా నికేతనం నిర్వహణ కోసం కొండా వెంకటప్పయ్య, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి వంటి వాళ్లు పల్నాడు, బాపట్ల తదితర ప్రాంతాల్లో 150 ఎకరాలకుపైగా భూమిని దానమిచ్చారు. రానురాను నికేతనం బిడ్డల సంఖ్య పెరగసాగింది. వారికేలోటు రాకూడదని, తానే గుర్రపు బండి తోలుతూ, ఇంటింటికి తిరిగి బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాలను లక్ష్మీబాయమ్మ సేకరించేవారు. ‘ఏమీ లేకుంటే, కనీసం మజ్జిగలో వేసుకునేందుకు మా పిల్లలకు ఉప్పు అయినా దానమివ్వండి అంటూ దాతలను అర్థించేవార’ంటూ శారదా నికేతనం పూర్వ విద్యార్థి కోగంటి వేంకట శ్రీ రంగనాయకి గుర్తుచేసుకున్నారు.
పైసా ఖర్చు లేకుండా...
తొలినాళ్లలో గురుకుల పాఠశాలగా ప్రారంభమైన శారదా నికేతనంలో కొద్ది కాలానికే తెలుగు, హిందీ, ఆంగ్ల, సంస్కృత భాషల్లో విద్యా బోధన సాగింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, భాషా ప్రావీణ్య కోర్సులు, శాస్త్రీయ సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తదితర లలిత కళలు, కుట్లు, అల్లికలు వంటి రకరకాల వృత్తివిద్యల్లో శిక్షణతో అలరారిన ఆనాటి నికేతన వైభవం ఎంతో గొప్పది! అక్కడ చదివిన చాలామంది ఇవాల్టికి బోధనారంగంలో రాణిస్తున్నారు. ఘట్‌కేసర్ నుంచి సత్తెమ్మగా అక్కడికెళ్లి, జాతీయోద్యమ నాయకురాలిగా తిరిగొచ్చిన సంగెం లక్ష్మీబాయమ్మ జీవితమే శారదా నికేతనం ఔచిత్యానికి ప్రతీక. భారతీ రంగా, బొందలపాటి శంకుంతలా దేవి వంటి వారెందరో శారదా నికేతనంలో అక్షరాలు దిద్దినవారే.
వితంతు పునర్వివాహాలు...
లక్ష్మీబాయమ్మకు పూజా పునస్కారాలు, నోములు, వ్రతాలు నిత్యకృత్యం. అదే సమయంలో ఛాందస భావాలకు ఉన్నవ దంపతులు విరుద్ధం. పదేళ్ళకే వితంతువు అయిన కూతురిని మూఢం అని కన్నవాళ్లు నడిరోడ్డు మీద వదిలేస్తే ‘నాకు అలాంటి పట్టింపేమీ లేదంటూ’ ఆ అమ్మాయిని నికేతనానికి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పారు లక్ష్మీబాయమ్మ. అంతేకాదు... వితంతువులకు రవికెలు తొడిగి, నుదుట తిలకం దిద్ది సంప్రదాయవాదులకు సవాలు విసిరారు. శారదా నికేతనంలోని నలభైకి పైగా వితంతువులకు ఉన్నవ దంపతుల చేతుల మీదగా పునర్వివాహాలు జరిగాయి. అందుకు ఉన్నవ దంపతులు ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. అయినా కాలానికి ఎదురీదారు. జనుల మదిలో నిలిచారు.
స్వరాజ్య పోరులో....
స్వాతంత్ర్యోద్యమంలోనూ ‘శారదా నికేతనం’ విద్యార్థినుల పాత్ర ప్రత్యేకమైనది. ఉన్నవ నాయకత్వంలో ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా పోరాటాల్లో పాల్గొన్న కొందరు నికేతనం అమ్మాయిలు జైలుకెళ్లారు. మరికొందరు లాఠీ దెబ్బలూ తిని వీర వనితలుగా చరిత్రకెక్కారు. అప్పట్లో కోనేటి గట్టున స్వాతంత్ర్యోద్యమ శపథం పట్టిన వందమంది యువకులకు వీరతిలకం దిద్ది... ‘వీర గంధం తెచ్చినారము...’ గేయం ఆలపిస్తూ, నికేతనం విద్యార్థినిలు హారతి పట్టిన దృశ్యాన్ని కనుపర్తి వరలక్ష్మమ్మ అక్షరీకరించారు. స్వాతంత్య్ర ఆకాంక్షతో సాగే సభ, ఊరేగింపు, నిరసన... ఏదైనా అందులో శారదా నికేతనం అమ్మాయిలు ముందుండే వాళ్లంటే అతిశయోక్తి లేదు.
గాంధీజీ కితాబు...
1927, ఏప్రిల్ 17న శారదా నికేతనాన్ని సందర్శించిన మహాత్మా గాంధీ ‘ఇటువంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాదు యావద్భారతంలోనే లేదని’ కితాబిచ్చారు. స్వరాజ్య నిధికోసం దేశమంతా తిరిగి జోలె పట్టిన బాపూజీ, నికేతనం అమ్మాయి నూలు వడికే పద్ధతికి మెచ్చి రూ.150 బహూకరించారు. మరికొందరు దీన్ని ‘ఆంధ్రా శాంతినికేతనమ’ని కూడా అభివర్ణించారు.
శతాబ్ది సంస్థ భవిత?
ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందన్న గురజాడ మాటలకు కార్యరూపమే శారదా నిలయం. వందేళ్ల చరిత్రలో ఒక శారద, కొన్ని వేల మంది శారదలను తీర్చిదిద్దింది. ప్రశ్నార్థకమైన జీవితాలకు ఇదొక వేగుచుక్క. మంచం పట్టినా నికేతనం నిర్వహణ బాధ్యతలను మాత్రం లక్ష్మీబాయమ్మ విస్మరించలేదు. తుదిశ్వాస వరకు మహిళాభ్యున్నతి కోసమే పరితపించారు. ఆమె తదనంతరం 1955లో ‘శారదా నికేతనం’ బాధ్యతను దేవాదాయ శాఖకు అప్పగించారు లక్ష్మీనారాయణ పంతులు. తర్వాత కొన్నాళ్ల వరకు ఆ స్ఫూర్తి కొనసాగింది. కానీ ఆస్తులు మాత్రం కరిగిపోయాయి. భూములు మాయమయ్యాయి. దాంతో నిర్వహణ కరువై, తరగతి గదులు వంటి కనీస వసతులు లేక విద్యార్థినులు అష్టకష్టాలనెదుర్కొన్నారు. 400మంది విద్యార్థినిలకు రెండే మూత్రశాలలు... నడపలేక చాలా కోర్సులు తీసేశారు. ఒకనాడు శోభాయమానంగా వెలిగిన సంస్థ దుస్థితి ఇదీ.! అని పదేళ్ళ కిందట ‘ఆంధ్రజ్యోతి’ ఎలుగెత్తింది. ఆ కథనం చాలామందిని కదిలించింది. స్థానిక వ్యాపారులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, త్రిపురనేని సాయిచంద్ వంటి సినీ ప్రముఖులు స్పందించారు. నికేతనంలో కొత్త భవనాలతో పాటు కొన్ని మౌలిక వసతులను సమకూర్చారు. శారదా నికేతన్ త్వరలోనే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా వందేళ్ల చరిత్ర కలిగిన ఈ నికేతనం ఘన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ఆంధ్రజ్యోతి కథనం చదివి...
తెలుగు గడ్డమీద సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి నెలవు అయిన శారదా నికేతనం పరిస్థితిని గురించి ‘ఆంధ్రజ్యోతి’లో చదివి సాయిచంద్, నేనూ అప్పటికప్పుడు నికేతనాన్ని సందర్శించాం. కొన్ని విరాళాలు సేకరించాం. దానికి నేనూ కొంత మొత్తం కలిపి కొన్ని గదులను నిర్మించాం. మరికొందరి సహాయంతో అధ్యాపకులకు మూడేళ్లు జీతాలు చెల్లించాం. వందేళ్ళ సందర్భంగానైనా ఎవరైనా విద్యావేత్తలు ముందుకొచ్చి శారదా నికేతనం నిర్వహణను స్వీకరించాలి. మహోన్నత ఆశయంతో మొదలైన సంస్థను నిలబెట్టాలి.
మహిళా వర్సిటీగా మార్చాలి
జాతీయోద్యమానికి మరో పాయగా మహిళా అభ్యున్నతికి పోరాటాలు సాగాయి. ఆ క్రమంలోనే శారదా నికేతనం ప్రారంభమైంది. నిరుపేద, అనాథ, వితంతువులు మాత్రమే కాదు... చాలామంది రైతు కుటుంబాల అమ్మాయిలు ఇక్కడ చదివారు. అప్పట్లో శారదా నికేతనం పరిస్థితిని కళ్లారా చూసి ‘ఆంధ్రజ్యోతి’లో రాశాను. ఆపై ఇందులోనే వరుస కథనాలు రావడంతో బొమ్మిడాల కృష్ణమూర్తి, గ్రంథి లక్ష్మీకాంతరావు తదితర వ్యాపారస్తులు ముందుకొచ్చి, సంస్థ అభివృద్ధికి కొంత తోడ్పడ్డారు. శతవసంతాల శారదా నికేతనాన్ని ప్రభుత్వం మహిళా వర్సిటీగా తీర్చిదిద్దాలి. ఈ సందర్భంగా త్యాగాల చరిత్రను స్మరించుకునే ప్రయత్నం జరగాలి.
- ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, చరిత్ర అధ్యయనకారుడు
ఆ పుణ్యదంపతులను చూస్తూ పెరిగాను
నేను ఏడో తరగతి వరకు శారదా నికేతనంలోనే చదివాను. ఉన్నవ దంపతులను చూస్తూ పెరిగాను. నికేతనంలోని పిల్లలంతా లక్ష్మీబాయమ్మను అమ్మ అని, లక్ష్మీనారాయణ పంతులును బాబుగారు అని పిలిచేవాళ్ళం. అక్కడ పెరిగిన వాళ్లంటే, బయటి సమాజంలోనూ మంచి పేరుండేది. ఆ పుణ్యదంపతులు మాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పారు. కాస్త పెద్ద వయసు వాళ్లను నికేతనంలోకి తీసుకోవద్దు అని బాబుగారంటే, అసలు వాళ్లకే ఆశ్రయం అవసరమని అమ్మ పట్టుపట్టేది. బాధితురాళ్ళ పట్ల అమ్మకు అంత ఆపేక్ష.
- చింతపల్లి సరస్వతి, శారదా నికేతనం పూర్వవిద్యార్థిని
మా అమ్మనాన్నల ప్రేమగుర్తులు...
మా అమ్మనాన్నల ప్రేమచిహ్నం శాంతి నికేతనం. అందుకే ఆ ప్రాంగణమంటే నాకు చాలా ఇష్టం. మా తాతయ్య కవిరాజు, ఉన్నవ పంతులు మంచి స్నేహితులు. మా నాన్న గోపీచంద్‌కూ ఆయన ఆప్తుడు. మా అమ్మ శకుంతలాదేవి శారదానికేతనంలో చదివారు. అప్పుడే వారొకరికొకరు పరిచయం. వారిద్దరు నడయాడిన నికేతనం ప్రాంగణంలో కలియ తిరుగుతుంటే నాకు అమ్మనాన్నల ఒడిలో ఆడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకే అమ్మ శతజయంతిని నిరుడు అక్కడే నిర్వహించాం.
- త్రిపురనేని సాయిచంద్, సినీ నటుడు