గంజాయి మొక్కతో ఎన్నో విలువైన ఉత్పత్తులు!
ABN , First Publish Date - 2022-08-21T15:15:54+05:30 IST
గంజాయి సాగు చట్టవిరుద్ధం. అమ్మకం నిషేధం. ఇదొక మత్తుమందు. ఇక్కడి వరకే మనకు తెలుసు. ప్రకృతిలోని ప్రతి మొక్క విలువైనదే! అయితే దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నదే ముఖ్యం. గంజాయి మొక్కను మత్తు మందుకు కాకుండా ఇంకా అనేక రకాలు
గంజాయి సాగు చట్టవిరుద్ధం. అమ్మకం నిషేధం. ఇదొక మత్తుమందు. ఇక్కడి వరకే మనకు తెలుసు. ప్రకృతిలోని ప్రతి మొక్క విలువైనదే! అయితే దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నదే ముఖ్యం. గంజాయి మొక్కను మత్తు మందుకు కాకుండా ఇంకా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని నిరూపిస్తున్నది ఓ స్టార్టప్ కంపెనీ..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 14 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల తెలంగాణలో కూడా గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. చట్టబద్ధం కాని ఈ సాగు మీద ఎందుకింత మోజు అంటే.. గంజాయి పంట ఎకరానికి రెండు సీజన్లలో దాదాపు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని కొందరు పేర్కొంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న గిరిజన గ్రామాల్లో వరి, పసుపు, అపరాలు వంటి చిరుధాన్యాల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఒకప్పుడు మన్యం గ్రామాల్లో వందల ఎకరాల్లోనే గంజాయి తోటలు కనిపించేవి. కానీ ఇప్పుడీ సాగు వేల ఎకరాల్లోకి విస్తరించిందని పార్వతీ పురంలోని ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా వేస్తోంది. ఇక్కడ ఎక్కువగా శీలావతి రకం గంజాయి తోటలే ఉన్నాయి.
మత్తు మందే కాదు..
గంజాయి అంటే కేవలం మత్తు మందేనా? ఆ మొక్కల వల్ల వేరే ఉపయోగాలు లేవా? అనే కోణంలో ఉత్తరాఖండ్‌కి చెందిన ‘హిమాలయన్ హెంప్’ సంస్థ అధ్యయనం చేసింది. గంజాయి మొక్కల నుండి నారను తీసి అనేక పర్యావరణ హిత వస్తువులను తయారు చేయవచ్చని చెబుతోందీ సంస్థ. ఆ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను ఇటీవల హైదరాబాద్‌లో పరిచయం చేశారు నిర్వాహకులు. ‘‘గంజాయి అంటే కేవలం మత్తు మందు మాత్రమే కాదు. ఆ మొక్కల నుండీ విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు’’ అంటారు పర్యావరణ ఇంజనీర్ దిలీప్. హిమాలయన్ హెంప్ సంస్థ గంజాయి నుండి, వివిధ రకాల ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు తయారుచేస్తోంది.
రీయూజ్ చేయొచ్చు.. .
పేదరికంతో బాధపడే కుటుంబాల్లో ప్రతి ఖర్చూ అదనపు భారం. యువతులు తరచూ అధిక ధరపెట్టి శానిటరీ ప్యాడ్స్ కొనాలంటే చాలా కష్టం. అందుకే బాలికల కోసం గంజాయి నారతో ప్యాడ్స్ చేస్తున్నారు. ‘‘మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లను సాధారణంగా సింథటిక్, ప్లాస్టిక్‌తో రూపొందిస్తారు. వాటిని ఎక్కువ సేపు ఉంచడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదే గంజాయి నారతో తయారుచేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలాగే మామూలు ప్యాడ్‌లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. ఈ ప్యాడ్‌లు మాత్రం భూమిలో త్వరగా కలిసిపోతాయి. అందులోనూ పర్యావరణ హితం. చాలా చౌక ధరకే ప్యాడ్స్‌ను తయారుచేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఫ్యాక్టరీని నెలకొల్పాం..’’ అని వివరించారు దిలీప్ కంకనాల.
ఆయన హిమాలయన్ హెంప్ బృందంలో సభ్యుడు. రుతుక్రమం సమయంలో స్త్రీలకు సుమారు ఏడు ప్యాడ్‌లు అవసరం అవుతాయి. మార్కెట్‌లో వాటి ధరలు కూడా ఎక్కువే. అయితే, సామాన్య యువతులకు వాటిని కొనే స్థోమత లేక ఇంకా పాత బట్టలను, మోటు పద్ధతులను ఉపయోగిస్తూ పలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. గంజాయి నారతో తయారుచేసిన ఒక ప్యాడ్‌ను 80 సార్లు రీయూజ్ చేయవచ్చు. ఒక ప్యాకెట్ కొంటే ఏడాది వరకు వస్తుంది. గంజాయితో శానిటరీ ప్యాడ్స్‌తో పాటు, నార వస్తువులు, మాస్క్‌లు, టీషర్టులు, దారాలు, వివిధ మోడల్స్‌లో దుస్తులు కూడా తయారు చేస్తున్నారు. అవి త్వరలో దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ఇటుకలు కూడా..
ఉత్తరాఖండ్‌లో గంజాయి మొక్కల నారను ఇటుకలు, గృహ నిర్మాణంలో కూడా వాడుతున్నారు. ఒక రకపు గంజాయి మొక్కలను ఎండబెట్టి, ముక్కలు చేసి, పొట్టుగా చేస్తున్నారు. దానిని మట్టిలో కలిపితే ఇటుకలు తయారవుతున్నాయి. అటవీ సంపదను కాపాడటానికి, సాధారణ కలపకు ప్రత్యామ్నాయంగా గంజాయి కలపతో ఇళ్లు కడుతున్నామని హెంప్ సంస్థ పేర్కొంటోంది. ఇదంతా సేవాదృక్పథంతో చేస్తున్న పని. సాధారణ వ్యక్తులు గంజాయి సాగు చేయడం నేరం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
