Super Star Krishna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో వెనుక అసలు కథ ఏంటంటే..!

ABN , First Publish Date - 2022-11-15T18:43:49+05:30 IST

తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి.

Super Star Krishna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో వెనుక అసలు కథ ఏంటంటే..!

తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి. 1970 తొలినాళ్లలో చెలరేగిన ఆ ప్రజా ఉద్యమానికి బాహాటంగా మద్దతు పలికి, ఉద్యమకారులతో గొంతుకలిపిన సాహసి ఒక్క కృష్ణ మాత్రమే.

ఏమిటా జై ఆంధ్రా ఉద్యమం:

ఎప్పుడో 1918 లో నిజాం తీసుకువచ్చిన ముల్కీ రూల్స్ - రాజ్యంగస్ఫూర్తికి విరుద్ధమని తర్వాత రద్దయ్యాయి. కానీ, 1972 అక్టోబరులో సుప్రీం కోర్టు వీటికి అనుకూలంగా తీర్పునివ్వడంతో, ఆ తీర్పుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే జై ఆంధ్రా ఉద్యమం. ముల్కీ నిబంధనల ప్రకారం, హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వాళ్ళు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా ఉంటూ తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వాళ్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ నిబంధనలు అమలైతే, హైదరాబాద్ లో ఆంధ్రులకు ఉద్యోగాలుండవు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉద్యమం మొదలయ్యింది. ఉవ్వెత్తున కోస్తాంధ్ర, రాయలసీమల్లో లేచిన ఉద్యమం మీద ఇందిరాగాంధీ సీఆర్పీఎఫ్ దళాల్ని మోహరించారు. నవంబర్ 21న ఆందోళనకారుల మీద కాల్పులు జరిగాయి. ఒంగోలులో 9 మంది, ఆదోనిలో ఇద్దరు, తెనాలిలో ఆరుగురు చనిపోయారు. ఆ తర్వాత ఉద్యమంలో సుమారు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, జై ఆంధ్ర ఉద్యమం 1972 డిసెంబర్ 10 న ముల్కీ వ్యతిరేక ఉద్యమం బదులు, ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారింది.

టాలీవుడ్ మొనగాడు:

జై ఆంధ్ర ఉద్యమం హింసాత్మకంగా మారి ఆంధ్రుల బలిదానానికి దారితీయడంతో నిరసనలు అన్ని వైపుల నుంచీ మిన్నంటాయి. మద్రాసులో స్థిరపడిన తెలుగు సినిమా పరిశ్రమలో కూడా చలనం కనిపించింది. ఆ చలనాన్ని చైతన్యంగా, క్రియాశీలంగా మార్చినవాడు ఘట్టమనేని కృష్ణ. తన సమర్పణలో విడుదలైన మంచివాళ్లకి మంచివాడు ఈస్టమన్ కలర్ యాక్షన్ సినిమా కలెక్షన్లని జై ఆంధ్రా ఉద్యమంలో "... అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకి ఉడతాభక్తిగా అందజే"స్తున్నట్లు కృష్ణ ఇచ్చిన పత్రికాప్రకటనతో తెలుగు సినీ పరిశ్రమ తొలిగా ప్రతిస్పందించినట్టయ్యింది:


Krishna-Letter.jpg


“ ఆంధ్ర ప్రజానీకానికి… విజ్ఞప్తి

ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన ఆంధ్ర ప్రజల జీవితాల మీద దెబ్బ తీసింది. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రజా జీవితం స్థభించిపోయింది. ఎన్.జి.వోలు, విద్యార్థులు, విద్యార్థినులు, పిల్లలు, పెద్దలూ, ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లు, మహిళలు ప్రత్యేక “ఆంధ్ర రాష్ట్రం కోసం” ఆందోళన ప్రారంభించినారు. ప్రజలలో నేనూ ఒక భాగమే. గనుక,యీ ప్రజావుద్యమంలో నాకూ భాగంవుంది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైన ఈ వుద్యమం భారత చరిత్రలోనే అపూర్వం! ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్క తాటి మీద నిలచి ఒకే మాటమీద నిలబడ్డారు. ఇది ప్రజావెల్లువ. ఈ వెల్లువను ఆపేశక్తి యెవ్వరికీ లేదు. ఆ వుద్యమంలో అనేక మంది స్వార్థరహితంగా ప్రాణత్యాగాలు చేసారు. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలుపుకుంటున్నాను. ఈ అపూర్వ వుద్యమం విజయవంతమై తీరుతుంది. జై ఆంధ్ర

ఎప్పటికీ మీ

కృష్ణ”

- అని కృష్ణ ఇచ్చిన ప్రకటన అప్పట్లో ఒక పెనుసంచలనం.

ఆ ప్రకటన తర్వాత, కృష్ణంరాజు, ఎస్వీ రంగారావు, వాణీశ్రీ, జమున, అంజలీదేవి, ఛాయాదేవి వంటి నటీనటులు కూడా జై ఆంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా పత్రికాప్రకటనలు ఇచ్చారు. కాగితాలకు పరిమితం కాకుండా, తన సినిమా వసూళ్లు అమరుల కుటుంబాలకి అందించి ఉద్యమంలో ప్రత్యక్షంగా కృష్ణ భాగమయ్యారు. మరో అడుగు ముందుకు వేసి, 24 గంటల నిరాహారదీక్ష చేశారాయన. మద్రాసు త్యాగరాయ నగర్ పానగల్ పార్కులో నిరశన శిబిరాన్ని ప్రారంభించి, సహచరి విజయనిర్మలతో కలిసి ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. అలా ఆ ఊరికి మొనగాడు, టాలీవుడ్ కే మొనగాడుగా ఆనాడే నిలిచాడు.

Updated Date - 2022-11-15T19:36:26+05:30 IST