ఈ ఉబర్ ఆటో డ్రైవర్.. డ్రైవింగ్ సమయంలో చేసిన పనికి నెవ్వెరపోతున్న సోషల్ మీడియా..!

ABN , First Publish Date - 2022-10-14T17:27:56+05:30 IST

ఓ ఆటో డ్రైవర్ తన కూతురు కోసం చేస్తున్న పని ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఉబర్ ఆటో డ్రైవర్.. డ్రైవింగ్ సమయంలో చేసిన పనికి నెవ్వెరపోతున్న సోషల్ మీడియా..!


తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతగానో తపన చెందుతారు. పిల్లలు భవిష్యత్తులో ఉన్నతంగా ఉండాలని సర్వశక్తులూ ధారబోసి వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే కోవలో ఓ ఆటో డ్రైవర్ తన కూతురు కోసం చేస్తున్న పని ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆటో డ్రైవర్ ఎవరు? అతను చేసిన పని ఏంటి? అనే వివరాలలోకి వెళితే....


లింక్డ్ ఇన్‌ ద్వారా అభిజీత్ అనే వ్యక్తి (బ్యాంకింగ్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తాడు) ఈ ఆటో డ్రైవర్ కథను మనతో పంచుకున్నారు. అభిజీత్ తన ప్రయాణం కోసం ఉబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. ఆటో వచ్చి ఆగిన తురువాత ఆటో డ్రైవర్ రాకేష్ తన మొబైల్‌లో ప్లే అవుతున్న వీడియోను పాజ్ చేసి అభిజీత్‌ను ఎక్కించుకున్నాడు. ఆ తరువాత వెళ్లాల్సిన రూట్ చూసుకుని తిరిగి తన మొబైల్‌లో వీడియో ప్లే చేసి చూడటం మొదలుపెట్టాడు. 


అదంతా గమనించిన అభిజీత్ అతడు ఎకనామిక్స్‌కు సంబంధించిన క్లాస్ వింటున్నాడని అర్థం చేసుకున్నాడు. దాంతో ఒక ఆటో డ్రైవర్ అంత సిన్సియర్‌గా క్లాస్ ఎందుకు వింటున్నాడో అనే కుతూహలం అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ఇక ఆగలేక అభిజీత్  'ఎందుకు క్లాస్ వింటున్నావు' అని తన బుర్రలో తిరగుతున్న ప్రశ్నను ఆటో డ్రైవర్ ముందుంచాడు.


 అతను ఏం సమాధానం చెబుతాడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశాడు అభిజీత్. 


'నా కూతురు యూపీఎస్‌సీ పరీక్షకు సిద్దమవుతోంది ఆమెకు సహాయంగా ఉండటానికి నేను క్లాస్ వింటున్నాను' అని చెప్పాడు. 'నా కూతురు లైబ్రరీ నుండి రాగానే మేమిద్దరం జనరల్ నాలెడ్జ్ టాపిక్ డిస్కస్ చేస్తాం, నేను వినే క్లాస్‌కు సంబంధించిన విషయాలు ఆమె వివరించి చెబుతాను' అని ఆటో డ్రైవర్ రాకేష్ సమాధానం ఇచ్చాడు.  


అది విన్న అభిజీత్.. ఆటో డ్రైవర్ తన కూతురు కోసం పడుతున్న కష్టాన్ని లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. 


కూతురు కోసం తండ్రి చేస్తున్న పని చాలా గొప్పదని అభిజీత్ పోస్ట్ చూసినవారు కొందరు రాకేష్‌ను మెచ్చుకోగా, మరికొందరు మాత్రం అతను డ్రైవింగ్ సమయంలో వీడియో చూడటంపై విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి  అయితే 'ఆటో డ్రైవర్ చేస్తున్న పనికి నవ్వాలో ఏడవాలో తెలియం లేదు,  ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది యూట్యూబ్ వీడీయో చూసుకుంటూ డ్రైవ్ చేయడం ప్రయాణంలో ఎంతవరకు సమంజసమైంది?' అని ప్రశ్నించాడు. ఇది జరిగింది ఏ ప్రాంతంలో తెలియదు కాని తండ్రిగా అతని తపన అందరికీ అర్థమవుతోంది. కానీ, డ్రైవింగ్ సమయంలో ఇలా చేయడం అనేది ఆహ్వానించ దగిన విషయం కాదు. ఇకపోతే అతని కష్టానికి తగ్గ ఫలితం లభించాలని, ఆటోవాలా కూతురు యూపీఎస్‌సీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, ఉన్నతమైన ఉద్యోగం పొందాలని ఆశిద్దాం.

Updated Date - 2022-10-14T17:27:56+05:30 IST