అతడి రాజీనామా విలువ.. రూ.315 కోట్లు.. Parag Agrawal ను Elon Musk తొలగిస్తే..
ABN , First Publish Date - 2022-04-26T22:22:23+05:30 IST
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన పంతం నెగ్గించుకున్నారు. ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నారు.

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన పంతం నెగ్గించుకున్నారు. ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నారు. సుమారు 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.30 లక్షల కోట్లు) వెచ్చించి ట్విటర్ సంస్థను ఆయన కొనుగోలు చేశారు. టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ సీఈవో కూడా అయిన మస్క్ ట్విటర్లో 100 శాతం వాటాను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటివరకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్ ఇకపై ప్రైవేట్ కంపెనీగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ట్విటర్ సీఈవో, భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడం పట్ల పరాగ్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. డీల్ పూర్తయ్యాక సోమవారం ఉదయం కూడా మాట్లాడుతూ.. ట్విటర్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. దాని భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. మస్క్‌కు ప్రత్యర్థిగా పరాగ్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆయన ట్విటర్‌కు సీఈవోగా కొనసాగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన పరాగ్ గతేడాది నవంబర్‌లో ట్విటర్‌కు సీఈవోగా నియమితులయ్యారు. ఒకవేళ పరాగ్‌ను 12 నెలల్లోగా తొలగిస్తే అతనికి 42 మిలియన్ డాలర్లు (సుమారు 315 కోట్ల రూపాయలు) సంస్థ చెల్లించాల్సి ఉంటుంది.