ఈ దొంగ మామూలోడు కాదు.. వీడియోను కన్నార్పకుండా చూస్తే తప్ప గుర్తించడం కష్టం!
ABN , First Publish Date - 2022-06-10T22:06:35+05:30 IST
ఓ రైల్వే బ్రిడ్జిపై నక్కిన ఓ దొంగ రైలు ఫుట్‌బోర్డు వద్ద కూర్చున్న వ్యక్తి చేతుల్లోంచి మొబైల్‌ను అవలీలగా కొట్టేశాడు

పాట్నా: ఓ రైల్వే బ్రిడ్జిపై నక్కిన ఓ దొంగ రైలు ఫుట్‌బోర్డు వద్ద కూర్చున్న వ్యక్తి చేతుల్లోంచి మొబైల్‌ను అవలీలగా కొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చాలా సేవటి వరకు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. వీడియో చూసిన వారికి కూడా ఏం జరిగిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వీడియోను రెండుమూడు సార్లు చూస్తున్నారు.
బీహార్‌లో జరిగిందీ ఘటన. ఆ వీడియో ప్రకారం.. రైలు గంగానదిని దాటుతోంది. ఇద్దరు ప్రయాణికులు ఫుట్‌బోర్డు వద్ద కూర్చున్నారు. వారిలో ఓ యవకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో గంగానదిని బంధిస్తున్నాడు. అతడు ఆ పనిలో ఉండగానే క్షణాల్లోనే అతడి చేతిలోని ఫోన్ మయామైంది. తేరుకునే సరికే రైలు చాలా దూరం వచ్చేసింది. రైలు బ్రిడ్జిపై నక్కి కూర్చున్న ఓ దొంగ రైలు రాగానే ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణికుడి చేతిలోని ఫోన్‌ను కొట్టేశాడు. రైలులో ఫుట్‌బోర్డు వద్ద నిల్చుని గంగానదిని వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్లో ఈ ఘటన రికార్డైంది. వీడియోను కన్నార్పకుండా చూస్తే తప్ప ఈ దొంగతనాన్ని గుర్తించడం కష్టం. అంతా క్షణకాలంలోనే జరిగిపోయింది. వీడియోను స్లో మోషన్లో చూస్తే తప్ప ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టం. ఫోన్ పోగొట్టుకున్న యువకుడు తన మొబైల్ పోయిందంటూ మరో వ్యక్తికి బిక్కమొఖం వేసుకుని చెబుతుండడం కూడా ఆ వీడియోలో రికార్డైంది.
పాట్నా-కతిహార్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో బెగుసరై వద్ద ఈ వారం మొదట్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పాట్నా-బెగుసరైని కలిపే రాజేంద్ర సేతు మీదుగా రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. ఇక్కడ ఇలాంటి ఘటనలు సర్వసాధారణమేనని కూడా చెబుతున్నారు.
ఈ మార్గంలో ఇలాంటి దొంగతనాలు జరగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, గతంలో ఆ ప్రాంతంలో కొంతమంది దొంగలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై మాటేసిన దొంగలను పట్టుకునేందుకు గతంలో పోలీసులు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారు. తమను చూడగానే దొంగలు కిందనున్న గంగానదిలోకి దూకి ఈదుకుంటూ పారిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు.