చాణక్య నీతి: ఎంతటి నమ్మకస్తుడికైనా ఈ విషయాలను అస్సలు చెప్పకూడదు!

ABN , First Publish Date - 2022-01-19T11:49:00+05:30 IST

మనసులోని మాట ఎవరితోనైనా పంచుకుంటే..

చాణక్య నీతి: ఎంతటి నమ్మకస్తుడికైనా ఈ విషయాలను అస్సలు చెప్పకూడదు!

మనసులోని మాట ఎవరితోనైనా పంచుకుంటే మనసు చాలా తేలికగా పడుతుందంటారు. అయితే కొన్ని విషయాలు మీ వరకు పరిమితమైతేనే మంచిదని కూడా అంటారు. ఆచార్య చాణక్య అటువంటి విషయాలు గురించి తన చాణక్య నీతిలో తెలిపారు. ఎంతో నమ్మకస్తుడైన స్నేహితునితో కూడా పంచుకోకూడని విషయాలేమిటో ఆచార్య చాణక్య తెలియజేశారు. అనుకోని కారణాలతో మీరు ఆర్థికంగా నష్టపోయినప్పుడు.. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కుదుటపడేవరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. ఎంతటి నిజమైన స్నేహితుడైనప్పటికీ ఈ విషయాన్ని చెప్పకూడదు. అటువంటి విషయాలను గోప్యంగా ఉంచితేనే మీ గౌరవం నిలబడుతుంది. బయటి వ్యక్తులు మీ పరిస్థితి గురించి తెలుసుకున్నప్పటికీ మీకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చని.. పైగా హేళనగా మాట్లాడే అవకాశం ఉందని ఆచార్య చాణక్య తెలిపారు.


మరోవైపు.. చాలా మంది తమ బాధలను ఎవరెవరితోనో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే బాధలను ఎవరికీ చెప్పకూడదని ఆచార్య తెలిపారు. మన బంధువులకు మన కష్టాలు చెప్పుకుంటే ఓదార్పు దొరకకపోగా.. రేపు వారు మనకన్నా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపారు. భార్యాభర్తలలో ఏవైనా లోటుపాట్లు ఉంటే ఎవరికీ చెప్పకూడదని, అవి వారివరకే పరిమితమైతే మంచిదని, అదే తెలివైనపని అని ఆచార్య చాణక్య తెలిపారు. ఇలా చెప్పడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ఆచార్య చాణక్య హెచ్చరించారు. అదేవిధంగా మీరు ఎక్కడైనా అవమానానికి గురైతే, ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోండి. దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు. అటువంటి విషయాలు బయటికి వెళితే మీ గౌరవం దెబ్బతింటుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-01-19T11:49:00+05:30 IST