5 Spectacular Stories: మహాబలిపురంలో ప్రాణం పోసుకున్న 5 అద్భుత నిర్మాణాలు ఇవే..
ABN , First Publish Date - 2022-10-31T12:40:36+05:30 IST
7వ శతాబ్దానికి చెందిన ఈ పట్టణాన్ని పాలించిన నరసింహావర్మ అత్యంత నైపుణ్యం కలిగిన మల్లయోధులలో ఒకడని చరిత్ర చెబుతుంది.
మహాబలిపురం చెన్నైకి దక్షిణాన 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎంతో అద్భుత చరిత్రను తనలో దాచుకున్న మహాపట్టణం. ఇది పల్లవుల కాలంలో నిర్మించబడింది. ఈ పట్టణానికి మామల్లపురం అనే పేరు కూడా ఉంది. 7వ శతాబ్దానికి చెందిన ఈ పట్టణాన్ని పాలించిన నరసింహావర్మ అత్యంత నైపుణ్యం కలిగిన మల్లయోధులలో ఒకడని చరిత్ర చెబుతుంది. తమిళంలో గొప్ప మల్లయోధులని మామల్లన్ అని పిలుస్తారు. ఇక ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు తరవాతి కాలంలో వచ్చింది. ఒకప్పుడు ఈ పల్లవ రాజ్యం ప్రధాన ఓడరేవుగా ఉండేది.

1. తీర దేవాలయం..
మహాబలిపురం పర్యటన బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ఆలయం నుంచే ప్రారంభం అవుతుంది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో రాజసింహ పల్లవ క్రీ.శ. 670-715 మధ్య కాలంలో నిర్మించబడినది. ఇది పురాతన దక్షిణ భారత దేవాలయాలలో ఒకటి. ఇవి ఏడు దేవాలయాలని అందులో ఆరు నీటి అడుగు భాగంలో మునిగిపోయానని అక్కడి వారు నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న నందులను తప్పక చూసి తీరాలి. ఈ సముద్ర తీర ఆలయం నుంచి పక్కనే ఉన్న మత్స్యకార గ్రామాన్ని కూడా చూడవచ్చు.

2. పంచ రథాలు..
ఈ పంచ రథాలు శిల్పకళలోనే ప్రత్యేకమైన నిర్మాణం. ప్రతి ఒక్కటీ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కళాకారుల చేతిలో వివిధ నిర్మాణ శైలితో ప్రేరణ పొందిన ప్రత్యేక ప్రయోగంలా కనిపిస్తుంది. ఇటువంటి రథాలు ఎక్కువగా దేవాలయాలలో కనిపిస్తాయి. ఐదుగురు పాండవులు ద్రౌపదికి అంకితం ఇచ్చారని చెపుతారు. అయితే అటువంటి కథగానీ, ఇతిహాసం కానీ మన పురాణాలలో లేదు. ఇక ఇక్కడి బయటిగోడలపై కనిపించే శిల్పాలను ఒకే రాతితో చెక్కారు.
ఎడమవైపున ఉన్న పెద్ద రథం ద్రౌపది రథం. ఇది అన్ని రథాలకంటే చిన్నది. మట్టి కుటీరంలా ఉంటుంది. ఈ ఆలయానికి ఎదురుగా భారీ ఏకశిల సింహం ఉంది. దీని పక్కనే భీమ రథం చాలా పెద్దగా ఉంటుంది. ధర్మరాజ రథం దక్షిణ ద్వారం వైపు ఉంటుంది. నకుల, సహదేవ రథాలు ఇక్కడకు పక్కనే ఉంటాయి. ఈ రథాల దగ్గరకు వచ్చాకా ఏనుగు వెనుక భాగాన్ని చూస్తారు. దీన్ని గజపృష్ఠకర అని పిలుస్తారు. బహుశా రాజు నరసింహవర్మన మరణించడం వల్ల కావచ్చు ఈ పంచ రథాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

3. కృష్ణ మండపం..
ఈ కృష్ణ మండపం గుహలో ఉంటుంది. మండపం లోపల గోవర్ధనం, గ్రామీణ జీవితాన్ని తెలిపే దృశ్యాలను శిల్పాలు ఉన్నాయి. కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తిన దృశ్యాన్ని అతిపెద్ద శిల్పంగా చెక్కారు.

4. అర్జునుడి తపస్సు..
పౌరాణిక సంఘటనలను వర్ణించే అపారమైన రాతి నిర్మాణం ఇది. ఇక్కడ అర్జునుడి తపస్సును చేసినట్టుగా చెప్పే కట్టడం. ఇది మామల్లపురంలోని పురాతన రాతి నిర్మాణాలు 27m X9m పరిమాణంలో కనిపిస్తుంది. దీని నిండా 100 కంటే ఎక్కువ దేవుళ్ళు, పక్షులు, జంతువులు, సాధువుల శిల్పాలు కనిపిస్తాయి. మహాభారతంలో శివునికి చెందిన దివ్యమైన ధనుస్సును పొందేందుకు అర్జునుడు కఠోరమైన తపస్సు చేసినప్పటి దృశ్యాన్ని తెలిపే ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

5. కృష్ణుని వెన్నబంతి..
20 అడుగుల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉన్న 250 టన్నుల భారీ బండరాయి ఇది. నాలుగు అడుగుల బేస్ కంటే తక్కువ కొండవై జారే వాలుపై నిలబడి ఉంటుంది. ఇది 1200 సంవత్సరాలకు పైగా సునామీలు, భూకంపాలు, తుఫానులచే కదలకుండా ఉంది. ఈ బంతిని దాని స్థానం నుంచి కదిలించడానికి ప్రయత్నించారు కానీ అది ఒక్క అంగుళం కూడా కదలలేదు. దీనిని కృష్ణుడికి వెన్నపై ఉన్న ప్రేమకు ప్రతీకగా అక్కడి వారు నమ్ముతారు.
ఇక్కడ ఎన్నో స్మారక కట్టడాలు అసంపూర్తిగా ఉన్నా అవి శిల్పకళపై అప్పట్లో ఉన్న అభిరుచిని తెలుపుతాయి.