Inside The Still-Unsolved Murders : 13 ఏళ్ళ ఆరుషి తల్వార్ హత్య వెనుక..అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2022-09-30T17:57:58+05:30 IST

ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆరుషి.. రాజేష్, నుపుర్ తల్వార్ లకు ఒకే ఒక్క సంతానం. ఆరుషి తల్లిదండ్రులతో ఢిల్లీ నోయిడాలో ఉంటూ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటోంది.

Inside The Still-Unsolved Murders : 13 ఏళ్ళ ఆరుషి తల్వార్ హత్య వెనుక..అసలేం జరిగింది?

13 ఏళ్ళ బాలిక ఆరుషి తల్వార్, 45 ఏళ్ళ హేమరాజ్ బంజాడే జంట హత్యలు ఇప్పటికీ మిస్టరీ మర్డర్స్ గానే మిగిలిపోయాయి. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆరుషి.. రాజేష్, నుపుర్ తల్వార్ లకు ఒకే ఒక్క సంతానం. ఆరుషి తల్లిదండ్రులతో ఢిల్లీ నోయిడాలో ఉంటూ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటోంది. 2008 మే 16న తన బెడ్ రూంలో ఈ 13 ఏళ్ళ పసిది పరువు, ప్రతిష్టల మధ్య కన్నతల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఇండియాలో జరిగిన అత్యంత సంచలనాత్మకమైన unsolved cases లో ఇది ఒకటి. 


ఆరుషి, హేమరాజ్ 2008 నోయిడా జంట హత్యల కేసు.. 

ఆరుషి గొంతుకోయబడి చనిపోయి ఉండడాన్ని బట్టి ఇది హత్యేనని పోలీసులు తేల్చారు. అయితే చంపింది ఎవరు? "మేం ఇంట్లోనే ఉన్నాం. ఇల్లంతా క్లోజ్డ్ డోర్స్, ఎయిర్ కండీషనింగ్ యూనిట్ వల్ల హత్య జరిగిన సమయంలో మాకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదని" ఆరుషి తల్లిదండ్రులు పోలీసులతో చెప్పుకొచ్చారు. 


పనిమనిషి భారతి మాటల ప్రకారం...

"ప్రతిరోజూ ఉదయం నేను తలుపు కొట్టగానే పనివాడు హేమ్ రాజ్ తలుపు తీస్తాడు. అలాంటిది ఆరోజు అతను తీయకపోయేసరికి ఇంటి వెనక వైపు నుంచి తలుపు తట్టాను. అప్పటికే నుపూర్ వెనక గుమ్మం నుంచి తలుపు తీయాలని చూస్తుంది.. తన దగ్గర ఉన్న తాళాలను బయటికి విసిరి పనివాడు హేమరాజ్ కనిపించడం లేదని.. ఎక్కడికో బయటికి వెళుతూ లాక్ చేసి ఉంటాడని..నన్ను చూసి తలుపు తీయమని అడిగింది. నేను తలుపు తీసుకుని లోపలికి వెళ్ళే సరికి రాజేష్ (సార్) మెలకువగానే ఉన్నాడు. ఆరుషి గదిలో ఆమె చనిపోయి ఉండటాన్ని మొదట చూసింది నుపూర్, రాజేష్ లేనని ఆ విషయాన్ని కూడా వాళ్ళే తనకు చెప్పారని... నేను వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి, తర్వాత పొరుగువాళ్ళను పిలవడానికి బయటికి పరుగుపెట్టానని" పోలీసులతో చెప్పింది భారతి.


మరి హత్య చేసింది ఎవరు?

రాజేష్, నూపుర్ తల్వార్ ల ఇంట్లో చాలాకాలంగా పనివాడిగా ఉన్న 45 ఏళ్ళ హేమ్ రాజ్ ఆరుషి హత్య జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసుల అనుమానం మొదట అతని మీదకు పోయింది. కాకపోతే అనూహ్యంగా హేమ్ రాజ్ మృతదేహం ఆరుషి ఇంటి టెర్రస్ పై కుళ్లిపోయిన దశలో కనిపించింది. దీనితో ఆరుషిని హత్య చేసిన హంతకుడు ఎవరనేది సంచలనంగా మారింది.


ఈ రెండు హత్యలు చేసింది ఎవరు?

మళ్లీ పెద్ద డైలమాలో పడేసింది ఈ కేసు.. పోలీసులకు రెండు హత్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారిపోయింది. హత్య జరిగిన కొద్ది సేపటికే మీడియా, చుట్టుపక్కల వారు ఆరుషి ఇంటిలోకి వచ్చేయడంతో కొన్ని ముఖ్యమైన ఆధారాలు తారుమారు అయ్యాయని పోలీసులు చెప్పుకొచ్చారు. కేసులోని కీలక సాక్ష్యాలు తారుమారు కావడం, హంతకుడిని పట్టుకోలేకపోవడంతో ఆరుషి కేసు గురించి అటు సోషల్ మీడియా, ఇటు పత్రికలు ఏక బిగిన కథనాలు రాశాయి.. గగ్గోలు చేశాయి. అసలు ఆరుషికి ఏం జరిగింది?  అదే ఇంట్లో పక్క రూం లో ఉన్న తల్లిదండ్రులకు హత్య జరిగిన విషయం ఎందుకు తెలీయలేదు? ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తాయి సోషల్ మీడియా, పత్రికలు. దీంతో కేసును సిబిఐకి అప్పగించారు. 


సిబిఐ విచారణలో తేలిన విషయాలేంటంటే..

కేసులో రోజురోజుకూ కొత్త మలుపులతో సిబిఐ మొదటగా ఇది బైటివారి పని కాదని, ఇంట్లో వారే చేసారనే నిర్థారణకు వచ్చారు. ఎందుకంటే ఇంట్లోకి బలవంతంగా బయటివారు వచ్చిన ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఈ కొత్త మలుపులతో బయటివారిని కూడా  అనుమానితుల జాబితాలోకి చేర్చింది సిబిఐ. కాకపోతే జాబితాలోకి తీసుకున్న వారెవరూ ఆ ఇంటికి అంత సన్నిహితంగా మెలిగే అవకాశం లేనందున మళ్ళీ తిరిగి సిబిఐ అనుమానం ఆరుషి తల్లిదండ్రుల మీదకే మళ్ళీంది. 


సిబిఐ నివేదిక ప్రకారం.. 

కేసులో అనుమానితులుగా ఉన్న వారిని విచారించిన తరువాత సేకరించిన ఆధారాలతో ఆరుషి హత్యలో అనుమానం ఆమె తల్లిదండ్రుల మీదకే మళ్ళింది. దీనికి మరో కారణం క్రైం సీన్ లో ముఖ్యమైన ఆధారాలను చాలా వరకూ పాడు చేయడంలో ఆరుషి తల్లిదండ్రుల పాత్ర ఉందనేది సిబిఐ అనుమానం బలపడేలా చేసింది. 


ఆరోజు ఏం జరిగిందంటే.. 

దంతవైద్యులుగా ఉన్న తల్వార్ దంపతులు రాత్రి 9:30 గంటలకు హాస్పటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. కుమార్తెతో కలిసి రాత్రి భోజనం చేసారు. పుట్టినరోజు కానుకగా డిజిటల్ కెమెరాను ఆరుషికి కానుకగా ఇచ్చి దానితో కొన్ని ఫోటోలు కూడా దిగారు. చివరిగా తమ కుమార్తెను రాత్రి 11 గంటల సమయంలో పుస్తకం చదువుతుండగా చూసామని కూడా చెప్పుకొచ్చారు. ఆరుషి చివరి ఫోటో రాత్రి 10 గంటలకు తీసినట్టుగా ఉంది. సాధారణంగా రాత్రి ఆరుషి బెడ్ రూం కి తలుపు లాక్ చేసి ఉంటుందని.. అలాంటిది ఆరోజు రాత్రి రూమ్ లాక్ చేసుకున్నదీ లేనిది తను గమనించలేదని తల్లి నుపూర్ పోలీసులతో చెప్పింది. 


ఖచ్చితంగా తాళాలు మరో సెట్ ఉన్నాయి? అది ఎవరి దగ్గర?

ఆరుషి, పని మనిషి హేమ్ రాజ్ ఇద్దరూ అర్థరాత్రి 1గంట సమయంలో  హత్యకు గురైనట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆరుషి తండ్రి రాత్రి 11:57 వరకూ లాప్ టాప్ లో పనిచేసినట్టు ఆఖరి మెయిల్ అదే సమయానికి పంపినట్టుగా తెలుస్తుంది. ఇక ఆరుషి ఇంటర్నెట్ రూటర్ తెల్లరువాజామున 3:43 వరకూ ఆన్ చేసే ఉంది. అంటే రూటర్ ను ఆపడానికి వెళ్ళిన వ్యక్తి ఆమె బెడ్ రూమ్ దాటి రక్తంతో తడిచిన మంచం చూట్టూ తిరిగి వెళ్ళాలి. అక్కడే పడి ఉన్న శవాన్ని గమనించకుండా వెళ్ళడం అసాధ్యం. ఇది సిబిఐ పోలీసులకు కలిగిన మరో అనుమానం.


కేసు తల్వార్ దంపతుల వైపు మళ్ళింది..

తల్వార్ దంపతులను 2011లో సిబిఐ ప్రాథమిక అనుమానితులుగా పేర్కొంది. తన నివేదికను ఛార్జ్ షీట్ గా మార్చింది. దీనిపై నుపుర్, రాజేష్ దంపతులు అలహాబాద్ హైకోర్ట్ లో, సుప్రీంకోర్ట్ లోనూ పిటిషన్ వేశారు. కానీ అది విఫల ప్రయత్నమే అయింది. పిటీషన్ రద్దు చేయబడింది.


జరిగింది ఇదే.. 

హత్య జరిగిన రాత్రి రాజేష్ తల్వార్ ఇంట్లో ఏవో శబ్దాలను విని పని మనిషి హేమ్ రాజ్ గదివైపు వచ్చాడు. అప్పటికే అతను ఆరుషి గదిలో ఆమెతో శృంగారంలో ఉండటాన్ని గమనించి హాల్లోని గోల్ఫ్ స్టిక్ తో ఆరుషి గదిలోకి వెళ్ళాడు. హేమరాజ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో మంచం మీద నుంచి నేల మీదకు పడిపోయాడు హేమరాజ్.. వెంటనే బాకుతో ఆరుషిపై దాడి చేసాడు రాజేష్. ఈ శబ్దాలకు నుపుర్ తల్వార్ నిద్రలేచి హాల్లోంచి ఆరుషి గదిలోకి పరుగుపెట్టింది. అక్కడ చావుబతుకుల్లో ఉన్న హేమరాజ్, ఆరుషిలు కనిపించారు. అప్పటికే ఆరుషి నాడి ఆగిపోయింది. 


ఇక ఇద్దరు దంపతులు ఆరుషిది హత్యగా చిత్రీకరించాలని సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో పడ్డారు. ఆరుషిని హేమ్ రాజ్ చంపినట్టుగా సీన్ మార్చాలని అనుమానం అతని మీదకే పోవాలని రాజేష్, నుపూర్ లు ఆరుషి యోనిని కూడా శుభ్రం చేసారు. దుస్తులు మార్చి గోడలమీద, నేల మీద ఉన్న రక్తం మరకలను క్లీన్ చేసారు. ఆధారాలన్నీ నాశనం చేసి ఇంటి బయటి నుంచి తాళం వేసి ఏం తెలీనట్టు హేమ్ రాజ్ గది నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. 


తుది తీర్పు.. 

సిబిఐ సమర్పించిన ఆధారాలతో 2013లో తల్వార్ దంపతులుకు జీవిత ఖైదు విధించింది కోర్ట్. ఈ సంఘటనలో ప్రత్యక్ష సాక్ష్యం లేనందున..వారిని అనుమానితులుగా పరిగణించలేమని నాలుగు సంవత్సరాల తర్వాత 2017లో నుపూర్, రాజేష్ లను నిర్దోషులుగా విడుదల చేసింది.

Read more