ROBO: ఇలాంటి రోబో ఒక్కటున్నా చాలు!
ABN , First Publish Date - 2022-11-09T14:41:06+05:30 IST
రైతుకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఫామ్ సాథీ’ అనే అంకుర సంస్థ రోబోను తయారుచేసింది. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో కూలీ ప్రత్యేకతలు ఏమిటంటే...
వ్యవసాయంలో రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. పంట ఏదైనా కలుపును తొలగించడానికి కూలీలకు అయ్యే ఖర్చు రైతుకు చాలా భారమవుతుంది. ఆ ఇబ్బందిని దూరం చేసి రైతుకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఫామ్ సాథీ’ అనే అంకుర సంస్థ రోబోను తయారుచేసింది. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో కూలీ ప్రత్యేకతలు ఏమిటంటే...
ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఇరవై మంది కూలీలు కావాలి. పిచికారీ చేయడానికి మందుతో కలిపి ఖర్చు ఏడాదికి దాదాపు రూ. 25 వేల వరకు అవుతుంది. రైతులకు ఈ ఆర్ధిక భారం లేకుండా చేయడానికి ఓ రోబోను రూపొందించింది ‘ఫామ్ సాథీ’ అనే అంకుర సంస్థ. ఇటీవల హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఈ రోబోను బత్తాయి, బొప్పాయి తోటల్లో ఉపయోగించి చూశారు. మొక్కల సాళ్ల మధ్య రోబోను వదిలితే పంటను వదిలేసి, కలుపు మొక్కలన్నింటినీ విజయవంతంగా నిర్మూలించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రోబోను రిమోట్ కంట్రోల్‌తో సులువుగా ఆపరేట్ చేసే వీలుంది.
వారి కలకు ప్రతిరూపం...
రైతులకు శ్రమను తగ్గించాలి. వ్యవసాయాన్ని సులభతరం చేయాలి. ఇందుకోసం కొత్తకొత్త పరికరాలకు రూపకల్పన చేయాలి. ఈ ఉద్దేశంతో కొందరు యువకులు ‘ఫామ్ సాథీ’ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ‘‘రైతాంగం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కలుపు. అందుకే పొలంలో కలుపును సులభంగా నిర్మూలించడానికి ఒక రోబోను తయారుచేశాం. పవర్ ఛార్జర్, బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఈ రోబో వల్ల రైతులకు ఆర్థికభారం చాలా తగ్గుతుంది’’ అని ‘ఫామ్ సాథీ’ అంకుర సంస్ధ సీఈఓ సుశాంత్ చెబుతున్నారు.
‘వయ్యారి భామ’ను సైతం...
ఈ రోబో పంట చేలలో మొలిచే తుంగ, గరికతోపాటు ఎలాంటి కలుపునైనా పీకి పారేస్తుంది. పాడి పశువులకు, పంటలకు హానికరమైన కలుపు మొక్క ‘వయ్యారి భామ’ అని తెలిసిందే. పొలంలో ఇది మొలిచిందంటే దిగుబడి బాగా తగ్గిపోతుంది. దీనిని సైతం ఈ రోబో వదలకుండా సమర్ధవంతంగా నిర్మూలి స్తుంది. పొలంలోని ఒక్కో మొక్కను పరిశీలించి మిల్లీమీటర్ సైజులో ఉన్న కలుపు మొక్కలను సైతం గుర్తించగలగడం ఈ రోబో ప్రత్యేకత.
ఇరవై మంది కూలీలు చేసే పని...
ఈ రోబోతో పొలం పనులు చాలా వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఇరవై మంది కూలీలు చేసే పనిని ఇదొక్కటే చేస్తుంది. రానున్న రోజుల్లో వ్యవసాయం పూర్తిగా డిజిటల్ అయిపోయే అవకాశం ఉందని అగ్రి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌తో కమాండ్స్ ఇచ్చి రోబో సాయంతో పంటలను పర్యవేక్షించే రోజులు వస్తాయని వాళ్లు అంటున్నారు. ఈ కలుపు తీసే రోబో తెలుగు రాష్ట్రాల్లో తొలి ఆవిష్కరణ. రెండు నెలల్లోనే రైతులందరికీ ఇది అందుబాటులోకి వస్తుందని ‘ఫామ్ సాథీ’ప్రతినిధులంటున్నారు.
రైతులు ఈ రోబోను సొంతంగా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా ‘ఫామ్ సాథీ’ ప్రతినిధులే పొలానికి వచ్చి కలుపు తీస్తారు. అలా ఏడాదంతా సేవలు అందించడానికి రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ రోబో వల్ల హానికారక రసాయన మందుల వాడకం తగ్గిపోతుంది. పొలంలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ నేల సారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ యువ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రైతుల ఆదాయ వనరులు పెంచేందుకు దోహదపడనుంది. ఈ రోబోను అతి త్వరలో రైతులకు అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు.
ఆర్థిక సహాయం...
రోబో రూపకల్పనలో పరిశోధనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ సంస్ధ ‘ఎ.. ఐడియా!’ వేదిక ద్వారా అందిస్తోంది. సృజన, సాంకేతికతల కలబోతతో స్ధానిక వనరులను ఉపయోగించి, చౌకైన, మెరుగైన ఆవిష్కరణలతో వ్యవసాయాభివృద్ధికి బాటలు వేసే గ్రామీణ శాస్త్రవేత్తలకు చేయూతనిచ్చే వేదికే ‘ఎ.. ఐడియా!’. నూతన ఆవిష్కరణలు చేస్తున్న యువతకు వివిధ సంస్ధల ద్వారా ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
‘‘వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఫుడ్ ప్రోడక్ట్స్‌గా మార్చి వ్యవసా యాన్ని వ్యాపారంగా మార్చే దిశగా ఆలోచనలు ఉండాలి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అలాంటి 135 అంకుర సంస్థ లను ప్రోత్సహించాం. మారుమూల గ్రామీణ యువత తమ ఆలోచనలతో మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వెబ్‌సైట్లో (ుఽ్చ్చటఝ.ౌటజ.జీుఽ) అన్ని వివరాలులభిస్తాయి. మెరుగైన ఆవిష్కరణలకు 1 లక్ష నుంచి 25 లక్షల రూపాయల వరకు ఫండింగ్ ఇస్తాం.’’
- సి.హెచ్ శ్రీనివాసరావు, డైరెక్టర్ జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ
- శ్యాంమోహన్
94405 95858