ఈ కుక్క ధర 10 కోట్లు

ABN , First Publish Date - 2022-10-30T09:50:06+05:30 IST

సెలబ్రిటీ కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడటం చూస్తుంటాం... కానీ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక డాగ్‌ షోలో ఒక కుక్కతో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు.

ఈ కుక్క ధర 10 కోట్లు

సెలబ్రిటీ కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడటం చూస్తుంటాం... కానీ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక డాగ్‌ షోలో ఒక కుక్కతో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. ఎందుకో తెలుసా? ఆ కుక్క ధర అక్షరాలా రూ. 10 కోట్లు. ఇంతకీ ఆ కుక్క ప్రత్యేకతలేంటీ?

ఒక కుక్క ధర వేల రూపాయల్లో ఉంటుంది. మంచి బ్రీడ్‌ అయితే లక్షల్లో ఉంటుంది. కానీ ఈ కుక్క ధర రూ. 10 కోట్లు అంటే నమ్ముతారా? బెంగళూరుకు చెందిన సతీష్‌కుమార్‌ అనే వ్యక్తి ఇటీవలే ఈ కుక్కను చైనా నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దానికి ‘బీమా’ అని ముద్దు పేరు కూడా పెట్టారు. ‘టిబెటియన్‌ మస్టిఫ్‌’ జాతికి చెందిన ఈ కుక్కను శివమొగ్గ జిల్లాలో జరిగిన డాగ్‌ షోకి సదరు యజమాని తీసుకొచ్చారు. ఆ షోలో బీమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకేం... బీమాతో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. ఈ కుక్క నిర్వహణకు నెలకు 25 వేల వరకు ఖర్చవుతోందని యజమాని చెప్పారు. దానికోసం ప్రత్యేకమైన ఏసీ గదిని కూడా ఏర్పాటు చేశారట.

‘గార్డ్‌’ డాగ్‌...

ఎలుగుబంటిని పోలి ఉండే మస్టిఫ్‌కు ‘గార్డ్‌ డాగ్‌’గా గుర్తింపు ఉంది. పశువుల రక్షణ కోసం చైనీయులు, టిబెటియన్లు ఈ కుక్కను ఉపయోగిస్తారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి టిబెటియన్లకు మస్టిఫ్‌ గార్డ్‌ డాగ్‌గా పనిచేస్తూ విశ్వసనీయంగా ఉంటోంది. ఒక మస్టిఫ్‌ డాగ్‌ సుమారు 400 గొర్రెలకు కాపలా కాయగలదు. అలాగే ఒక కుక్కకు మూడు తోడేళ్లను మట్టి కరిపించే సామర్థ్యం ఉంటుంది.

మస్టిఫ్‌ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. పొరపాటున ఇంట్లోకి అపరిచితులు ప్రవేశిస్తే వారిపై దాడి చేస్తుంది. ఇతర జంతువులు ఇంట్లోకి ప్రవేశించినా దాడి చేసి చంపేస్తుంది. అంతెందుకు... రెండు టిబెటియన్‌ మస్టిఫ్‌లు ఒక సింహాన్ని సైతం పడగొడతాయి. ఇవి సాధారణంగా చల్లటి వాతావరణాన్ని ఇష్టపడతాయి. వేడి వాతావరణంలో ఇరిటేషన్‌కు లోనవుతాయి. పగటి వేళ సోమరిపోతులా కనిపించినా రాత్రివేళ చురుగ్గా కాపలా కాస్తుంది. అందుకే పగటి వేళ ఎక్కువసేపు నిద్రపోతుంటుంది.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కుక్కల జీవితకాలం 12 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. ఇవి 45 నుంచి 70 కిలోల బరువు ఉంటాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా బతకగలుగుతాయి. మైదాన ప్రాంతాల నుంచి హిమాలయాల వంటి ఎత్తైన పర్వత శ్రేణుల్లోనూ ఇవి జీవిస్తాయి. ఈ కుక్కను పెంచుకోవాలంటే ప్రత్యేక జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే యజమాని పట్ల ఇవి అత్యంత విశ్వసనీయంగా

ఉంటాయి

Updated Date - 2022-10-30T11:38:41+05:30 IST