భార్యను భుజాలపై ఎత్తుకొని తిరుమల మెట్లెక్కిన భర్త.. ఎందుకో తెలుసా...

ABN , First Publish Date - 2022-10-02T20:32:53+05:30 IST

కోరిన కోరికలు తీర్చే ఏడుకొండలవాడిని కాలినడకన దర్శించుకునే భక్తులు కనిపించడం సర్వసాధారణమే. ఇలాంటి భక్తులు పెద్దసంఖ్యలో కనపడుతుంటారు.

భార్యను భుజాలపై ఎత్తుకొని తిరుమల మెట్లెక్కిన భర్త.. ఎందుకో తెలుసా...

కోరిన కోరికలు తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామిని కాలినడకన దర్శించుకునే భక్తులను చూస్తూనే ఉంటాం. ఇలాంటి భక్తులు పెద్దసంఖ్యలో కనిపిస్తుండడం సర్వసాధారణమే. ఇక మరికొందరు భక్తులైతే మోకాలిపై తిరుమల మెట్ల మార్గాన్ని అధిరోహించి శ్రీవారిని దర్శించుకుంటుంటారు. ఇలాంటి భక్తులు తారసపడడమూ  ఏమంత ఆశ్చర్యం కలిగించింది. కానీ ఎవరైనా ఓ వ్యక్తి తన భార్యను భుజాలమీద ఎక్కించుకుని తిరుమల మెట్లు ఎక్కడం కాస్త ఆశ్చర్యం కలిగించక మానదు. అటుగా వెళ్తున్న భక్తుల దృష్టిని ఆకర్షించిన ఈ తరహా ఘటన ఒకటి ఆవిష్కృతమైంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు), తన భార్య లావణ్యను భుజాలపైకి ఎక్కించుకుని ఏకంగా 70 మెట్లు ఎక్కాడు. అంతలా ఏం మొక్కుకున్నారో ఏంటో అనుకుంటే పొరపాటే.


దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో భార్య విసిరిన సరదా సవాలును భర్త స్వీకరించడంతో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య.. ‘‘ మీరు ఎక్కడం కాదు. దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కండి’’ అని సవాలు విసిరిందట. సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కి ఆశ్చర్యపరిచాడు. కాస్త కొత్తగా అనిపించడంతో అటుగా వెళ్తున్న భక్తుల దృష్టిని సత్తిబాటు దంపతులు ఆకర్షించారు. కొందరైతే ఫోటోలు, వీడియోలు తీస్తూ కనిపించారు.


యువజంట అయ్యుంటారులే అనుకుంటే పొరపాటే..

సత్తిబాబు జంటను చూసి ఏదో కొత్తగా పెళ్లైనవారు అయ్యుంటారులే అనుకుంటే పొరపాటే. వీరికి పెళ్లై ఏకంగా 24 ఏళ్లు అయ్యిందట. వీరి వివాహం 1998లో జరిగిందట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఇద్దరమ్మాయికు పెళ్లిళ్లు చేశారు. వీరిద్దరూ అమ్మమ్మాతాతయ్యలయ్యారు. వీళ్ల పెద్ద  అల్లుడు గురుదత్త(చందు) మంచి సాప్ట్‌వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడట. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు తన భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లెక్కాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more