కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం భర్తకు పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన భార్య.. దీనిపై ఎలాంటి తీర్చు వచ్చిందంటే..
ABN , First Publish Date - 2022-01-28T02:41:52+05:30 IST
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఓ మహిళ గతంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోయంబత్తూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆమె భర్త జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెరోల్ పిటిషన్పై ..

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఓ మహిళ గతంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోయంబత్తూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆమె భర్త జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెరోల్ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఖైదీల శృంగార, దాంపత్య హక్కుల కోసం పెరోల్ ఇవ్వడంపై జైలు నిబంధనలేవీ రూపొందించలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి ఆ పిటిషన్ను బదిలీ చేస్తూ 2019లో సిఫారసు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారీ, న్యాయమూర్తులు జస్టిస్ పి.సత్యనారాయణ, జస్టిస్ ఆదికేశవులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. సాధారణ ప్రజల్లా స్వేచ్ఛను అనుభవించాలనుకుంటే కుదరదని, అందుకు తాము అనుమతించలేమని స్పష్టం చేసింది. అలాంటి ఖైదీకి అనుమతి ఇస్తే చట్టప్రకారం నడచుకునేవారికి, చట్ట వ్యతిరేకులకు తేడా లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. ఖైదీకి శృంగార, దాంపత్య హక్కును అనుమతించలేమని స్పష్టం చేస్తూ.. అసాధారణ పరిస్థితుల్లోనే పెరోల్ ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని తేల్చి చెప్పింది.