తీరా మూడు ముళ్లు వేశాక వధువు రివర్స్.. ఆ ఒక్క కారణం చూపి వద్దంటే వద్దంది.. చివరకు ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-01-27T23:51:24+05:30 IST
ఉత్తరప్రదేశ్లో ఓ వధువు.. తీరా తాళి కట్టిన తర్వాత ఇలాంటి భర్త తనకు వద్దంటే వద్దంటూ మొండికేసింది. కేవలం ఒకే ఒక్క కారణం చూపించి పెళ్లి క్యాన్సిల్ చేయాలని భీష్మించుకుంది. అసలేం జరిగిందంటే..
పెళ్లికి ముందు కొన్ని కారణాలు, పెళ్లి తర్వాత కొన్ని కారణాల వల్ల అనుకోని సమస్యలు తలెత్తుతుంటాయి. తద్వారా పెళ్లి పెటాకులవ్వడమో.. వైవాహిక బంధం మధ్యలోనే తెగిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కట్న కానుకలు, వివాహేతర సంబంధాలు తదితర కారణాల వల్లే.. సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్లో ఓ వధువు.. తీరా తాళి కట్టిన తర్వాత ఇలాంటి భర్త తనకు వద్దంటే వద్దంటూ మొండికేసింది. కేవలం ఒకే ఒక్క కారణం చూపించి పెళ్లి క్యాన్సిల్ చేయాలని భీష్మించుకుంది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాకు చెందిన విపిన్కుమార్కు డోలి అనే యువతితో వివాహం నిశ్చయమైంది. కట్న కానుకలన్నీ మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులందరినీ ఆహ్వానించి ఏర్పాట్లు ఘనంగా చేశారు. వివాహ తంతు కూడా గ్రాండ్గా జరిగింది. ఇక్కడ వరకు ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. అయితే తీరా అప్పగింతల సమయంలో సమస్య తలెత్తింది. పెళ్లి తర్వాత వరుడు పల్లెటూరులో నివాసం ఉంటాడని తెలిసింది. దీంతో వధువు ఒక్కసారిగా రివర్స్ అయింది. ‘‘పల్లెటూరిలో ఉండే భర్త నాకొద్దంటే వద్దు’’.. అంటూ భీష్మించుకుంది. ఆమె మాటలకు వరుడితో పాటూ పెళ్లికి వచ్చిన బంధువులంతా అవాక్కయ్యారు. మధ్యలో కొందరు పెద్దలు కలుగజేసుకుని, ‘‘ఇంత చిన్న కారణంతో భర్తనే కాదనుకుంటే ఎలాగమ్మా.. కొన్నాళ్లు పోతే ఏ సమస్యా ఉండదులే’’.. అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు
ఎవరెన్ని చెప్పినా వధువు మాత్రం తన తీరు మార్చుకోలేదు. పెళ్లి క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్ చేయడం మొదలెట్టింది. పేరుకే పల్లెటూరు అయినా తన భార్యకు ఎలాంటి కష్టం కలగనీయనంటూ వరుడు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా వధువు మాత్రం ఎవరి మాట వినలేదు. దీంతో అక్కడున్న వారందరికీ ఆశ్చర్యంతో పాటూ ఆవేశం కూడా వచ్చింది. అయినా చేసేదేమీ లేక చివరకు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. పెళ్లి వారి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని చెప్పారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది. ఎప్పటికైనా తమ కూతురు మనసు మార్చుకుంటుందిలే అని ఆమె తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి మరి.