chanakya niti: ఉత్తమ తల్లులకు ఉండాల్సిన లక్షణాలివే... అటువంటివారే పిల్లలను చక్కదిద్దగలరు!

ABN , First Publish Date - 2022-10-06T12:39:58+05:30 IST

ఆచార్య చాణక్య తాను తెలియజేసిన జీవన విధానాలలో...

chanakya niti: ఉత్తమ తల్లులకు ఉండాల్సిన లక్షణాలివే... అటువంటివారే పిల్లలను చక్కదిద్దగలరు!

ఆచార్య చాణక్య తాను తెలియజేసిన జీవన విధానాలలో మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగం, స్నేహం, వ్యక్తిగత జీవితంతో సహా జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో అతని అభిప్రాయాలు చాలా కఠినంగా అనిపిస్తాయి. వాటిలో ఉత్తమ తల్లికి ఉండాల్సిన లక్షణాల గురించి ఇలా తెలిపారు. 

ప్రశాంత స్వభావం

ప్రశాంత స్వభావం గల స్త్రీ లక్ష్మీ స్వరూపమని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటి స్త్రీలకు ఇంటిని ఆనందంగా తీర్చిదిద్దే శక్తి ఉంటుందన్నారు. అలాంటి స్త్రీ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. అలాంటి స్త్రీ పురుషుడిని ప్రగతి పథంలోకి తీసుకెళ్తుంది. ప్రశాంత చిత్తం గల ఇల్లాలు తన పిల్లలకు సద్గుణాలను అందిస్తుంది. ప్రశాంత వాతావరణంలో పిల్లల మానసిక వికాసం త్వరగా జరుగుతుంది. అలాంటి పిల్లలు చదువులో రాణిస్తారు.

విద్యావంతురాలు

విద్యావంతురాలు, సంస్కారవంతులు, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ తన భర్తకు అద్భుత వరం లాంటిది. అలాంటి మహిళ తన పిల్లలకు మంచి విలువలను అందిస్తుంది, ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటి స్త్రీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అటువంటి స్త్రీ నిజం చెప్పడానికి వెనుకాడదు. అలాంటి స్త్రీ కుటుంబం లేదా పిల్లల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా సరైనదే అవుతుంది.


చక్కగా మాట్లాడటం

మృదుస్వభావి అయిన స్త్రీ తన కుటుంబాన్ని స్వర్గంలా మారుస్తుంది. అలాంటి స్త్రీ తల్లి అయినప్పుడు, ఆమె లక్షణాలు పిల్లలకు సహజంగా అలవడుతాయని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటి పిల్లలు మంచి వక్తలుగా మారి తమదైన రంగంలో పేరు సంపాదించుకుంటారు. ఇలాంటివారిని అందరూ ఇష్టపడతారు. మృదుస్వభావి అయిన స్త్రీ తన తీయనైన మాటలతో అన్ని పరిస్థితులను చక్కదిద్దగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది.

సంతృప్తి కలిగివుండటం

పరిస్థితులకు అనుగుణంగా సద్దుకుపోయే ప్రవర్తన కలిగిన స్త్రీ తన భర్త, అత్తమామలకు ఆనందాన్ని అందిస్తుంది. అలాంటి స్త్రీ తన పిల్లలకు సుగుణాలను అందిస్తుంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. అలాంటి స్త్రీ భార్యగా లభించడం పురుషునికి వరంగా మారుతుంది. అలాంటి మహిళ తన పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. 



Updated Date - 2022-10-06T12:39:58+05:30 IST