Actress Lakshmi Birthday: లక్ష్మీ! వి లవ్ యూ.. తెలుగు సినీ ప్రపంచం సరిగా పట్టించుకోలేదు కానీ..

ABN , First Publish Date - 2022-12-13T11:16:44+05:30 IST

ఆ మాటకొస్తే, అసాధారణ ప్రతిభాశాలిని, అభినయ సౌందర్య స్వాతిశయ రూపిణి లక్ష్మిని తెలుగు సినీ ప్రపంచం సరిగా పట్టించుకోలేదు. ఆమె స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు.

Actress Lakshmi Birthday: లక్ష్మీ! వి లవ్ యూ.. తెలుగు సినీ ప్రపంచం సరిగా పట్టించుకోలేదు కానీ..

"నీ సమక్షంలో నేను సర్వం మర్చిపోతున్నా, ఈ ప్రపంచాన్నే నీ చిత్తరువుగా చేసుకుంటున్నా...(ఆ మై తెరా యాద్ మే సబ్ తో భూల్ దో... దునియా కొ తెరే తస్వీర్ బనాదో)" అంటూ ఆమెని చూసి పరవశించిపోయాడతను. అతను ఒక్కడేనా, ఆ తరం మొత్తం వివశమై ఆమె వశమైపోయి, 'దిల్ క్యా కరే జబ్ కిసీ సె, కిసీ కొ ప్యార్ హో జాయే (ఒకరి ప్రేమలో ఉన్నప్పుడు ఈ పిచ్చి హృదయం అంతకంటే ఏం చేస్తుందిలే)' అని పలవరించింది. 'జూలీ ఐ లవ్ యూ...' అని కలవరించింది ఆ తరం. ఆ వెండితెర వెలుగుజిలుగుల కలిమి- లక్ష్మిని చూడగానే 'మై హార్ట్ ఈజ్ బీటింగ్...' అనుకోనివారు లేరంటే కొంచెం కూడా అతిశయోక్తి లేదు.

'జూలీ' హిందీ సినిమా కదా, తెలుగు ప్రేక్షకులకి ఏం సంబంధం? తెలుగు ప్రేక్షకులకే ఎక్కువ అవసరం, మన ప్రేక్షక హృదయాలకే ఆమె ఎక్కువ దగ్గర. ఆ మాటకొస్తే, అసాధారణ ప్రతిభాశాలిని, అభినయ సౌందర్య స్వాతిశయ రూపిణి లక్ష్మిని తెలుగు సినీ ప్రపంచం సరిగా పట్టించుకోలేదు. ఆమె స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు. మరో సినిమా ఉంది- 'సిల నేరంగలిల్ సిల మణితారగళ్ ' అనే తమిళ చిత్రం. జేకే గా సుప్రసిద్ధుడైన తమిళ రచయిత జయకాంతన్ కి 1972లో సాహిత్య అకాడమీ అవార్డ్ తెచ్చిపెట్టిన 'సిల నేరంగలిల్ సిల మణితారగళ్ ' నవల ఆధారంగా, అదే పేరుతో ఆ సినిమా తీయబడింది. 'కొన్ని సమయాల్లో కొందరు వ్యక్తులు...' అని అర్థమున్న ఆ సినిమా తెలుగు వాళ్లకి తెలిసే అవకాశం ఉండేది కాదు, అందులో లక్ష్మీ నటించకపోతే. ఆ సినిమాలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి గంగ పాత్ర ధరించింది ఆమె. అనుకోని పరిస్థితుల్లో ఓ వర్షం కురిసిన సాయంత్రం ఓ అపరిచితుడికి లైంగికంగా లొంగిపోతుంది. జీవితాంతం అవే నీడలు ఆమెని వెంటాడుతూనే ఉంటాయి. ఆ సినిమాకి గాను లక్ష్మిని జాతీయ ఉత్తమనటి పురస్కారం వరించింది. ఒక సన్నివేశంలో ఫోన్ లో అవతలి వ్యక్తితో మాట్లాడుతూ అతని మాటలకు ప్రతిస్పందిస్తూ (ఆ వ్యక్తి తన ముందే ఉంటే ఎలా మాట్లాడుతుందో) అలా తన భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించినందుకు ఆమెకు ఉత్తమనటి అవార్డు ఇచ్చి ఉంటారని సినీ పండితులు చెబుతుంటారు. కళ్లెదుట లేని మనిషి మాటలకు స్పందిస్తున్నట్లుగా ఆమె నటించడం చూసి ప్రతి ప్రేకకుడూ ఆమె తనతోనే మాట్లాడుతోందన్న అనుభూతికి గురయ్యాడంటే కూడా అతిశయోక్తి కాదు.

మిథునం సినిమాలో 'ద్రాక్షారం సంబంధం లేదుట...' అని బుచ్చిలక్ష్మి భర్త నారదాసు సంతోషిస్తాడు. కానీ ప్రేక్షకుడు మాత్రం బాధ పడతాడు- లక్ష్మి వంటి అద్భుతమైన స్త్రీమూర్తికి ఇంకా ఏదో అతిలోక గంధర్వుడితో కళ్యాణం కావల్సి ఉండేదని. 'మిథునం' సినిమాలో నటించే నాటికి లక్ష్మికి 60 ఏళ్లు నిండాయి (1952లో డిసెంబర్ 13న మద్రాసులో పుట్టారు). అయినా, ఆమె ఆకర్షణ, ఆమె పట్ల ఆరాధన తగ్గలేదు. కొన్నేళ్ళ క్రితం విడుదలైన ‘ఓ బేబీ’ సినిమాలో 70 ఏళ్ళ వృద్ధురాలైన లక్ష్మి- 20 ఏళ్ళ సమంతాగా మారిపోతుంది. అయినా, ప్రేక్షక హృదయాల్లో 70 ఏళ్ళ లక్ష్మే కొలువైందంటే ఆమె అందం- అభినయాల మేలైన కలయిక కావడం వల్లనే.

Actress-Lakshmi-2.jpg


రచ్చ గెలిచింది గానీ...

పాతతరం తెలుగు హీరో దర్శకుడు, నిర్మాత యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) కుమార్తె అయిన లక్ష్మి రచ్చ గెలిచిందే గానీ, ఇంట గెలవలేదనే చెప్పాలి. లక్ష్మి తల్లి రుక్మిణి కూడా సినిమా నటే. రుక్మిణి తల్లి (లక్ష్మి అమ్మమ్మ) నుంగబాక్కం జానకి కూడా నటి. అంటే కళాకారుల కుటుంబంలో లక్ష్మిది మూడో తరం. నిండా 15 యేళ్లు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది గానీ, లక్ష్మీ నటించిన తొలి సినిమా తెలుగు కాదు, 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". తను నటించిన ఆరు భాషా చిత్రాల్లోనూ తానే డబ్బింగ్ చెప్పుకునే బహుభాషాకోవిదురాలు లక్ష్మిని సముచితంగా ఆదరించనిది తెలుగు సినీ రంగమే.

ఆమెకి ఎంతో పేరు తెచ్చిన 'జూలీ' హిందీలో తీయకముందు, 'చట్టకారి' (1974) గా ఆమెతోనే మలయాళంలో తీశాడు కె.ఎస్. సేతుమాధవన్. గొప్ప విజయం సాధించిన ‘చట్టకారి’ని జూలి పేరిట హిందిలో తీసాడు సేతుమాధవన్. ఆ సినిమాతో లక్ష్మి పేరు దేశమంతా మార్మోగిపోయింది. తెలుగు ప్రేక్షకుల కోసం అదే సినిమాని - 'మిస్ జూలీ ప్రేమకథ 'గా పునర్నిర్మించి విడుదల చేసినా అంత ఆదరణ లభించలేదు. ఏ సినిమాలో నటించినా, అది ఏ భాషా చిత్రమైనా దాని మీద లక్ష్మి తనదైన ముద్ర వేస్తుంది. భాషల్లో 400 చిత్రాలకు పైగా నటించింది. నేటికీ టెలివిజన్ లో ‘టాక్ షో’లు ఇస్తూ ఉంది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది.

ఇల్లే తొలి పాఠశాల

తండ్రి వైవీరావు గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత. సాంఘిక సంస్కరణాభిలాషతో 1939 లోనే ఆయన ‘మళ్లిపెళ్లి’ అనే ఆదర్శవంతమైన కథాంశంతో ఒక సినిమాని రూపొందించారు. సినీనటి జీవితాన్ని ఫిలిం ఫీల్డ్ ను నేపథ్యంగా చేసుకొని ఇప్పుడు ఎవరైనా ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాలు తీస్తుంటే విశేషంగా చెప్పుకుంటున్నారు కానీ, వైవీ రావు 1940లోనే ఆ తరహా చిత్రం ‘విశ్వమోహిని’ లో హీరోగా నటించారు. సినిమా జీవుల జీవితాలు నేపథ్యంగా వచ్చిన తొలి తెలుగు సినిమా అదేనని నేటికీ చెప్పుకుంటారు. ఇక అమ్మ, అమ్మమ్మ మంచి నటీమణులు. ఇక లక్ష్మికి నటనలో ఓనమాలు దిద్దించిన తొలి పాఠశాల ఇల్లే కావడంలో ఆశ్చర్యమేముంది? తొలి పాఠశాలే కాదు, మలి పాఠశాల కూడా అదే. నటనకు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవడమే గానీ, లక్ష్మి నటనలో ఎక్కడా ప్రత్యేకంగా శిక్షణ పొందలేదు.

కెరీర్ ప్రారంభం అయిన తర్వాత కూడా దర్శకులు చెప్పిన సూచనలు శ్రద్ధగా విని అర్థం చేసుకోవడం, సెట్ మీద ఇతర నటీనటులు, సీనియర్లు ఎలా నటిస్తున్నారనేది పరిశీలించడం, నటనలో పొరపాట్లు దొర్లినప్పుడు వాటిని సరిదిద్దుకొని అటువంటివి మళ్ళీ చేయకపోవడం, దేశవిదేశీ సినిమాలను అధ్యయనం చేయడం ద్వారా పాఠాలు నేర్చుకున్నారు లక్ష్మి. అమ్మానాన్నా ఇద్దరూ సినిమా ప్రముఖులు కావడం వల్ల లక్ష్మికి సినిమారంగం సొంత కుటుంబం వంటిది. కాబట్టి, చిన్ననాట మద్రాసులో స్కూలు చదువులప్పటికే బాలనటిగా తన తొమ్మిదవయేట ‘శ్రీవల్లి’ అనే తమిళ చిత్రంలో మొదటిసారిగా నటించింది. నిండా పదహారేళ్ళు లేకుండానే హీరోయిన్ గా నటించింది కూడా తమిళ చిత్రమే- 'జీవనాంశమ్' ! ఆ సంవత్సరమే అంటే 1968లోనే ‘బాంధవ్యాలు’ లో సావిత్రికి కూతురుగా నటించి తెలుగువారికి పరిచయం అయినా, ఆమెని ఎక్కువ చెల్లి, కూతురు వంటి సహాయక పాత్రలకే పరిమితం చేసింది తెలుగు సినీ రంగం. ‘జీవన తరంగాలు’, ‘పల్లెటూరి బావ’, ‘సుపుత్రుడు’, ‘పుట్టినిల్లు-మెట్టినిల్లు’, ‘అందరూ దొంగలే’, ‘బంగారు కలలు’, ‘అమ్మాయిల శపథం’, ‘చట్టానికి కళ్ళు లేవు’… వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అయితే, అవన్నీ ఒకెత్తు, 1978లో లక్ష్మి టైటిల్ రోల్ పోషించిన ‘పంతులమ్మ’ చిత్రం ఒక్కటే ఒకెత్తు.

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

వరదల్లె రావే వలపంటే నీవే

ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే.. అని ఆ చిత్ర కథానాయకుడు రాజేష్ (రంగనాథ్) మాత్రమే కాదు, ఆమెని వెండితెర మీద వేల్పులా వెలిగిన ఆమెని చూసి మైమరిచిన ప్రతి ప్రేక్షకుడూ అనుకున్నాడు:

"తొలి పూత నవ్వే వన దేవతల్లే

పున్నాగ పూలే సన్నాయి పాడే

ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే.." అని.

ఆ తర్వాత నలభై ఏళ్లకు పైగా అనేకానేక పదాల్ని.. పాదాల్ని.. భావాల్నీ దాటొచ్చినా, ఆ తరం అభిమానిని మాత్రం ఆ పాట, ఆ పాటకి ప్రాణం పోసిన ఆమె రూపం వదల్లేదు.

'ఎలదేటి పాట చెలరేగే నాలో

చెలరేగిపోవే మధుమాసమల్లె..

ఎలమావి తోట పలికింది నాలో

పలికించుకోవే మది కోయిలల్లే..'

'ఎలదేటి' - అంటే ఏమిటో తెలియకుండానే ఆ వేటూరి పదానికి ఫిదా అయిపోయిందా తరం. ‘ఎలదేటి’ - అన్న పదమే ఒక వెదుకులాటకి పురికొల్పింది. ఎలదేటి అంటే తేనెటీగ అని తెలుసుకున్నాక..

"మారాకు వేసే నీ రాకతోనే

నీ పలుకు పాటై బ్రతుకైన వేళ

బ్రతికించుకోవే నీ పదముగానే

నా పాదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగామల్లె సుమగీతమల్లె

నన్నల్లుకోవే నా ఇల్లు నీవే.." అని ఆ తరం అంతా ఒక్క గొంతుకై కోరస్ కలిపింది. 'నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే..' అని లక్ష్మికి, ఆమె నటనకీ సాగిల పడింది.

గురుదత్ 'ప్యాసా' ఆధారంగా తీసిన ‘మల్లెపువ్వు’ సినిమాలో లో వేశ్యగా ఆమె నటన అత్యున్నత శిఖరాలని అధిరోహించింది. మెప్పించింది. అలాగే ‘శ్రావణ మేఘాలు’, ‘మురారి’, ‘నిన్నేపెళ్ళాడుతా’ వంటి చిత్రాలు లక్ష్మికి అవార్డులతో పాటు విశేషమైన పేరు తెచ్చాయి.

కన్నడంలో తొలి చిత్రంలోనే ఆమె అగ్రనటుడు రాజ్ కుమార్ సరసన నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో లక్ష్మి ప్రముఖ హీరోలందరితోనూ నటించారు. లక్ష్మి సాంఘిక చిత్రాల్లోనే కాదు. పౌరాణిక,చారిత్రక చిత్రాల్లోనూ రాణించింది. హాస్య పాత్రల్లోనూ పేరు తెచ్చుకుంది. ఏ భాషలో నటించినా ,తన డైలాగ్స్ తానే చెప్పుకునేది. కష్టపడి నేర్చుకొని నటిస్తున్నప్పుడు తన భావోద్వేగాలు ఎలా ఉంటాయో అదే మోతాదులో సంభాషణలు పలకడం ఒరిజినల్ ఆర్టిస్ట్ కే సాధ్యమని మరొకరిచేత డబ్బింగ్ చెప్పిస్తే అది సహజంగా ఉండదని ఆమె వాదం!

Actress-Lakshmi-3.jpg


లక్ష్మి 'మార్క్' పాత్రలు!

తనలో నటిని తృప్తి పరుచుకునే పాత్రల పట్ల లక్ష్మిది ప్రత్యేక శ్రద్ధ. అటువంటి సినిమాలకి ఆమె తన పారితోషికం కూడా తగ్గించుకుంటుందని ఆమే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. 1973లో ఆమె కథా నాయికగా నటించిన ‘దిక్కట్ర పార్వతి’ అనే తమిళ చిత్రం. ఈ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. పేదల జీవితాలను మద్యపాన వ్యసనం ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందన్న ఇతివృత్తంతో ఓ కథ రాశారు ప్రసిద్ద రాజకీయవేత్త. జాతీయ నాయకుడు రచయిత ‘రాజాజీ’గా అందరికీ తెలిసిన చక్రవర్తి రాజగోపాలచారి.

తమిళంలో రాసిన ఆ 'దిక్కట్ర పార్వతి (దిక్కులేని పార్వతి)' కథను చదివిన సింగీతం శ్రీనివాసరావు, ఆ కథను సినిమాగా తీస్తే ప్రజలకు కనువిప్పుగా ఉంటుందని భావించారు. సినిమాలంటే ఇష్టపడని రాజాజీని కలిసి, కన్విన్స్ చేసి ఒప్పించారట సింగీతం. అది ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో కథకు సినిమా హక్కులు ఉచితంగా ఇవ్వడానికి కూడా రాజాజీ ముందు కొచ్చారంటే, సింగీతం ఆయనని ఎలా ఇంప్రెస్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నామ మాత్రంగా కేవలం ఒక్క రూపాయి తీసుకొని హక్కులు రాసి ఇచ్చారట రాజాజీ. బ్లాక్ అండ్ వైట్ లో నూరు నిముషాల వ్యవధి గల ఈ చిత్రాన్ని ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, హెచ్.వి. సంజీవ రెడ్డి నిర్మించారు. ప్రఖ్యాత వీణ విద్వాన్ చిట్టిబాబు సంగీతాన్ని, ప్రముఖ ఛాయా గ్రహకుడు రవి వర్మ ఛాయా గ్రహణాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి 1973లో ఉత్తమ తమిళ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం లభించింది. నెగెటివ్ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వమే కొని, చిత్రాన్ని వాడవాడలా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయడం విశేషంగా చెప్పుకుంటారు. అందులో కథానాయిక పార్వతిగా లక్ష్మి అసాధారణ నటనని ప్రదర్శించింది.

మనిషిని మరణభయం ఎందుకు వెన్నాడుతోంది? దాన్నెలా అధిగమించాలి? అనే లోతైన ఆధ్యాత్మికాంశాన్ని తాండవాల రూపంలో ‘సింబాలిక్’ గా చెబుతూ ఓ కథను రూపొందించారు దర్శక నిర్మాత డా. ఎ. రఘురామిరెడ్డి. 1987లో ‘ఆనందతాండవం’ పేరుతో వెలువడిన ఈ విభిన్న తరహా చిత్రంలో లక్ష్మి డాక్టర్ పాత్రను పోషించారు. మోహన్ శర్మ, సత్యనారాయణ, జె.వి.సోమయాజులు, దీప ముఖ్య పాత్రలు ధరించిన ఈ చిత్రానికి ఛాయా గ్రాహకుడు మధు కాగా, ఎల్.వైద్య నాథన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ తరహా చిత్రాలలో నటించడం వల్ల ఆర్టిస్టులుగా మాకు మేథోమథనం జరిగి,మంచి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అందుకే అటువంటి చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోను అంటారామె ఆ ఇంటర్వ్యూలో.

కన్నడ, తమిళ ప్రేక్షకులకు దర్శకురాలిగా కూడా పరిచయమయ్యారు లక్ష్మి. హాస్య ప్రధానమైన చిత్రం ‘మక్కళసైన్య’ గా కన్నడం, అదే చిత్రాన్ని ‘మళలై పట్టాళo’ తమిళంలోనూ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తెలుగులో మురళీమోహన్ సరిత ప్రధానపాత్రలుగా ‘రామదండు’గా వచ్చింది.

లక్ష్మి వ్యక్తిగత జీవితం అనేక వివాదాలమయం. ముక్కుసూటితనం, ధీరగుణం ఉన్న ఏ స్త్రీ జీవితంలో అయినా సవాళ్లు, ఎదురుదెబ్బలూ సహజమే. స్త్రీ తన స్వేచ్ఛ కోసం, సమానమైన హక్కుల కోసం తపనపడితే ఆమె జీవితాన్ని సుడిగుండంలో నెట్టడానికే ప్రపంచమంతా చూస్తుంది. ఆ సుడిగుండాన్ని ఎదురీది గెలిచి నిలిచే లక్ష్మి వంటి వారు అరుదు. ఆమె తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ, ఆమె పాల్గొనే టీవి టాక్ షోల వల్ల, ఆ షోలలో ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఆమె తీరు వల్ల ఆమె జీవితంలో ఆటుపోట్లు, ఆమె ఆలోచనలూ బైటకి తెలుస్తుంటాయి. వృత్తి ప్రవృత్తులలో కూడా కథానాయిక అయిన ఆమె గురించి అందుకే అభిమానుల మనసులు పలవరిస్తుంటాయి.

జూలీ... వి లవ్ యూ!

Updated Date - 2022-12-13T14:18:35+05:30 IST