Ram Jethmalani: జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు వినిపించిన రామ్ జెఠ్మలానీ ఎందుకంత పాపులర్ అంటే..

ABN , First Publish Date - 2022-09-08T19:27:20+05:30 IST

సమాజంలో చాలామంది తాము ఎంచుకుని ముందుకెళుతున్న రంగాల్లో తమదైన ముద్ర ఉండాలని భావిస్తుంటారు. కొందరు ఆ సమాజంలో చాలామంది తాము ఎంచుకుని ముందుకెళుతున్న రంగాల్లో తమదైన ముద్ర ఉండాలని భావిస్తుంటారు. కొందరు ఆ దిశగా వడివడిగా అడుగులేస్తూదిశగా వడివడిగా అడుగులేస్తూ..

Ram Jethmalani: జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు వినిపించిన రామ్ జెఠ్మలానీ ఎందుకంత పాపులర్ అంటే..

సమాజంలో చాలామంది తాము ఎంచుకుని ముందుకెళుతున్న రంగాల్లో తమదైన ముద్ర ఉండాలని భావిస్తుంటారు. కొందరు ఆ దిశగా వడివడిగా అడుగులేస్తూ లక్ష్య సాధన దిశగా ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో ఎన్నో అవాంతరాలు, వివాదాలు చుట్టుముడుతుంటాయి. ‘ఎందుకొచ్చిన గొడవ రా బాబూ’ అని కొందరు ఈ దశలోనే ప్రయత్నాలను విరమించుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోయి గుంపులో ఒకరిగా బతికేస్తుంటారు. మరికొందరు మాత్రం.. అవేవీ లెక్కచేయక, అదరకబెదరక వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను ఛాలెంజ్‌గా స్వీకరించి.. ఆటుపోట్లకు తట్టుకుని నిలబడి తమ ప్రతిభను నిరూపించుకుంటారు. అలాంటి వారినే ఈ సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆ వ్యక్తులు కాలం చేసినా తమ వృత్తిలో వారు చూపిన నిబద్ధత మాత్రం ఎన్నటికీ కాలగర్భంలో కలిసిపోదు. నమ్ముకున్న వృత్తిలో వెన్ను చూపక చెరగని ముద్ర వేసిన అలాంటి వ్యక్తుల్లో సీనియర్ న్యాయవాది, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కేబినెట్‌లో న్యాయ శాఖా మంత్రిగా పనిచేసిన దివంగత రామ్ జెఠ్మలానీ (Ram Jethmalani) ఒకరు. ఆయన కాలం చేసి మూడేళ్లయినా దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, కేసుల గురించిన చర్చ వస్తే రామ్ జెఠ్మలానీ ప్రస్తావన లేకుండా ఆ చర్చ సంపూర్ణం కాదనడంలో సందేహమే లేదు. రామ్ జెఠ్మలానీ మూడో వర్థంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన చుట్టూ రేగిన వివాదాలు, రామ్ జెఠ్మలానీ వాదించిన ప్రముఖ కేసులపై ప్రత్యేక కథనం.17 ఏళ్లకే న్యాయవాద డిగ్రీ పొంది..

భారతీయ న్యాయ వ్యవస్థలో రామ్ జెఠ్మలానీ చెరగని ముద్ర వేశారు. ఆయన కెరీర్ గురించి తెలియాలంటే 1940 రోజుల్లోకి వెళ్లాల్సిందే. ‘షహానీ లా కాలేజ్’లో 17 ఏళ్ల వయసులోనే జెఠ్మలానీ న్యాయవాద డిగ్రీ పొందారు. అతి తక్కువ వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయవాద వృత్తిలోకి అరంగేట్రం చేశారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. జెఠ్మలానీ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన రోజు నుంచే ఆయనకు వృత్తిపరమైన సవాళ్లు స్వాగతం పలికాయి. టీనేజర్‌గా ఉన్న సమయంలోనే న్యాయవాద పట్టా పొందిన జెఠ్మలానీ సింధ్ హైకోర్టులో తొలి కేసును వాదించారు. ఆయన న్యాయవాదిగా కేసు వాదించేందుకు ముందుకొచ్చిన సమయంలోనే తొలి సవాల్ ఎదురైంది. 21 ఏళ్ల వయసు ఉంటేనే న్యాయవాదిగా ఒక కేసు వాదించే అర్హత ఉంటుందని.. జెఠ్మలానీకి వయసు సరిపోదని కొందరు న్యాయవాదులు మోకాలడ్డారు. అయితే.. ఏమాత్రం అదరక ఇంగ్లీష్ జడ్జ్ సర్ గాఢ్‌ఫ్రే డేవిస్ (ఆ సమయంలో సింధు హైకోర్టు చీఫ్ జస్టిస్) ముందు కేసులో వాదనలు వినిపించేందుకు జెఠ్మలానీ చేసిన ప్రయత్నాలు వృథా కాలేదు. టీనేజర్‌గా అయి కూడా అంత ధైర్యంగా జెఠ్మలానీ ముందుకు రావడం చూసి సర్ డేవిస్ కూడా జెఠ్మలానీకి అవకాశమిచ్చేందుకు ఆసక్తి చూపారు. ‘Young man, don’t worry about it. I will do something for you’ అని అభయమిచ్చారు. వయసు విషయంలో ఉన్న నిబంధనను సవరించి 18 ఏళ్ల వయసులోనే కేసులో వాదనలు వినిపించేందుకు రామ్ జెఠ్మలానీకి అవకాశం ఇచ్చారు.


ముఖ్యమంత్రి అమలు చేసిన చట్టాన్నే సవాల్ చేసి..

ఏకే బ్రోహీ (సీనియర్ న్యాయవాది అయిన ఈయన ఆ తర్వాత పాకిస్థాన్ న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు) దగ్గర ‘లా’ ప్రాక్టీస్ చేశారు. 1947లో రామ్ జెఠ్మలానీకి మరో చిక్కు ఎదురైంది. ఒక హిందువుగా పాకిస్థాన్‌లో ఉన్న సింధ్‌లో నివసించడం ఆయనకు కష్టతరమైంది. బ్రోహి కూడా రామ్ జెఠ్మలానీని భారత్‌కు వెళ్లిపోవాలని సూచించారు. రామ్ జెఠ్మలానీకి తాను భద్రత కల్పించలేనని బ్రోహి స్పష్టం చేయడంతో ఇక చేసేదేమీ లేక రామ్ జెఠ్మలానీ బొంబాయికి వచ్చారు. ఆయనకు బొంబాయికి వచ్చాక కూడా ఊహించని సవాల్ ఎదురైంది. రామ్ జెఠ్మలానీ బొంబాయికి వెళ్లినప్పుడు మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో Bombay Refugees Act అనే చట్టాన్ని మొరార్జీ సర్కార్ అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పాకిస్థాన్ నుంచి వచ్చి బొంబాయిలో ఉన్న వారికి అక్కడి నివసించే హక్కు లేదు. తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలనేది ఆ చట్టం సారాంశం. బొంబాయి హైకోర్టులో ఈ యాక్ట్‌ను సవాల్ చేసి రామ్ జెఠ్మలానీ విజయం సాధించారు. దీంతో.. రామ్ జెఠ్మలానీకి పాక్ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. ఆ తర్వాత.. కేఎం నానావతి కేసుతో రామ్ జెఠ్మలానీ ప్రతిభ ఏంటో దేశానికి తెలిసింది. ఈ కేసు ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ‘Rustom’ అనే సినిమా కూడా తెరకెక్కిందంటే.. అప్పట్లో ఈ కేసు ఎంత చర్చకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రామ్ జెఠ్మలానీ వాదించిన ఈ కేసు ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా..

ఇండియన్ నేవీ కమాండర్ కేఎం నానావతి తన భార్య సిల్వియా ప్రియుడు అయిన ప్రేమ్ అహుజాను హత్య చేశాడు. ఇండియాలో జ్యురీ ట్రయల్ విధానంలో వాదనలు జరిగిన చివరి కేసుల్లో ఇదొకటి కావడంతో మీడియా అప్పట్లో ఈ కేసును ప్రధానంగా హైలైట్ చేసింది. ఈ కేసులో నేవీ అధికారిపై జ్యురీ సానుభూతి చూపడంతో కేఎం నానావతి నిర్దోషిగా బయటపడ్డారు. అయితే.. సెషన్స్ జడ్జి ఈ కేసును బొంబాయి హైకోర్టుకు బదిలీ చేశారు. తొలుత.. నానావతి తరపున వాదనను వినిపించిన న్యాయవాది నేవీ అధికారి ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని, క్షణికావేశంలో జరిగిన ఒక చర్యగా మాత్రమే చూడాలని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ప్రేమ్ అహూజా తరపున రామ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన హత్య అని, ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని కోర్టు ముందు జెఠ్మలానీ వాదనలు బలంగా వినిపించారు. నిమిషంలో నాలుగు సార్లు కాల్పులు జరిపి నిందితుడు హత్యకు పాల్పడ్డాడని జెఠ్మలానీ కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రామ్ జెఠ్మలానీ వాదనను సమర్థించి నానావతిగా దోషినా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నానావతి సుప్రీం కోర్టుకు వెళ్లినా అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. సుప్రీం కోర్టు కూడా బొంబాయి హైకోర్టును తీర్పును సమర్థించింది. అయితే.. మూడేళ్లు ఈ కేసులో నానావతి జైలు శిక్ష అనుభవించాక అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష ప్రసాదించారు.


ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య కేసుల్లో నిందితుల తరపున నిలిచి..

ఇక.. రామ్ జెఠ్మలానీ వాదించిన ప్రముఖ కేసుల్లో మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య కేసులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ హత్య కేసులో అప్పటికి నిందితులుగా ఉన్న బల్బీర్ సింగ్, కెహర్ సింగ్ తరపున రామ్ జెఠ్మలానీ కోర్టులో వాదనలు వినిపించారు. ఇందిరాగాంధీ హత్య కేసులో డాక్టర్ ఇచ్చిన Medical Evidence ను కోర్టులో జెఠ్మలానీ ఛాలెంజ్ చేశారు. ఈ పరిణామం రామ్ జెఠ్మలానీపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. అయితే.. ఆ విమర్శలను రామ్ జెఠ్మలానీ పట్టించుకోలేదు. ఒక న్యాయవాదిగా తన విధిని తాను నిర్వర్తిస్తున్నానని జెఠ్మలానీ సమర్థించుకున్నారు. ఇదే విధంగా.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కూడా జెఠ్మలానీ అప్పటికి నిందితులుగా ఉన్న సంతాన్, మురుగన్, పెరరివళన్ తరపున వాదనలు వినిపించారు. వారికి విధించిన ఉరి శిక్షను మార్పు చేయాలని సుప్రీం కోర్టులో పోరాడారు. సుదీర్ఘ వాదనల అనంతరం 2014లో సుప్రీం కోర్టు ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేస్తూ తీర్పు వెల్లడించింది.వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో..

రామ్ జెఠ్మలానీ వృత్తిపరమైన జీవితంలో జెస్సికా లాల్ హత్య కేసు, ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసు, అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసు ప్రముఖంగా చెప్పుకోతగ్గవిగా నిలిచాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా రామ్ జెఠ్మలానీ జగన్ తరపున వాదనలు వినిపించారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చర్చకు దారితీసిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు మూలాన రామ్ జెఠ్మలానీ తెలుగు వారికి కూడా సుపరిచితులయ్యారు. ఎలాంటి కేసునైనా, ఆ కేసులో వాదనలు వినిపిస్తే తనపై విమర్శలు వస్తాయన్న సంగతి తెలిసినప్పటికీ రామ్ జెఠ్మలానీ వెనుకడుగు వేయకపోవడం ఆయన వృత్తి ధర్మానికి ఎంత విలువ ఇస్తారో చెప్పకనే చెబుతుంది.


విమర్శలపై ఈ Devil’s Advocate ఏమనేవారంటే..

రామ్ జెఠ్మలానీకి దేశంలోనే అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాదిగా పేరుండేది. ఆయన ఒక కేసులో వాదనలు వినిపిస్తున్నారంటే నిమిషాలకు కొన్ని లక్షలు ఛార్జ్ చేసేవారని చెప్పుకునేవారు. అంతేకాదు.. ఆయన వాదించిన చాలా కేసుల్లో నిందితుల పక్షాన వాదనలు వినిపించి విమర్శల పాలయ్యారు. Devil’s advocate అనడానికి రాం జఠ్మలానీ అన్ని విధాలా అర్హులనే భావన కూడా ఉండేది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హంతకుల తరఫున, పార్లమెంటు మీద దాడి చేసిన కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురు పక్షాన, రేప్ కేసులో ముద్దాయి అయిన ఆశారాం బాపు, జెస్సికా లాల్‌ని కాల్చి చంపిన మను శర్మ వైపు నిలబడి వాదించిన న్యాయవాది రామ్ జెఠ్మలానీనే. అయితే.. తనపై వచ్చిన విమర్శలన్నింటికీ ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే. ‘ఏ వ్యక్తినైతే నేరస్థుడిగా ప్రజలు నమ్ముతారో ఆ వ్యక్తి తరఫున వాదించడానికి నిరాకరించే న్యాయవాది వృత్తిద్రోహమనే నేరం చేసినవాడే’ అని ఓ ఇంటర్వ్యూలో రామ్ జెఠ్మలానీ అన్నారు. ఏదేమైనా రామ్ జెఠ్మలానీ వృత్తిపరమైన జీవితం న్యాయ రంగంలో రాణించాలని భావించే ఔత్సాహికులకు ఒక పాఠం లాంటిదనే చెప్పాలి.


సాంబశివారెడ్డి పేరం

Read more